గతంలో లేనిది ఇప్పుడెందుకు?
పంటల దిగుబడి వివరాలను ఆర్బీఐ కోరటంపై సర్కారు విస్మయం
హైదరాబాద్: రుణాల రీ షెడ్యూల్‌కు గతంలో ఎన్నడూ లేనివిధంగా పంటల దిగుబడి వివరాలు ఇవ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అడగడంపై తెలంగాణ ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా నోటిఫై చేసిన తొంభై రోజుల్లోగా పంట నష్టం జరిగిన మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ చేయాల్సి ఉందని, అయితే తొంభై రోజులు దాటినందున రీ షెడ్యూల్ చేయాలని మళ్లీ కోరుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
దీనికి ఆర్బీఐ స్పష్టత ఇవ్వకుండా ఇతర అంశాలు ప్రస్తావించడమేమిటని అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానించుకుంటున్నారు. అయినా రిజర్వ్ బ్యాంకు అడిగిన మేరకు వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు లేఖ సిద్ధంచేశారు.ఆర్బీఐ గవర్నర్ అపాయింట్మెంట్ కంటే ముందే ఆ లేఖను వారికి పంపాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. మరోవైపు ఆర్బీఐ గవర్నర్‌తో భేటీకి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావును పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.