హేవలాక్‌.. గోదావరి ఐకానిక్‌.. | - | Sakshi
Sakshi News home page

హేవలాక్‌.. గోదావరి ఐకానిక్‌..

Published Mon, Oct 30 2023 2:40 AM | Last Updated on Mon, Oct 30 2023 8:36 AM

- - Sakshi

సాక్షి డెస్క్‌, రాజమహేంద్రవరం: అమ్మమ్మగారింటికనో.. చుట్టాలింటికనో గోదావరి అవతల ఉన్న ఏ విజయవాడకో.. మెడ్రాసుకో (ఇప్పుడంటే చైన్నె కానీ.. అప్పట్లో అలానే కాస్త స్టైలుగా అనేవారు ఎందుకో! కాకపోతే కొందరు మద్రాసు, మదరాసు అనేవారు) చిన్నప్పుడు వెళ్లిన వాళ్లందరికీ రాజమండ్రి పాత రైలు బ్రిడ్జిపై ప్రయాణం ఎప్పటికీ చెదరని ఓ మధుర జ్ఞాపకమే. పగటి పూట అయితే చాలామంది కాకినాడ – మెడ్రాసు సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ లేకపోతే ప్యాసింజర్‌ రైలు ఎక్కేవారు. అప్పట్లో బొగ్గు ఇంజన్‌. కూ... అంటూ చెవులు చిల్లులు పడేలా పే....ద్ధ కూత పెట్టుకుంటూ చుక్‌చుక్‌చుక్‌ మంటూ వచ్చేది.

రైలు నెమ్మదిగా రాజమండ్రి (కొంతమంది ‘రాజమంట్రి’ అనేవారు. అదేమిటో!) చేరిందంటే చాలు.. గోదావరి వచ్చేసిందని పెద్దవాళ్లు అప్రమత్తం చేసేవారు. అందరూ పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు, పది, 20 పైసలు.. కాస్త ఉన్న వాళ్లయితే పావలా నుంచి రూపాయి కాసు వరకూ చేతులతో పట్టుకుని రైలు బోగీ కిటికీలు, గేట్ల వద్దకు ఉరికేందుకు సిద్ధంగా ఉండేవారు. ఏదో యుద్ధానికి సిద్ధమైన యోధుల్లా..రైలు కూత పెట్టి నెమ్మదిగా రాజమండ్రి స్టేషన్‌ను వీడేది. ఇంజిన్‌.. దాని వెనుకనే ఒకదాని వెనుకన ఒక్కో బోగీ గోదావరి బ్రిడ్జి మీదుగా పరుగులు తీసేవి. ఇప్పుడంటే రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి ఉన్నాయి కానీ.. అప్పట్లో రైలు గోదావరి దాటాలంటే ఒక రకం జేగురు రంగులో ఉండే రెడ్‌ ఆకై ్సడ్‌ పూత పూసిన పాత బ్రిడ్జి ఒక్కటే దిక్కు.. దీనికే హేవలాక్‌ బ్రిడ్జి అని మరో పేరు.

అమ్మో బ్రిడ్జి మీద ప్రయాణమే..
అప్పట్లో ఆ బ్రిడ్జిపై ప్రయాణం అంటే చాలామందికి హడల్‌.. గుండెలు గుబగుబలాడిపోయేవి. ఓపక్క ఠక్‌ఠక్‌.. ఠక్‌ఠక్‌ అంటూ రైలు చక్రాల సౌండ్‌.. అది ఇనుప బ్రిడ్జి కావడంతో వాటి అదురు నుంచి వచ్చే రీసౌండ్‌.. చిన్న పిల్లలైతే భయంతో బిర్రబిగుసుకుపోయేవాళ్లు. మరోపక్క కిందన అఖండ గోదావరి. ఎటు చూసినా కనుచూపు మేరంతా అగాధంలాంటి జలరాశే. అసలే ఆ బ్రిడ్జికి అటూ ఇటూ ఏమీ ఉండేవి కావు. ఒక వేళ ఈ రైలు ఆ బ్రిడ్జి మీంచి కింద పడిపోతే.. అనే ఆలోచన వస్తేనే పై ప్రాణాలు పైనే పోయినట్టుండేది. (ఒకవేళ బ్రిడ్జికి అటూ ఇటూ గోడలుంటే మాత్రం వేగంగా వెళ్తున్న రైలు పడితే ఆపుతాయా? అదో వెర్రి ఆలోచన.) ఈలోగా గోదావరిలో డబ్బులేసేవాళ్లు.. పూలు, పండ్లు విసిరేవారు.. చల్లగా చూడాలమ్మా అంటూ తల్లి గోదారికి దణ్ణాలు పెట్టేవాళ్లు. ఈ ప్రాంత ప్రజలతోనే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజలతో కూడా అనుబంధం పెనవేసుకున్న ఈ హేవలాక్‌ వంతెనకు చాలానే చరిత్ర ఉంది.

అంతకు ముందు కేవలం పడవలే..
హేవలాక్‌ బ్రిడ్జి నిర్మించక ముందు గోదావరి నదిని దాటడానికి ఇక్కడి ప్రజలు పడవలే వినియోగించేవారు. ఆ రోజుల్లో గోదావరి వరద ఉధృతంగా ఉంటే ఒక్కోసారి పడవలు తలకిందులై ప్రాణనష్టం కూడా జరిగేది. అటువంటి దుస్థితికి ఈ వంతెన చెక్‌ చెప్పింది. ప్రజలు సురక్షితంగా గోదావరి దాటడానికి ఒక రవాణా సాధనం లభించింది. అప్పట్లో బ్రిడ్జిపై ఎలాంటి ఆధారం లేకుండా రైలు వెళ్తూంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడేవారు. అదే సమయంలో థ్రిల్‌గా కూడా ఫీలయ్యేవారు.

పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు ప్రణాళిక
రైళ్ల రాకపోకలను 1997లో నిలిపివేసిన పదేళ్ల తరువాత ఈ వంతెనను పర్యాటకంగా, రాజమహేంద్రవరం – కొవ్వూరు మధ్య పాదచారుల మార్గంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2008లో ఈ వంతెన సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టేందుకు తీర్మానం చేసింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించలేదు. నాటి ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఆమోదించాల్సిందిగా రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. హేవలాక్‌ బ్రిడ్జిని తొలగించి, దానిలోని ఉక్కును తీసుకువెళ్లాలని రైల్వే శాఖ చేసిన యత్నాలను స్థానికులు తిప్పి కొట్టారు. ఈ ఐకానిక్‌ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు.

బ్రిడ్జిపై రోడ్డు వేస్తే చిరు వ్యాపారులకు, రైతులకు ఉపయోగపడుతుందని, వాకింగ్‌ ట్రాక్‌గా కూడా పనిస్తుందని చెప్పారు. చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2017లో రైల్వే శాఖకు కొంత మొత్తం చెల్లించి, సొంతం చేసుకుంది. దీనిని వారసత్వ సంపదగా అభివృద్ధి చేస్తామని చెప్పింది. అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుత రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ కల సాకారమయ్యే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఎన్నో ప్రత్యేకతలు

పొడవు : 2.7 కిలోమీటర్లు – వెడల్పు: 1.7 మీటర్లు

నిర్మాణం ప్రారంభం : 1897 నవంబర్‌ 11

నిర్మాణ అంచనా వ్యయం : రూ.47 లక్షలు

వంతెన ప్రారంభం : 1900 ఆగస్టు 30

వంతెన మూసివేత : 1997

స్తంభాలు : 56 (రాతి కట్టడాలు)

మొట్టమొదట ప్రయాణించిన రైలు : మెయిల్‌

చివరిసారి ప్రయాణించిన రైలు : కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌

1897లో నిర్మాణం ఆరంభం
ఈ వంతెనను అఖండ గోదావరిపై బ్రిటిష్‌ వారి పాలనలో హౌరా – మద్రాసు (నేటి చైన్నె) రైలు మార్గంలో రాజమహేంద్రవరం – కొవ్వూరు పట్టణాల మధ్య 1897లో నిర్మించారు. దీనిని వంద సంవత్సరాల పాటు వినియోగంలో ఉండేలా అప్పట్లో డిజైన్‌ చేశారు. స్తంభాలు పూర్తి రాతి కట్టడాలు. బలమైన ఉక్కు గడ్డర్లు ఉపయోగించారు. దీని నిర్మాణానికి ఫ్రెడరిక్‌ థామస్‌ గ్రాన్‌విల్లే వాల్డన్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరించారు. ఈ వంతెనకు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్‌ సర్‌ ఆర్థర్‌ ఎలిబ్యాంక్‌ హేవ్‌లాక్‌ పేరు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement