బాబును ఏ వన్‌గా చేర్చాల్సిందే
వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు చార్జిషీట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించిన తెలంగాణ ఏసీబీ అధికారులు ఆయనను ఏ వన్(ప్రథమ ముద్దాయి)గా చేర్చకపోవడం వెనుక ఆంతర్యమేంటని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు కొలు సు పార్థసారథి, మేరుగ నాగార్జునతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే వ్యూహరచన చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఇదే విషయాన్ని ఆంగ్ల, తెలుగు దినపత్రికలన్నీ ప్రచురించాయి.
ఈ మొత్తం వ్యవహారానికి వ్యూహరచన చేసింది చంద్రబాబే అని చార్జిషీట్లో పేర్కొన్నప్పుడు ఆయనను ఏ వన్‌గా చేర్చకపోవడం వెనుక మర్మం ఏమిటి? ఇదే ఒక సామాన్యుడు చేసి ఉంటే ఇలాగే వ్యవహరిస్తారా? చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నప్పుడు బాబు విషయంలో ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ఏ వన్‌గా చేర్చాల్సిందే’’ అని బొత్స డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయటపడటానికే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని, ప్రత్యేక హోదా సాధన కోసం కాదన్నారు. బిహార్‌కు కేంద్రం రూ.1.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, ఎన్డీయే మిత్రపక్షంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఎందుకు అడగడం లేదని నిలదీశారు.