మతోన్మాదం శాంతికి విఘాతం
క్రైస్తవులపై దాడుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి
అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ డిమాండ్
విజయవాడ (గాంధీనగర్) :
మతోన్మాదంతో కొందరు దేశంలోని క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నారని, దీనివల్ల శాంతి నశిస్తోందని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షులు గేరా హనోక్ అన్నారు. క్రైస్తవులపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం జాతీయ స్థాయిలో ‘ క్రైస్తవ సమాఖ్య గర్జన’ను విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 26 ప్రకారం ప్రతిఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఉందని చెప్పారు. మతమార్పిడుల పేరుతో ఫాదర్లు, పాస్టర్లు, బిషప్‌లపై భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. మతతత్వదాడులను తిప్పికొట్టేందుకు ప్రతి క్రైస్తవుడు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లిం ఇమాంలకు, హిందూ పూజార్లకు ఇస్తున్నట్లుగా పాస్టర్లకు కూడా ప్రభుత్వమే గౌరవ వేతనాలు ఇవ్వాలని, అభివృద్ధి పేరుతో కూల్చేస్తున్న క్రైస్తవ చర్చిల పునర్నిర్మాణానికి నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు అద్దంకి దైవారావు, చిత్తూరు జిల్లా నుంచి పి. జాన్‌ప్రసాద్, నెల్లూరు నుంచి కె. జోసఫ్ మోజెస్, ప్రకాశం జిల్లా నుంచి బిషప్ సంసోన్, గుంటూరు జిల్లా నుంచి వై. శామ్యూల్ జాన్, కృష్ణా జిల్లా నుంచి కె. జోసఫ్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి డాక్టర్ డేవిడ్ లివింగ్‌సన్, తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎన్. నోవా, విశాఖపట్నం జిల్లా నుంచి బిషప్ డాక్టర్ జాన్ సమర్పణరాజు, విజయనగరం జిల్లా నుంచి డాక్టర్ ఆర్. జాన్, శ్రీకాకుళం జిల్లా నుంచి డీఎస్‌వీఎస్ కుమార్, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి క్రైస్తవ మత పెద్దలు, 13 జిల్లాల నుంచి పలువురు పాస్టర్లు, ఫాదర్లు పాల్గొన్నారు.