ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల-నొస్సం మధ్య మరో రెండు నెలల్లో ప్యాసింజర్ రైలు తిరగనుంది. ఈ మార్గంలో ఇప్పటికే రైల్వే లైను కూడా పూర్తయింది. ఆదివారం ఎర్రగుంట్ల నుంచి నొస్సం వరకు, అక్కడి నుంచి తిరిగి సంజామల, కోవెలకుంట్ల మీదుగా బనగానపల్లె వరకు ట్రాక్ పరిశీలన నిమిత్తం రైలు ఇంజన్ నడిపారు. ఈ ఇంజన్‌లో రైల్వే సాంకేతిక నిపుణులు బయలుదేరి రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. ఏప్రిల్ నెలలలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్‌ఎస్) పరిశీలించి ట్రాక్ పటిష్టతపై క్లియరెన్స్ ఇస్తే ఎర్రగుంట్ల - నొస్సం మధ్య రైలు తిరుగుతుంది.
మొదటి దశలో ఎర్రగుంట్ల నుంచి నొస్సం వరకు రైలును నడపనున్నారు. రెండవ దశలో అంటే డిసెంబరు నుంచి బనగానపల్లి వరకు రైలు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ త ర్వాత పెండింగ్ పనులన్నీ పూర్తికాగానే ఎర్రగుంట్ల నుంచి నంద్యాల వరకు పూర్తిస్థాయిలో రైలు నడుస్తుంది. ఎర్రగుంట్ల నుంచి బనగానపల్లి వరకు సుమారు 123 కిలో మీటర్లు ఉంటుంది. ఇప్పటికే అధికారులు ట్రాక్ పనులు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.
ఏప్రిల్‌లో రానున్న సీఆర్‌ఎస్
కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్‌ఎస్) ఎర్రగుంట్లకు ఏప్రిల్ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈయన ఎర్రగుంట్ల- నొస్సం మార్గంలో రైల్వే లైన్ పరిశీలించి ధ్రువీకరిస్తే రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ లైన్‌పై అధికారులు పరిశీలన చేశారు. రోలింగ్ ఇంజన్ కూడా ఆదివారం నడిపారు. ఈ ఇంజన్ నొస్సం నుంచి రాత్రి 9 గంటలకు తిరిగి ఎర్రగుంట్లకు చేరుకుంది. ఈ విషయంపై ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆదివారం ఎర్రగుంట్ల-నొస్సం మధ్య రోలింగ్ పనుల కోసం రైల్వే ఇంజన్ పంపించినట్లు తెలిపారు.
నొస్సం నుంచి సంజామల, బనగానపల్లి వరకు ఇంజన్ వెళ్లిందన్నారు. ఏప్రిల్ నెలలో సీఆర్‌ఎస్ పరిశీలన పూర్తయితే ఈ మార్గంలో రైలు నడుపుతామని స్పష్టం చేశారు.
ఎర్రగుంట్ల - నొస్సం.. రైలు వచ్చేస్తోంది..
Published Mon, Mar 30 2015 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM
Advertisement
Advertisement