న్యూఢిల్లీ : విమానాశ్రయంలో మఫిన్ తిన్న ఓ ప్రయాణికునికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింద. అదేంటి మఫిన్ తింటే ఫుడ్ పాయిజనింగ్ కావడమేంటని ఆలోచిస్తున్నారా. ఎందుకంటే అతడు తీసుకున్న మఫిన్‌లో చచ్చిన బల్లి అవశేషాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఈ సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. డిసెంబరు 18న ఇది జరిగిన ఈ ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన ప్రయాణికుడు డిసెంబరు 18వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో టెర్మినల్ 2లోని బోర్డింగ్ గేట్ 33 సమీపంలోని ప్లాజా ప్రీమియం లాంజ్‌లో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు.
విమానం బయలుదేరడానికి సమయం ఉండటంతో మఫిన్స్ ఆర్డర్ ఇచ్చాడు. దాన్ని తింటుండగా అతనికి దానిలో చనిపోయిన బల్లి అవశేషాలు కనిపించాయి. ఈ లోపు అతడు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. దాంతో టెర్మినల్ మేనేజర్ డాక్టర్లను పిలిపించారు. తాను తింటున్న మఫిన్‌లో చచ్చిపోయిన బల్లి శరీరభాగాలు కనిపించాయని అతడు వైద్యులకు తెలిపాడు. దాంతో డాక్టర్లు అతడికి ప్రాథమిక చికిత్స చేసి సఫ్దార్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. అంతేకాక ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విమనాశ్రయానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ భాటియా విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుడు తిన్న ఆహార పదార్థం నమూనాను సేకరించినట్లు ఆయన తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, దోషులుగా తేలిన వారికి శిక్ష పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రయాణికుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment