మంజీర నదిలో మొసలి కలకలం
ఆందోళనలో రైతులు
కౌడిపల్లి: చండూర్ సమీపంలోని మంజీర నదిలో శనివారం మొసలి కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంజీర నదిపై చండూర్ ఎత్తిపోతల పథకం సమీపంలో మోటార్ల మరమ్మతు కోసం రైతులు ఏడెడ్ల మడుగులో దిగగా మొసలి కనిపించడంతో ఆందోళనకు గురై ఒడ్డుకు పరుగులు తీశారు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో నది పూర్తిగా ఎండిపోయింది. ఘణపూర్ ఆనకట్టకు సింగూర్ నుంచి నీటిని విడుదల చేశారు.
కాలువలో నీరు రావడంతో పలువురు రైతులు నదిలో మోటార్లను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మడుగులో మొసలి కనిపించడంతో తహసీల్దార్ నిర్మల, ఆర్ఐ కిషోర్కుమార్కు సమాచారమిచ్చారు. రెవెన్యూ అధికారులు అటవీ అధికారులకు సమాచారమిచ్చి ప్రజలను అప్రమత్తం చేశారు.