ఉద్యోగం కోసం ముఖ్యమంత్రిలా నటించి..
గుడ్ గావ్: ఉద్యోగం కోసం ముఖ్యమంత్రిలా నటించి ప్రముఖ హోటల్ ను మోసగించాలని చూసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రంలో ప్రముఖ హోటల్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనను విడుదల చేసింది. దాంతో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సును పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్న అమిత్ కుమార్(29) అందుకు అప్లికేషన్ పెట్టుకున్నాడు.
ఉద్యోగం వస్తుందో రాదో అనే సందేహంతో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని క్రోన్ ప్లాజా హోటల్ కు ఫోన్ చేశాడు. తనను తాను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గా పరిచయం చేసుకున్నాడు. తన రిఫరెన్స్ ద్వారా అమిత్ కుమార్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడని, అతనికి జాబ్ ఇవ్వాలని హెటల్ యాజమాన్యాన్ని కోరాడు. దీంతో అనుమానించిన హోటల్ యాజమాన్యం ఫోన్ నెంబర్ ను ట్రూ కాలర్ ద్వారా పరిశీలించింది.
ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ నుంచి కాల్ రాలేదని తెలియడంతో సీఎంవో, పోలీసులకు సమాచారం అందించింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని ఢిల్లీలోని అతని ఇంట్లో అరెస్టు చేశారు. ఫోన్ కాల్ ద్వారా ముఖ్యమంత్రిలా మాట్లాడటమే కాకుండా రెజ్యూమ్ మీద ఖట్టర్ పేరును కూడా అమిత్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది. నిందితుడిని ఒక రోజు పాటు పోలీసుల విచారించేందుకు అనుమతినిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.