నాంపల్లిలోని మహేష్ హోటల్‌లో ఘటన
పలువురు కస్టమర్లకు అస్వస్థత
హోటల్ సీజ్ చేసిన పోలీసులు
నాంపల్లి: తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్న భక్తులకు నగరంలో అపశృతి చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో బల్లిపడిన వంటకాన్ని తిని వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన 30 మంది భక్తులు దైవదర్శనం కోసం ఇటీవల తిరుపతికి వెళ్లారు.
దర్శనం అనంతరం రైలులో మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి పూర్ణా ప్యాసింజర్ రైలులో సొంతూరు వెళ్లాల్సి ఉంది. మంగళవారం రాత్రి నగరంలోనే బస చేయడంతో రైల్వే స్టేషన్‌కు చేరువలో ఉండే మహేష్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశారు. 30 మంది ఒకేసారి భోజనాలు చేస్తుండగా ఊరగాయ(పికిల్)లో చనిపోయిన బల్లిని చూశారు. అన్నంలో ఊరగాయను వేసుకుని కలుపుతుండగా ఓ భక్తుడి చేతికి బల్లి తగిలింది.
దీంతో అతడక్కడే వాంతులు చేసుకున్నారు. ఈ క్రమంలో మిగతా వారూ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా త్వరగానే కోలుకోవడంతో తిరిగి ఉదయాన్నే హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుని పూర్ణా ప్యాసింజర్ రైలులో తిరుగుపయనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మహేష్ హోటల్‌ను రాత్రి మూసివేయించారు. హోటల్ సిబ్బందిని, యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment