CTS
-
కో–ఆపరేటివ్‌లకూ యస్ బ్యాంక్ కష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభం ప్రభావం దేశంలోని పట్టణ సహకార బ్యాంక్‌ల మీద పడింది. యస్ బ్యాంక్ మారటోరియం నేపథ్యంలో యస్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్న అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ (యూసీ బీ) చెక్ ట్రన్కేషన్ సిస్టమ్ (సీటీఎస్)లను ఆర్బీఐ రద్దు చేసింది. దేశవ్యాప్తంగా సీటీఎస్‌ల లావాదేవీల కోసం 54 యూసీబీలు యస్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొమ్మిది బ్యాంక్‌లున్నాయి. చెక్ డిపాజిట్స్, విత్‌డ్రా సేవలు నిలిచిపోవటంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ సీటీఎస్ క్లియరెన్స్‌లు జరగవని ఆర్బీఐ తెలిపింది. లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌ల ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. స్థానిక కమ్యూనిటీలు, వర్కింగ్ గ్రూప్‌లకు, చిన్న తరహా వ్యాపారస్తులకు, వ్యవసాయ రుణాలను అందించడమే కో–ఆప్ బ్యాంక్‌ల ప్రధాన లక్ష్యం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి దేశంలో 1,544 అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లు, 11,115 బ్రాంచీలున్నాయి. డిపాజిట్లు రూ.4,84,315 కోట్లుగా, అడ్వాన్స్‌లు రూ.3,03,017 కోట్లుగా ఉన్నాయి. 54 యూసీబీల సీటీఎస్‌ల రద్దు.. దేశవ్యాప్తంగా 54 కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లకు యస్ బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్‌గా ఉంది. వీటి సీటీఎస్ క్లియరెన్స్‌లను రద్దు చేస్తూ గత శుక్రవారం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఒక్క చెక్ క్లియరెన్స్ కోసం స్పాన్సర్ బ్యాంక్‌కు ఒప్పంద యూసీబీ బ్యాంక్‌లు 50 పైసల నుంచి రూపాయి వరకు చార్జీల రూపంలో చెల్లిస్తుంటాయి. వారం రోజులు గా 54 పట్టణ సహకార బ్యాంక్‌లలో సీటీఎస్ క్లియరెన్స్ జరగడం లేదని.. వీటి విలువ రూ.200 కోట్లుంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇతర బ్యాంక్‌లతో ఒప్పందాలు.. కస్టమర్ల ఆందోళన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది యస్ బ్యాంక్ ఒప్పందం కో–ఆపరేటివ్ బ్యాంక్‌లు సీటీఎస్ క్లియరెన్స్ కోసం హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యాక్సిస్ వంటి ఇతర బ్యాంక్‌లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. గత ఐదు రోజులుగా పోచంపల్లి కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో సీటీఎస్ క్లియరెన్స్‌లు జరగడం లేదని ఆ బ్యాంక్ సీఈఓ సీతా శ్రీనివాస్ తెలిపారు. కస్టమర్లకు ఆందోళన వద్దని, కొద్ది రోజుల పాటు చెక్ విత్‌డ్రా, డిపాజిట్ వంటి లావాదేవీలను వాయిదా వేసుకోవాలని కస్టమర్లకు సూచిస్తున్నామని చెప్పారు. అత్యవసరమైతే నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవాలని కస్టమర్లకు మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్ ద్వారా సందేశాలను పంపిస్తున్నామన్నారు. పోచంపల్లి కో–ఆపరేటివ్ అర్బ న్ బ్యాంక్‌కు పోచంపల్లి, చౌటుప్పల్, దేవరకొండ, నల్లగొండ, హాలియా, చందూర్, సూర్యా పేట 7 బ్రాంచీల్లో 50 వేల మంది కస్టమర్లు, రూ.60 కోట్ల అడ్వాన్స్‌లు, రూ.100 కోట్ల డిపాజిట్లున్నాయి. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో రోజుకు రూ.10 లక్షల వరకు చెక్ లావాదేవీలు జరుగుతుంటాయని బ్యాంక్ ఎండీ చెన్న వెంకటేశం తెలిపారు. సీటీఎస్ క్లియరెన్స్‌కు హెచ్‌డీఎఫ్‌సీతో చర్చలు జరుపుతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులివే... సీటీఎస్ క్లియరెన్స్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి యస్ బ్యాంక్‌తో తొమ్మిది అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లు ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ నుంచి పోచంపల్లి, సెవెన్ హిల్స్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్, వరంగల్ అర్బన్, భద్రాద్రి, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, ది సంగమిత్ర కో–ఆప్ అర్బన్ బ్యాంక్‌లున్నాయి. ది తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాం క్, ది గుంటూరు కో–ఆపరేటివ్ బ్యాంక్, ది హిందుస్తాన్ షిప్‌యార్డ్ స్టాఫ్ కో–ఆప్ బ్యాంక్‌లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. ‘‘ఏపీలో 47 యూసీబీలు, 230 బ్రాంచీలున్నాయి. వీటి డిపాజిట్లు రూ.9,040 కోట్లు, అడ్వాన్స్‌లు రూ.6,230 కోట్లు. తెలంగాణలో 51 యూసీబీలు, 211 బ్రాంచీలున్నాయి. డిపాజిట్లు రూ.7,517 కోట్లు, అడ్వాన్స్‌లు రూ.5,592 కోట్లు. -
శివార్లలో ‘బీఆర్టీఎస్’ సేవలు!
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ కష్టాల నుంచి నగరవాసులను విముక్తులను చేసేందుకు బీఆర్టీఎస్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ (హెచ్ఎండీఏ) నోడల్ ఏజెన్సీ అయిన ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (సీటీఎస్) తెరపైకి తెచ్చిన బస్సు ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) సేవలు అందించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు, మెట్రో ఫీడర్, నగర శివార్లలోని అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఇటీవల జరిగిన ఉమ్టా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్పీసింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రణాళిక రూపొందించేందుకు సీటీఎస్, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. వేగం..భద్రత అహ్మదాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న బస్సు ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (బీఆర్టీఎస్)ను అధ్యయనం చేసిన హెచ్ఎండీఏ సీటీఎస్ అధికారులు సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ‘రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బీఆర్టీఎస్ బస్సుల కోసం ప్రత్యేకంగా సిటీలోని మీడియన్ డివైడర్‌కు కుడి, ఎడమవైపున 3.5 మీటర్ చొప్పున ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయాలి. ఈ లేన్లలోకి ఇతర వాహనాలు రాకపోవడం వల్ల ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస్సులు వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. తక్కువ చార్జీలోనే సురక్షితంగా సమయానికి ముందే గమ్యస్థానానికి చేరడం వల్ల ఈ సేవలకు ఆదరణ పెరిగే అవకాశం ఉంది. ఇతర వాహన చోదకులు కూడా వీటివైపు మళ్లే అవకాశముంది. మెట్రో స్టేషన్ నుంచి ఇళ్లకు, కార్యాలయాలు చేరేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రత్యేక కారిడార్‌లో బస్సులను నడపడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవడటం బీఆర్టీఎస్ ముఖ్యోద్దేశమ’ని సీటీఎస్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తాము ఓఆర్ఆర్తో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 418 కిలోమీటర్ల మేర బీఆర్టీఎస్ సేవలు విస్తరించాలని ఉన్నతాధికారులకు సూచించామన్నారు. ఇటీవల జరిగిన ఉమ్టా సమావేశంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, మెట్రో ఫీడర్, నగర శివారుల్లో ప్రాంతాల్లోనూ బీఆర్టీఎస్ సేవలను విస్తరించాలన్న అంశం చర్చకు రావడంతో ఆవైపుగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. శివారు ప్రాంతాల్లో... నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నందున అక్కడ పక్కా ప్రణాళికతో ముందుకెళితే ట్రాఫిక్ కష్టాలను నియంత్రించవచ్చునని, బీఆర్టీఎస్ సేవల ద్వారా ఆర్టీసీకి కూడా మంచి ఆదాయం వస్తుందన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించగలుగుతామన్నారు. సిటీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకునే అవకాశమున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శివారు ప్రాంతాలను గుర్తించే పనిలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వెడల్పు అంతటా ఒకేలా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా జనసముర్ధమున్న ప్రాంతాలను గుర్తించే పనిలో సీటీఎస్ సిబ్బంది నిమగ్నమైంది. ఇప్పటివరకు దాదాపు తొమ్మిది ప్రాంతాలను గుర్తించారు. మరో రెండు నెలల్లో బీఆర్టీఎస్ ప్రాంతాలను గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు. -
ఎర్రగుంట్ల - నొస్సం.. రైలు వచ్చేస్తోంది..
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల-నొస్సం మధ్య మరో రెండు నెలల్లో ప్యాసింజర్ రైలు తిరగనుంది. ఈ మార్గంలో ఇప్పటికే రైల్వే లైను కూడా పూర్తయింది. ఆదివారం ఎర్రగుంట్ల నుంచి నొస్సం వరకు, అక్కడి నుంచి తిరిగి సంజామల, కోవెలకుంట్ల మీదుగా బనగానపల్లె వరకు ట్రాక్ పరిశీలన నిమిత్తం రైలు ఇంజన్ నడిపారు. ఈ ఇంజన్లో రైల్వే సాంకేతిక నిపుణులు బయలుదేరి రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. ఏప్రిల్ నెలలలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) పరిశీలించి ట్రాక్ పటిష్టతపై క్లియరెన్స్ ఇస్తే ఎర్రగుంట్ల - నొస్సం మధ్య రైలు తిరుగుతుంది. మొదటి దశలో ఎర్రగుంట్ల నుంచి నొస్సం వరకు రైలును నడపనున్నారు. రెండవ దశలో అంటే డిసెంబరు నుంచి బనగానపల్లి వరకు రైలు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ త ర్వాత పెండింగ్ పనులన్నీ పూర్తికాగానే ఎర్రగుంట్ల నుంచి నంద్యాల వరకు పూర్తిస్థాయిలో రైలు నడుస్తుంది. ఎర్రగుంట్ల నుంచి బనగానపల్లి వరకు సుమారు 123 కిలో మీటర్లు ఉంటుంది. ఇప్పటికే అధికారులు ట్రాక్ పనులు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఏప్రిల్‌లో రానున్న సీఆర్ఎస్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఎర్రగుంట్లకు ఏప్రిల్ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈయన ఎర్రగుంట్ల- నొస్సం మార్గంలో రైల్వే లైన్ పరిశీలించి ధ్రువీకరిస్తే రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ లైన్‌పై అధికారులు పరిశీలన చేశారు. రోలింగ్ ఇంజన్ కూడా ఆదివారం నడిపారు. ఈ ఇంజన్ నొస్సం నుంచి రాత్రి 9 గంటలకు తిరిగి ఎర్రగుంట్లకు చేరుకుంది. ఈ విషయంపై ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆదివారం ఎర్రగుంట్ల-నొస్సం మధ్య రోలింగ్ పనుల కోసం రైల్వే ఇంజన్ పంపించినట్లు తెలిపారు. నొస్సం నుంచి సంజామల, బనగానపల్లి వరకు ఇంజన్ వెళ్లిందన్నారు. ఏప్రిల్ నెలలో సీఆర్ఎస్ పరిశీలన పూర్తయితే ఈ మార్గంలో రైలు నడుపుతామని స్పష్టం చేశారు.