పనుల్లో దగా.. కాంట్రాక్టర్లు ధగధగ
నవాబుపేట: కోట్ల రూపాయల నిధులు రోడ్లపాలవుతున్నాయి. కొత్త రోడ్డు వేశారన్న ఆనందం పల్లెవాసులకు మున్నాళ్ల ముచ్చటగా మారింది. అధికారులు మామూళ్లకు తలొగ్గడంతో కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా పనులు చేసి నిధులు కాజేస్తున్నారు. ఏడాది గడిచేసరికి ఆ రోడ్లు అస్థిత్వాన్ని కూడా కోల్పోయి దశాబ్దాల క్రితం వేసిన రోడ్లలా మారుతున్నాయి.
మండలంలో ఆర్అండ్బీ శాఖ పని తీరు అధ్వానంగా మారింది. రూ. 2.84 కోట్లతో నిర్మించిన రోడ్లు ఏడాది తిరగక ముందే శిథిలావస్థకు చేరాయి. వికారాబాద్ మండలం బంగారుమైసమ్మ ఆలయం నుంచి నవాబుపేట మండలం మైతాప్ఖాన్గూడ వరకు 12 కిలోమీటర్ల పొడవున్నా ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో మరమ్మతులు, రిబీటీ కోసం ప్రభుత్వం ఏడాది కిందట రూ. 2 కోట్లు మంజూరు చేసింది. పనులను నగరానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లలో దక్కించుకున్నారు.
వారు కమీషన్ తీసుకొని మరో కాంట్రాక్టర్కు పనులు అప్పజెప్పారు. రెండో కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యత పాటించకుండా మరమ్మతు పనులు చేపట్టడంతో ఆరు మాసాల్లోనే రోడ్డు మళ్లీ గుంతలమయంగా మారింది. పనుల్లో నాణ్యత లేదంటూ అధికారులు బిల్లులు నిలిపివేశారు. దీంతో కాంట్రాక్టర్ మళ్లీ రోడ్డుపై మరో పూత పూసి బిల్లులు క్లియర్ చేయించుకున్నాడు. ప్రస్తుతం రోడ్డు పరిస్థితి మునుపటిలాగే తయారైంది.
రూ. 50 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాలది అదే పరిస్థితి...
గతేడాది క్రితం మండల పరిధిలోని పూలపల్లి, ఎల్లకొండ, ఎత్రాజ్పల్లి, మీనపల్లిలాన్, కడ్చర్ల గ్రామాల్లో రూ. 10 లక్షల చొప్పున ఖర్చు చేసి పంచాయతీ భవనాలు నిర్మించారు. పనులు నాసిరకంగా చేపట్టడంతో అప్పుడు ఈ భవనాలు వర్షానికి ఉరుస్తున్నాయి. వీటి పరిస్థితి చూసి సర్పంచులు ఈ భవనాల్లో కార్యకలాపాలు సాగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి.