ఎగువ ఉపశమనం.. దిగువ ఉపద్రవం
80 వేల ఎకరాల్లో పంటల మునక
కాటన్ బ్యారేజీ నుంచి 16,57,782 క్యూసెక్కులు
సముద్రంలోకి..
అమలాపురం/ఏలూరు/కొవ్వూరు: గోదావరికి ఎగువ ప్రాంతాలైన దుమ్ముగూడెం, భద్రాచలంల వద్ద వరద తగ్గుముఖం పడుతుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. అనేక లంక, ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారుు. ఆయూ గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం వరద ప్రవాహం మరింత పెరిగి నిలకడగా కొనసాగుతోంది. ఉదయం 15.60 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 1గంటకు 16.10 అడుగులకు పెరిగింది. అక్కడ నుంచి రాత్రి 7 గంటల వరకూ అదేస్థాయిలో నిలకడగా ఉంది. బ్యారేజీ నుంచి 16,57,782 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తూర్పు గోదావరిలో కొత్తగా చేరిన కూనవరం, చింతూ రు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలతో పాటు జిల్లాలోని మరో 15 మండలాల్లోని 75 గ్రామా లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమ దేవీపట్నం, పి.గన్నవరం మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లికి చెందిన చింతా కృష్ణమూర్తి(45) వరద ఉధృతిలో గల్లంతయ్యారు. గోదావరి లంకలో చిక్కుకుపోయిన అయినవిల్లి మండలం వీరవల్లిపాలానికి చెందిన ఏడుగురు సురక్షితంగా ఇళ్లకు చేరారు. లంక గ్రామాల్లో సుమారు 60వేల ఎకరాల్లో కూరగా య, వాణిజ్య పంటలు ముంపుబారిన పడ్డాయి. జిల్లాలో ఇంతవరకూ 591 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. పుదుచ్చేరి పరిధిలోని యానాంలో ఫెర్రీ రోడ్డు నీట మునిగింది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాలలంక, పెదలంకలకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆచంట మండలంలోని అనగారలంక, అయోధ్యలంక, కోడేరులంక, మర్రి మూల, పుచ్చల్లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొవ్వూరు, ఆచంట, నరసాపురం, నిడదవోలు, పోలవరం ప్రాంతాల్లో11.7 వేల హెక్లార్లలో అరటి, 4.8 వేల హెక్టార్లలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెం, కూనవరం, కుంట, కొయిదాలలోనూ నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. కూనవరంలో 20.23 మీటర్లు, కుంటలో 11.36, పోలవరం 14.14, కొవ్వూరు రోడ్ కం రైలు వంతెన వద్ద 17.69, రాజమండ్రి రైల్వే బ్రిడ్జి వద్ద 17.68 మీటర్ల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి.
బలహీనపడిన అల్పపీడనం
విశాఖపట్నం: అల్పపీడనం కాస్త బలహీనపడి ప్రస్తుతం పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌ను ఆనుకుని కొనసాగుతోంది. దీనిపై మధ్య ట్రోపో ఆవరణం వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు మినహా పెద్దగా ప్రభావం ఉండబోదని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. మంగళవారం నెల్లూరులో 37.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మంగళవారం ఉదయానికి కోస్తాంధ్రలోని పోలవరంలో గరిష్టంగా 4 సెం.మీ. వర్షం కురిసింది. తెలంగాణలోని రామాయంపేటలో 3 సెం.మీల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
బాధితులను అన్ని విధాలా ఆదుకోండి: సీఎం
సాక్షి, హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వరద నేపథ్యంలో తాజా పరిస్థితిని ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ముంపు గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి పది కిలోల బియ్యం, లీటరు కిరోసిన్ చొప్పున అందించాలని ఆదేశించారు. ప్రాణనష్టం నిర్ధారణయ్యాక నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. నీటి ప్రవాహం తగ్గాక పంట నష్టం అంచనాలను రూపొందించాలని సూచించారు. సీజన్లో మరికొంత కాలం పాటు వరదలు వచ్చే అవకాశం ఉన్నం దున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.