ఇక్కట్ల రైలు ప్రయాణం
అరకొర బోగీలతో సరి
జనరల్ ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
కనీస వసతులూ కరువు
పెరుగుతున్న ఏసీ కోచ్‌లు
వందేభారత్ రైళ్లపైనే శ్రద్ధ
కేంద్రం తీరుపై వెల్లువెత్తుతున్న నిరసన
సాక్షి ప్రతినిధి,గుంటూరు, లక్ష్మీపురం, తెనాలి రూరల్: రైళ్లలోని జనరల్ బోగీలు నరకానికి నకళ్లుగా మారాయి. ఫలితంగా ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరం నిలువు కాళ్లపై నిలబడే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మహిళలు, పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ఏసీ కోచ్‌లు, వందేభారత్ రైళ్లపై ఉన్న శ్రద్ధ సామాన్యులు వెళ్లే జనరల్ బోగీలపైనా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం వివిధ రైళ్లలో జనరల్ బోగీలపై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఈ విషయాలు బయటపడ్డాయి.
రెండే జనరల్ బోగీలు
గుంటూరు స్టేషన్ నుంచి నిత్యం సుమారుగా 20 వేల మందికిపైగా ప్రయాణం చేస్తుంటారు. గుంటూరు రైల్వే స్టేషన్‌కు నిత్యం సుమారుగా 65 రైళ్లు వస్తుంటాయి. వీటిలో ప్రధానంగా సికింద్రాబాద్, వైజాగ్, తిరుపతి, గుంతకల్లు, పిడుగురాళ్ల, విజయవాడ, రాజమండ్రి, వైపుగా ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే వాటిలో సికింద్రాబాద్–తిరువనంతపురం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్, హౌరా – సికింద్రాబాద్ నడిచే ఫలక్‌నుమా, సికింద్రాబాద్ – భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, వాస్కో–షాలీమార్ మధ్య నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ – బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కి రెండు జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ప్రయాణికులు కనీసం నిలబడేందుకూ స్థలం లేక నరకయాతన అనుభవించారు. బోగీలో కనీసం తాగునీటి వసతి లేదు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటివద్దే ప్రయాణికులు కూర్చుని, నిలబడి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
ప్యాసింజర్ రైళ్లు తగ్గింపు
ఒకప్పుడు పేదల బండిగా ఉన్న రైలు ఇప్పుడు పేద వారికి అందని ద్రాక్షగా మారుతోంది. కేంద్రప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్, వందేభారత్ వచ్చాక ప్యాసింజర్ రైళ్లను తగ్గించి వేయడమే కాకుండా ఎక్స్ ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను కాలక్రమేణా కుదిస్తూ వస్తోంది. రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు పెంచుతున్నామనే పేరుతో రైలు ప్రయాణాన్ని పేదలకు దూరం చేస్తోంది.
టాయిలెట్లూ అస్తవ్యస్తం
ధన్‌బాద్ నుంచి అలెప్పి వెళ్లే ఎక్స్‌ప్రెస్ మంగళవారం మూడు గంటలు ఆలస్యంగా రాత్రి 7.50 గంటలకు తెనాలి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. 24 బోగీలు ఉన్న ఈ రైలులో మూడు మాత్రమే జనరల్ బోగీలు. ఫలితంగా వీటిల్లో జనం కిక్కిరిసిపోయారు. వీటిలో 80 మంది చొప్పున ప్రయాణించేందుకే అవకాశం ఉంటుంది. కానీ సుమారు 140 మంది వరకు ఉన్నారు. రెండు జనరల్ బోగీల బాత్‌రూమ్‌లకు కిటికీ అద్దాలు లేవు. అందులోకి వెళ్లిన వ్యక్తి బయటకు కనపడేలా ఉన్నాయి. తలుపు దగ్గర, నడిచే దారిలో, ఆఖరికి టాయిలెట్ల వద్ద కూడా ప్రయాణికులు కూర్చుని ప్రయాణించారు.
బోగీలు తగ్గిస్తే ఎలా
కేంద్రం సామాన్య ప్రజలకు రైలు ప్రయాణం దూరం చేసేలా ఉంది. జనరల్ బోగీలు ఉండట్లేదు. స్లీపర్ కోచ్‌లు, ఏసీ కోచ్‌ల ధరలు అందని ద్రాక్షాలా ఉన్నాయి. నాలాంటి పేదల కోసం జనరల్ బోగీలు పెంచాల్సింది పోయి తగ్గిస్తే ఎలా?
– కుర్రా హనుమంతరావు, క్రోసూరు, పల్నాడు జిల్లా
ఉగ్గబట్టుకున్నాం
మాది తెనాలి. నేను శబరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కాను. ఎప్పుడు తెనాలి చేరుకుంటానా అని ఉగ్గబట్టుకుని కూర్చున్నా. భరించలేని దుర్వాసన, నిలబడేందుకూ స్థలం లేదు. ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణించాను.
– కూరపాటి సుదీప్, తెనాలి
కిటకిట
నేను తిరుపతి వెళ్తున్నా. నేను ఎక్కిన రైలులో రెండు మాత్రమే జనరల్ బోగీలు. కిటకిటలాడుతున్నాయి. ఏ స్టేషన్‌లో అయినా తగ్గుతారని అనుకుంటే రైలు ఆగిన ప్రతి స్టేషన్‌లో జనం ఎక్కుతూనే ఉన్నారు. జనరల్ బోగీలను పెంచాలి.
– గాజలు రామాంజనేయులు, బయ్యవరం
Comments
Please login to add a commentAdd a comment