సాధా‘రణ’ బోగీ.. కిక్కిరిసి | There is a huge demand for regular bogies in express and mail trains | Sakshi
Sakshi News home page

సాధా‘రణ’ బోగీ.. కిక్కిరిసి

Published Mon, Aug 5 2024 3:53 AM | Last Updated on Mon, Aug 5 2024 3:53 AM

There is a huge demand for regular bogies in express and mail trains

రెట్టింపు సంఖ్యలో రైళ్లలో ప్రయాణం  

జనరల్‌ బోగీల్లో నిలవడానికి కూడా స్థలం కరువే  

వాష్‌రూమ్, లగేజీ బెర్త్, ఫుట్‌బోర్డు ఏదీ వదలని వైనం  

ఎక్స్‌ప్రెస్, మెయిల్‌ రైళ్లలో సాధారణ బోగీలకు భారీ డిమాండ్‌ 

దశాబ్దాలుగా పెరగని బోగీలు.. తగ్గిన ప్యాసింజర్‌ రైళ్లు 

రైళ్లలో జనరల్‌ బోగీలు చూడగానే  కిక్కిరిసి ఉంటాయి. కూర్చోవడానికే కాదు.. నిల్చోవడానికి కూడా ప్లేస్‌ ఉండదు. లగేజీ బెర్తు...వాష్‌రూమ్, ఫుట్‌బోర్డు ఇలా ఎక్కడచూసినా ఫుల్‌ రష్‌ కనిపిస్తుంది. గంటల తరబడి  నిలబడటానికి ఇబ్బంది పడేవారు.. సీట్లలో కూర్చున్న ప్రయాణికుల కాళ్ల వద్ద కూడా కూర్చొనేవారు ఉన్నారు. వాస్తవానికి ఒక్కో జనరల్‌ బోగీలో కూర్చొని 75 మంది దాకా ప్రయాణించొచ్చు. 

కానీ ఏ జనరల్‌ బోగీ చూసినా... అందులో ప్రయాణించే వారి సంఖ్య 150 నుంచి  200 మంది పైనే ఉంటుంది. సికింద్రాబాద్, కాచిగూడ,  మహబూబ్‌నగర్, వరంగల్, కామారెడ్డి, కాజీపేట  రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకొనేందుకు ‘సాక్షి ’క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రయాణికుల కష్టాలు తెలుసుకుంది.  

సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా సాధారణ బోగీల సంఖ్య పెంచకపోవడంతో వందలాదిమంది రెండు, మూడు బోగీల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే కాదు గోదావరి, పద్మావతి, నారాయణాద్రి, విశాఖ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ తదితర అన్ని రైళ్లలోనూ సాధారణ ప్రయాణికులు నిత్యం నరకం చవిచూస్తున్నారు. 

మహిళలు, పిల్లలు, సీనియర్‌ సిటిజన్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సివస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లక్షలాదిమంది కార్మికులు హైదరాబాద్‌లో నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. ఈ కార్మికుల కుటుంబాలు, బంధువులు నిత్యం తమ స్వస్థలాలకు రాకపోకలు సాగిస్తారు. ఈ ప్రయాణికుల డిమాండ్‌ మేరకు రైళ్లు లేక, అందుబాటులో ఉన్న రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు. 

తగ్గిన ప్యాసింజర్‌ రైళ్లు  
తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్యాసింజర్‌ రైళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. కొన్నింటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. పదేళ్లు దాటినా ఇంటర్‌సిటీ రైళ్ల సంఖ్య పెరగలేదు. దీంతో హైదరాబాద్‌ నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే రైళ్లలోనే సాధారణ బోగీలను ఆశ్రయించాల్సి వస్తోంది. 

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న సుమారు 250 రైళ్లలో సుమారు 100 వరకు ప్యాసింజర్‌ రైళ్లు ఉంటే 150 వరకు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. కానీ 2 లక్షల మందికి పైగా సాధారణ ప్రయాణికులే కావడం గమనార్హం. ప్రస్తుతం 24 బోగీలు ఉన్న ట్రైన్‌లలో 2 నుంచి 3 సాధారణ బోగీలు ఉండగా, 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 సాధారణ బోగీలే ఉన్నాయి. ప్రయాణికులు మాత్రం వాటి సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. 

ఎలాగోలా ప్రయాణం  
ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా భువనేశ్వర్‌కు వెళ్లే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు ముందు ఒకటి, వెనుక మరొకటి చొప్పున 2 జనరల్‌ బోగీలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కో బోగీలో కనీసం 250 మందికి పైగా ప్రయాణం చేస్తూ కనిపించారు. కొందరు బాత్‌రూమ్‌ వద్ద కిటకిటలాడుతుండగా, మరికొందరు పుట్‌బోర్డుపైన నిండిపోయారు. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది.  

» కాజీపేట్, వరంగల్‌ స్టేషన్‌లలో సాధారణ బోగీల్లో ప్రయాణికుల దుస్థితిని పరిశీలించినప్పుడు, ఒక్క కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లోనే కాకుండా ఈస్ట్‌కోస్ట్, సంఘమిత్ర, గోరఖ్‌పూర్, సాయినగర్‌ షిర్డీ, కృష్ణా, మచిలీపట్నం, గౌతమి, గోదావరి, శాతవాహన, గోల్కొండ, ఇంటర్‌సిటీ, తదితర అన్ని రైళ్లలోను ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపించింది.  
»  కామారెడ్డి మీదుగా ఇటు సికింద్రాబాద్, అటు నాందేడ్, ముంబై, షిరిడీలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ 2 సాధారణ బోగీలు మాత్రమే ఉన్నాయి.  
»  సికింద్రాబాద్‌ నుంచి ముంబయికి వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లోని 2 సాధారణ బోగీలు సికింద్రాబాద్‌లోనే కిక్కిరిసిపోతాయి. కానీ మిర్జాపల్లి, అక్కన్నపేటస్టేషన్, కామారెడ్డి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నాందేడ్, ముంబయికి వెళ్లే ప్రయాణికులు దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లోని సాధారణ బోగీలనే ఆశ్రయిస్తారు. దీంతో ఈ ట్రైన్‌ కామారెడ్డికి వచ్చేసరికి కాలు మోపేందుకు కూడా చోటు ఉండదు. అయినా సరే ముంబయికి ఉపాధి కోసం వెళ్లే కూలీలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు.  

రైళ్ల రద్దుతో పెరుగుతున్న రద్దీ  
హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పుష్‌ఫుల్, ప్యాసింజర్‌ రైళ్లను తరచు రద్దు చేయడం వల్ల మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపైన ఒత్తిడి పెరుగుతోంది. మెయింటెనెన్స్‌ పనుల పేరిట వారం, పదిరోజుల పాటు రద్దు చేస్తున్నారు. మరోవైపు ఏ ట్రైన్‌ ఎప్పుడు, ఎందుకు రద్దవుతుందో కూడా తెలియదు. దీంతో రోజువారీ ప్రయాణం చేసే చిరువ్యాపారులు, ఉద్యోగస్తులు, విద్యార్ధులు, వివిధ వర్గాలకు చెందినవారు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. 

రోలింగ్‌ కారిడార్‌ బ్లాక్‌ పనుల వల్ల సాధారణ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడమే ఇందుకు కారణం. ‘ఒక నెలలో పుష్‌ఫుల్‌ రైళ్లు 20 రోజులునడిస్తే కనీసం 10 రోజులు రకరకాల కారణాలతో రద్దవుతున్నాయని తాండూరుకు చెందిన శ్రీనివాస్‌ తెలిపారు. మరోవైపు కోవిడ్‌ అనంతరం చాలా వరకు పుష్‌ఫుల్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. సాధారణ బోగీల సంఖ్యను పెంచకుండా చార్జీలు మాత్రమే పెంచారు.  

» మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, తదితర స్టేషన్‌ల నుంచి సుమారు 1000 మందికి పైగా నగరానికి రాకపోకలు సాగిస్తారు. కానీ మహబూబ్‌నగర్‌ నుంచి కాచిగూడకు రాకపోకలు సాగించే డెమో ట్రైన్‌ తరచు రద్దవుతోంది. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతకాలంగా 40 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తుందని , దీంతో సకాలంలో హైదరాబాద్‌కు చేరుకోలేకపోతున్నామని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.  

బోగీలు పెంచడమే పరిష్కారం  
అన్ని ప్రధాన రైళ్లలో సాధారణ బోగీలను 2 నుంచి 4కు పెంచనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ స్పష్టం చేసింది. కానీ దక్షిణమధ్య రైల్వేలో ఇంకా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగైదు రైళ్లలో మాత్రమే బోగీల సంఖ్యను పెంచినట్టు అధికారులు తెలిపారు. జోన్‌ పరిధిలో సుమారు 320 మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లన్నింటిలోనూ సాధారణ బోగీలు పెంచడమే తక్షణ పరిష్కారం. 

» అన్ని ప్రధాన రైళ్లలో మహిళల కోసం ఒక ప్రత్యేక బోగీని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణం మహిళలకు ఎంతో కష్టం. ఈ దిశగా చర్యలు చేపట్సాల్సి ఉంది.  

డెమో రైలును రైట్‌టైమ్‌ ప్రకారం నడపాలి  
మహబూబ్‌నగర్‌ డెమో రైలులో ఏడాది నుంచి ప్రయాణం చేస్తున్న. కొద్ది రోజుల నుంచి డెమో ఆలస్యంగా నడుస్తోంది. దీంతో టైమ్‌ ఆఫీసుకు వెళ్లలేకపోతున్నా. లేట్‌గా వెళ్లిన రోజుల్లో కొన్నిసార్లు సగం జీతమే లెక్కలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి డెమో రైలును టైమ్‌ ప్రకారం నడపాలి.  – ఎం.మహేశ్,  ప్రైవేట్‌ ఉద్యోగి, మర్లు (మహబూబ్‌నగర్‌) 

నాలుగు రోజుల జీతం కట్‌  
కొన్ని రోజుల నుంచి డెమో రైలు ఆలస్యంగా బయలుదేరి వెళుతుండ డంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. నేను పనిచేసే సంస్థకు ఆలస్యంగా వెళుతుండటంతో నెలలో నాలుగు రోజులైన జీతం కట్‌ చేస్తున్నారు. డెమో రైలును రైట్‌టైమ్‌లో నడిపి మా సమస్యను పరిష్కరించాలి.  – శ్రీనివాస్, ప్రైవేట్‌ ఉద్యోగి, హన్వాడ  

బోగీలు పెంచాలి  
ఇరవై ఏళ్లుగా కాంట్రాక్టు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఉదయం 9 గంటల వరకు ఉద్యోగంలో ఉండాలి. అందుకే ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ఉండే పుష్‌ఫుల్‌ ట్రైన్‌కు వెళ్తాను. ఇది సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యంగా వస్తుంది. దీని తర్వాత వచ్చే కాకతీయ ట్రైన్‌ వేళలు మార్చారు. బోగీల సంఖ్య కూడా తగ్గించారు. దీంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపైన ఆధారపడాల్సి వస్తోంది. సాధారణ రైళ్లలో బోగీలు పెంచితే చాలు.      – సత్తిబాబు, కాంట్రాక్టు రైల్వే ఉద్యోగి, భువనగిరి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement