ఈ దశాబ్దం ఆసియాదే..
♦ అందులో భారత్ కీలకం
♦ మరిన్ని సంస్కరణలు తెస్తాం
♦ పన్నుల వ్యవస్థ సంస్కరిస్తాం
♦ జపాన్ ఇన్వెస్టర్లకు జైట్లీ వాగ్దానాలు
టోక్యో: ఈ దశాబ్దం ఆసియాదేనని, దీంట్లో భారత్‌ది కీలక పాత్ర అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 40 శాతం ఆసియాదేశాలకే వస్తున్నాయని చెప్పారు. మరిన్ని వ్యవస్థాగత, మార్కెట్ సంబంధిత సంస్కరణలు తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జపాన్ ఇన్వెస్టర్లకు వాగ్దానం చేశారు. ప్రస్తుతమున్న 7.6 శాతాన్ని మించిన వృద్ధి సాధన కోసం మౌలిక రంగంపై వ్యయాలను మరింతగా పెంచనున్నామని, పన్నుల వ్యవస్థను మరింత సరళీకరిస్తామని ఆయన వారికి భరోసానిచ్చారు. జపాన్ నుంచి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆరు రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తున్న ఆయన నికాయ్ ఇన్‌కార్పొ ఇక్కడ ఏర్పాటు చేసిన ‘ద ఫ్యూచర్ ఆఫ్ ఏషియా’ సదస్సులో మాట్లాడారు.
అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, గత రెండేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. వరుసగా రెండేళ్ల పాటు కరువు, ప్రైవేట్ రంగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ మంచి వృద్ధినే సాధించిందని తెలిపారు. తాము తెస్తున్న సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. రెండేళ్లలో 101 బిల్లులు చట్టాలయ్యాయని, రానున్న వర్షాకాల సమావేశాల్లో వస్తువులు, సేవల బిల్లు(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-జీఎస్టీ) ఆమోదం పొందగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
గ్రామీణ డిమాండ్ పెరుగుతుంది...
పన్నుల వ్యవస్థను సంస్కరించడం అతి పెద్ద సవాలని అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ వ్యవస్థను మరింతగా సరళీకరిస్తున్నామని చెప్పారు. వ్యాపారంలో ప్రవేశించడం సులభతరం చేశామని, వ్యాపారం చేయడం కూడా సులభతరం చేశామని, ఇక ఇప్పుడు దివాలా బిల్లు ఆమోదంతో వ్యాపారం నుంచి నిష్ర్కమించడం కూడా సులభతరం చేశామని వివరించారు. ఈ ఏడాది 10 వేల కిమీ. జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని, రైల్వేల ఆధునీకీకరణ కార్యక్రమం పట్టాలపై పరుగులు పెడుతోందని, రైల్వే మౌలిక సదుపాయాల రంగంలోకి ప్రైవేట్, విదేశీ పెట్టుబడులను అకర్షించే అంశంపై దృష్టిసారిస్తున్నామని తెలిపారు.
70 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయని, ఈ ఏడాది కొత్తగా 25 ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఈ ఏడు వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాలున్నాయని, ఫలితంగా గ్రామీణ డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే ఆసియా దేశాలు జోరుగా వృద్ధి సాధిస్తున్నాయని, చైనా మందగమనం కారణంగా ప్రపంచం భారత్ వైపు చూస్తోందని అరుణ్ జైట్లీ చెప్పారు. ఏషియన్, సార్క్, ఆర్సెప్, టీపీపీ... సంస్థ ఏదైనా భారత్ కీలకమని వివరించారు. శాంతికి, వృద్ధికి భారత్ ప్రతీక అని పేర్కొన్నారు.