సూక్ష్మంలో మోక్షం
గ్రహదోషాలు కలిగిన వారు కొన్ని సూక్ష్మమైన పరిహారాలు చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. వాటి వివరాలు ఇలా... రవి (సూర్యుడు)దోషం కలిగిన వారు ఆదిత్య హృదయం పఠించి ఐదు ఆదివారాలు ఆవుపాలతో చేసిన పొంగలి నివేదించాలి. అలాగే, చివరి వారం గోధుమలు దానం చేయాలి. చంద్ర దోషం కలిగిన వారు దుర్గాదేవిని ఆరాధించాలి. అలాగే, మూడు సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది. బియ్యం దానం చేయాలి. కుజ (అంగారకుడు) దోషం కలిగిన వారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి. అలాగే మూడు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించుకుంటే మంచిది. కందులు దానం చేయాలి.-రాహు దోషం కలిగిన వారు దుర్గాదేవికి ఐదు శుక్రవారాలు కుంకుమార్చన చేసి, చివరి వారం గారెలు నివేదించండి. మినుములు దానం మంచిది.
గురుదోషం కలిగిన వారు గణేశాష్టకం, రుద్ర నమకం పఠించి, మూడు లేదా ఐదు గురువారాలు శివాలయంలో 11చొప్పున ప్రదక్షణలు చేయాలి. చివరి వారం సెనగలు దానం మంచిది. శని దోషం కలిగిన వారు ఆంజనేయస్వామికి అర్చనలు చేయాలి. అలాగే, నువ్వులు దానం చేయాలి. బుధదోషం కలిగిన వారు విష్ణుపూజలు, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. తులసీదళాలతో విష్ణ్వాలయంలో అర్చన చేయించాలి. బుధవారం తీపి వంటకం నివేదించండి. పెసలు దానం మంచిది.కేతు దోషం కలిగిన వారు సూర్యారాధన చేయడం మంచిది. ఉలవలు దానం చేస్తే ఫలితం ఉంటుంది. శుక్రదోషం కలిగిన వారు ఐదు శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చలు చేసి, చివరి వారం పులిహోర నివేదించండి. అలాగే, బొబ్బర్లు దానం మంచిది.ఐదు శనివారాలు రావిచెట్టు చుట్టూ 11చొప్పున ప్రదక్షణలు చేసి చీమలకు ఆహారం సమర్పిస్తే సకలదోషాలు తొలగుతాయి.