ఛేజ్ చేసి ..తాట తీసింది...
న్యూఢిల్లీ : టెన్నిస్ దిగ్గజం , వరల్డ్ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఓ దొంగ ఆట కట్టించిన తీరు ఆకట్టుకుంటోంది. తన ఫోన్ దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ప్రబుద్ధుడిని ఛేజ్ చేసి మరీ పట్టుకుని తాట తీసింది. 21 టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న బ్లాక్ థండర్ సెరెనానే ఈ ఇంటరెస్టింగ్ స్టోరీని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సోదరి వీనస్ విలియమ్స్ , మరో టెన్నిస్ తార కరోలినా వాజ్నియాకితో కలిసి సెరెనా ఓ చైనీస్ రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడే ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. కుర్చీలో ఉంచిన ఆమె మొబైల్ ను కొట్టేసిన ఆ చోర శిఖామణి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన సెరినా వెంటనే అప్రమత్తం అయింది. వాడు అంత కంటే వేగంగా కదిలాడు. అంతే ఇక ఊరుకుంటుందా.. టెన్నిస్ కోర్టులో తన అద్బుత షాట్లతో చెలరేగిపోయే సూపర్ స్టార్ మెరుపు వేగంతో కదిలింది. వాడిని ఛేజ్ చేసి పట్టుకుని రఫ్ఫాడించింది. దొంగిలించిన తన మొబైల్ ను వెనక్కి తీసుకుంది. ఈ చర్యతో ఈ అమెరికన్ టెన్నిస్ స్టార్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.