Lizard in food
-
Hyderabad: ఊరగాయలో బల్లి.. హోటల్ సీజ్ చేసిన పోలీసులు
నాంపల్లి: తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్న భక్తులకు నగరంలో అపశృతి చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో బల్లిపడిన వంటకాన్ని తిని వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన 30 మంది భక్తులు దైవదర్శనం కోసం ఇటీవల తిరుపతికి వెళ్లారు. దర్శనం అనంతరం రైలులో మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి పూర్ణా ప్యాసింజర్ రైలులో సొంతూరు వెళ్లాల్సి ఉంది. మంగళవారం రాత్రి నగరంలోనే బస చేయడంతో రైల్వే స్టేషన్‌కు చేరువలో ఉండే మహేష్ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. 30 మంది ఒకేసారి భోజనాలు చేస్తుండగా ఊరగాయ(పికిల్)లో చనిపోయిన బల్లిని చూశారు. అన్నంలో ఊరగాయను వేసుకుని కలుపుతుండగా ఓ భక్తుడి చేతికి బల్లి తగిలింది. దీంతో అతడక్కడే వాంతులు చేసుకున్నారు. ఈ క్రమంలో మిగతా వారూ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా త్వరగానే కోలుకోవడంతో తిరిగి ఉదయాన్నే హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుని పూర్ణా ప్యాసింజర్ రైలులో తిరుగుపయనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మహేష్ హోటల్‌ను రాత్రి మూసివేయించారు. హోటల్ సిబ్బందిని, యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బల్లిపడిన ఆహారం తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత
తిరువొత్తియూరు: చైన్నె సమీపంలోని పూందమల్లి – ఆవడి రోడ్డులో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల నడుస్తోంది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు. తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులు ఈ కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. యథావిధిగా ఆదివారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించారు. అయితే ఆ ఆహారం తిన్న 30 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ స్పృహతప్పి పడిపోయారు. బాధితులను వెంటనే కళాశాల నిర్వాహకులు రక్షించి పోరూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. తిరువేర్కాడు పోలీసుల చేపట్టిన దర్యాప్తులో బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తేలింది. అలాగే పూందమల్లి రెవెన్యూ శాఖ, ఆహార భద్రత విభాగం అధికారులు కూడా కళాశాల క్యాంపస్‌కు వెళ్లి సమస్యకు గల కారణాన్ని అన్వేషించే పనిలో పడ్డారు. -
ఏక్తాశక్తి కాంట్రాక్టు రద్దు చేయాలి
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/దేవరపల్లి: జిల్లాలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజనాన్ని సరఫరా చేస్తున్న ఏక్తాశక్తి ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.నరహరి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.శేషబ్రహ్మం, ఎన్.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏక్తాశక్తి ఏజెన్సీని సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఏ మాత్రం రుచించక విద్యార్థులు భోజనాలు మానేస్తున్నారన్నారు. బుధవారం దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం ప్రాథమిక పాఠశాలకు సరఫరా చేసిన పప్పులో బల్లి రావడంతో విద్యార్థులు భోజనం మానేసి ఆకలితో అలమటించారన్నారు. ఈ ఏజెన్సీ సరఫరా చేస్తున్న భోజనంలో పురుగులు, బొద్దింకలు ఉంటున్నాయని ఆరోపించారు. ఉపాధ్యాయుల నిరసన ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంలో బల్లి ఉండడాన్ని నిరశిస్తూ దేవరపల్లిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి తహసీల్దార్ రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఏక్తా శక్తి ఫౌండేషన్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. విషపూరితమైన భోజనం చేసిన విద్యార్థులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఉపాధ్యాయులు అధికారులను ప్రశ్నించారు. భోజనంలో పురగులు, మేకులు, రాళ్లు ఉంటున్నాయని, కుళ్లిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారిని విచారణకు పంపించారని, విచారణ నివేదిక ఏమైయిందో తెలియలేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ఏక్తాశక్తి సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆందోళనలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఉస్సే శంకరుడు, మండల అధ్యక్షుడు ఓరుగంటి శివనాగప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి కె.ఉమాకాంత్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు పి.గంగరాజు, యూటీఎఫ్ మండల మహిళా అధ్యక్షురాలు ఎంఎస్ మహాలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు కె.గంగరాజు, సీహెచ్ సత్యవాణి, ఉపాధ్యాయులు కె.భూషణం, మర్ర అబ్బులు, బి.నాగేంద్ర పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి
కర్ణాటక ,చెళ్లకెరె రూరల్: తాలూకాలోని నాయకనహట్టి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 95 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో బల్లి పడడమే కారణమని తెలుస్తోంది. గ్రామంలోని చెన్నబసయ్య ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారు 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం ఎప్పటిలానే 12.40 గంటలకు మధ్యాహ్న భోజనం చేశారు. అదే సమయంలో ఓ విద్యార్థిని తన ప్లేట్లో బల్లి పడి ఉండడాన్ని చూసి ఉపాధ్యాయులకు తెలిపింది. వెంటనే ఉపాధ్యాయులు పిల్లలు భోజనం చేయడాన్ని నిలిపేశారు. కడుపునొప్పి, వాంతులు అయితే అప్పటికే పిల్లలు భోజనం చేసి ఉండడం వల్ల చాలా మంది పిల్లలకు కడుపునొప్పి, వాంతులు ప్రారంభం అయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థులను అంబులెన్స్, ఇతర వాహనాల ద్వారా సముదాయ ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. 10 మంది విద్యార్థులను అంబులెన్స్ ద్వారా చెళ్లకెరె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో కొంతమంది విద్యార్థులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడాన్ని చూసి వారిని చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆందోళనతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు తల్లిదండ్రులు కొంతమంది ప్రధానోపాధ్యాయుడు బుడేన్‌సాబ్‌పై ఆగ్రహంతో చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు. సమాచారం అందిన వెంటనే బీఈఓ వెంకటేశప్ప, తహసీల్దార్ ఎం.మల్లిఖార్జునలు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్యస్థితిని పరిశీలించి వైద్యుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఫర్వాలేదని, 15 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఘటనపై సమగ్ర తనిఖీ నిర్వహించి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ రఘునాథ్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పాఠశాల సిబ్బంది వంట వండడంలో నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. బియ్యం కూరగాయలను, పాత్రలను సరిగా శుభ్రం చేయడం లేదని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్లనే బల్లి పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
మఫిన్స్‌లో బల్లి.. ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
న్యూఢిల్లీ : విమానాశ్రయంలో మఫిన్ తిన్న ఓ ప్రయాణికునికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింద. అదేంటి మఫిన్ తింటే ఫుడ్ పాయిజనింగ్ కావడమేంటని ఆలోచిస్తున్నారా. ఎందుకంటే అతడు తీసుకున్న మఫిన్లో చచ్చిన బల్లి అవశేషాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఈ సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. డిసెంబరు 18న ఇది జరిగిన ఈ ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన ప్రయాణికుడు డిసెంబరు 18వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో టెర్మినల్ 2లోని బోర్డింగ్ గేట్ 33 సమీపంలోని ప్లాజా ప్రీమియం లాంజ్‌లో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. విమానం బయలుదేరడానికి సమయం ఉండటంతో మఫిన్స్ ఆర్డర్ ఇచ్చాడు. దాన్ని తింటుండగా అతనికి దానిలో చనిపోయిన బల్లి అవశేషాలు కనిపించాయి. ఈ లోపు అతడు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. దాంతో టెర్మినల్ మేనేజర్ డాక్టర్లను పిలిపించారు. తాను తింటున్న మఫిన్లో చచ్చిపోయిన బల్లి శరీరభాగాలు కనిపించాయని అతడు వైద్యులకు తెలిపాడు. దాంతో డాక్టర్లు అతడికి ప్రాథమిక చికిత్స చేసి సఫ్దార్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. అంతేకాక ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విమనాశ్రయానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ భాటియా విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుడు తిన్న ఆహార పదార్థం నమూనాను సేకరించినట్లు ఆయన తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, దోషులుగా తేలిన వారికి శిక్ష పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రయాణికుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. -
ఉలిక్కిపడిన ఏయూ విద్యార్థులు
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల మెస్–1లో సాంబరులో బల్లి పడడంతో కలకలం రేగింది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భోజనానికి సిద్ధమైన విద్యార్థులు సాంబారు బకెట్లో బల్లిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటికే కొద్దిమంది తమ భోజనం ముగించారు. దీంతో వారంతా తమకు ఏమవుతుందోనని ఆందోళన చెందారు. మిగతా విద్యార్థులు భోజనం చేయకుండానే బయటకు వచ్చేశారు. హాస్టల్ మెస్ నుంచి బల్లి దర్శనమిచ్చిన సాంబారు బకెట్‌ను పట్టుకుని ర్యాలీగా ఏయూ మెయిన్‌గేట్ వద్దకు చేరుకున్నారు. తమ అవస్థలను ఏకరువు పెట్టారు. గేటు మూసివేసి ధర్నాకు దిగారు. తరచూ ఇదే తంతు: ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో పనిచేసే సిబ్బందికి నిర్లక్ష వైఖరి ఎక్కువైందని ఆరోపించారు. వండిన ఆహార పదార్థాలపై ఎటువంటి మూతలు పెట్టడడం లేదన్నారు. దీని కారణంగానే ప్రస్తుతం సాంబారులో బల్లి పడి ఉంటుందని చెప్పారు. ఇటువంటి సంఘటనలు కారణంగా విద్యార్థులు అస్వస్తతకు గురైతే ఎవరి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తమను ప్రశ్నించేవారు లేరనే ధీమాతో హాస్టల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాణ్యత దేవుడెరుగు: హాస్టల్లో ఆహార పదార్థాల నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని విద్యార్థులు వాపోయారు. ఆహారం రుచిగా ఉండడం లేదని అడిగితే ఛీదరించుకుంటున్నారన్నారు. వర్సిటీ అధికారులు సైతం తమ సమస్యలను వినడం లేదన్నారు. సాంబారుకు, రసానికి తేడా ఉండడం లేదన్నారు. అధికారులు తమ గోడు వినాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏయూ మెయిన్‌గేట్ మూసివేసి ఆందోళనకు దిగారు. వర్సిటీ ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని నినదించారు. హాస్టల్ మెస్‌లను ప్రక్షాళన చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. విద్యార్థులకు అండగా ఎస్ఎఫ్ఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. సంఘీభావం తెలిపి బాసటగా నిలిచారు. ప్రిన్సిపాల్ హామీతో శాంతించిన విద్యార్థులు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.వినోదరావు, వార్డెన్ రమేష్‌బాబు విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యను విన్నారు. సాయంత్రం మెస్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఆందోళన విరమించి తరగతులకు వెళ్లారు. -
భోజనంలో బల్లి.. విద్యార్థుల ఆందోళన
విశాఖ: హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు పెట్టే భోజనంలో బల్లి దర్శనమిచ్చిన ఘటన విశాఖ జిల్లాలోని ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున హాస్టల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై హాస్టల్ యాజమాన్యానికి తాము ఫిర్యాదు చేసినా హాస్టల్ వార్డెన్, సిబ్బంది ఇప్పటివరకూ స్పందించలేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం అల్ఫాహారం, భోజనంపై పర్యవేక్షణ చేయకుండా హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.