ఇందిర హిట్లర్ కాదా?
- కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిట్లరిజం ఉంది
- రాహుల్ గాంధీ వేర్పాటువాదుల గొంతుకలా మారారు
- జేఎన్ యూ వివాదంపై బీజేపీ చీఫ్ అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహణతో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మొదలైన రగడ రోజురోజుకూ పెద్దదవుతోంది. కార్యక్రమాన్ని నిర్వహించినవారిని విడుదల చేయాలంటూ కొందరు చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు పలకడంపై బీజేపీ చీఫ్ అమిత్ షా ఘాటుగా స్పందించారు. జాతివ్యతిరేకతకు, జాతీయభావానికి మధ్య తేడాను రాహుల్ గుర్తించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆ మేరకు సోమవారం తన బ్లాగులో కామెంట్లను పోస్ట్ చేశారు అమిత్ షా.
'జేఎన్ యూలో విద్యార్థులు చేసింది ముమ్మాటికీ జాతివ్యతిరేక చర్యే. రాహుల్ గాంధీ, మరికొద్ది మంది నాయకులు ఆ చర్యను సమర్థించడం అవగాహనా రాహిత్యమే. రాహుల్ ముందు ఆ రెండు పదాలకు మధ్య తేడాను తెలుసుకోవాలి. జేఎన్ యూకు వెళ్లిన ఫక్తు వేర్పాటువాదుల అద్దెగొంతుకలా మాట్లాడారు. జాతివ్యతిరేకులకు వత్తాసుపలకడం ద్వారా ఆయన దేశాన్ని విభజించాలనుకుంటున్నాడేమో' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అమిత్ షా.
మోదీ పాలన జర్మనీలో హిట్లర్ పాలనను తలపిస్తోందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ .. ఎమర్జెన్సీ విధించడం ద్వారా ఇందిరా గాంధీయే హిట్లర్ లా వ్యవహరించారని, ఆమె హిట్లర్ అవునో కాదో కాంగ్రెస్ పార్టీ ఓ సారి పరిశీలించుకోవాలని, నిజానికి హిట్లర్ వాదం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని షా పేర్కొన్నారు. అఫ్జల్ గురును సమర్థిస్తున్న రాహుల్ గాంధీది ఎలాంటి దేశభక్తో వెల్లడించాలన్నారు.