మధ్యాహ్న భోజనంలో బల్లి | 95 School Children Illness With Food Poison in Karnataka | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనంలో బల్లి

Published Wed, Nov 6 2019 8:54 AM | Last Updated on Wed, Nov 6 2019 8:54 AM

95 School Children Illness With Food Poison in Karnataka - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు

కర్ణాటక ,చెళ్లకెరె రూరల్‌: తాలూకాలోని నాయకనహట్టి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 95 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో బల్లి పడడమే కారణమని తెలుస్తోంది. గ్రామంలోని చెన్నబసయ్య ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారు 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం ఎప్పటిలానే 12.40 గంటలకు మధ్యాహ్న భోజనం చేశారు. అదే సమయంలో ఓ విద్యార్థిని తన ప్లేట్‌లో బల్లి పడి ఉండడాన్ని చూసి ఉపాధ్యాయులకు తెలిపింది. వెంటనే ఉపాధ్యాయులు పిల్లలు భోజనం చేయడాన్ని నిలిపేశారు.

కడుపునొప్పి, వాంతులు  
అయితే అప్పటికే పిల్లలు భోజనం చేసి ఉండడం వల్ల చాలా మంది పిల్లలకు కడుపునొప్పి, వాంతులు ప్రారంభం అయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థులను అంబులెన్స్, ఇతర వాహనాల ద్వారా  సముదాయ ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. 10 మంది విద్యార్థులను అంబులెన్స్‌ ద్వారా చెళ్లకెరె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో కొంతమంది విద్యార్థులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడాన్ని చూసి వారిని చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆందోళనతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. 

భయాందోళనకు గురైన తల్లిదండ్రులు  
తల్లిదండ్రులు కొంతమంది ప్రధానోపాధ్యాయుడు బుడేన్‌సాబ్‌పై ఆగ్రహంతో చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు. సమాచారం అందిన వెంటనే బీఈఓ వెంకటేశప్ప, తహసీల్దార్‌ ఎం.మల్లిఖార్జునలు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్యస్థితిని పరిశీలించి వైద్యుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఫర్వాలేదని, 15 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఘటనపై సమగ్ర తనిఖీ నిర్వహించి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌ఐ రఘునాథ్‌ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పాఠశాల సిబ్బంది వంట వండడంలో నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. బియ్యం కూరగాయలను, పాత్రలను సరిగా శుభ్రం చేయడం లేదని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్లనే బల్లి పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement