రాయల వైభవానికి ప్రతీక హంపి ఉత్సవాలు
కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే
త్వరలో బెంగళూరు-హొస్పేట మధ్య ఇంటర్సిటీ రైలు
ముగిసిన హంపి ఉత్సవాలు
గుబాళించిన సాంస్కృతిక సౌరభం
భారీగా తరలివచ్చిన సందర్శకులు
ఆకట్టుకున్న గ్రామీణ క్రీడలు
మన సంస్కృతి, ప్రాచీన కళలను మరిచిపోకుండా.. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా.. మూడు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించిన హంపి ఉత్సవాలు ఆదివారం రాత్రి ముగిసాయి. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని తలపించే విధంగా ఉత్సవాలను నిర్వహించడంతో దేశవిదేశాల నుంచి వేలాది మంది జనం తరలివచ్చారు. అంతరించిపోతున్న జానపద కళలు, కుస్తీ పోటీలు, సాహస క్రీడలు, రాతిగుండు ఎత్తే పోటీలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. మొత్తం మీద హంపి ఉత్సవాలు మూడు రోజుల పాటు పండుగ వాతావరణాన్ని తలపించాయి. చివరిరోజు కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.
హొస్పేట, బళ్లారి, న్యూస్‌ైలైన్ : శ్రీకృష్ణదేవ రాయల గత వైభవాన్ని తలపించేలా హంపి ఉత్సవాలు అంగరంగ వైభవ ంగా ముగిసాయి. వ ుూడో రోజు ఆదివారం ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం హై-క ప్రాంతాల అభివృద్ధికి ఆర్టికల్-371 (జే)ను అమలు చేయడం ద్వారా బళ్లారి జిల్లా విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధి రంగాలు మరింత వృద్ధి చెందుతుందన్నారు. హంపి విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయుల పాలన చిరకాలంగా గుర్తుండేందుకు హంపి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. రాయల కాలం స్వర్ణయుగ కాలంగా గుర్తింపు పొందడం యావత్ ప్రపంచానికి గర్వకారణమన్నారు. హంపిలో జరుగుతున్న ముగింపు ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం చూస్తే తాను ఇంతవరకు మైసూరు ఉత్సవాలు, మడికేరి తదితర ఉత్సవాల్లో కూడా చూడలేదని ఖర్గే అన్నారు.
బెంగళూరు-హొస్పేట మధ్య ఇంటర్సిటీ రైలు ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉందని, ఇక రెండు మూడు నెలల్లో బెంగళూరు ఇంటర్సిటీ రైలు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా హరిహర-కొట్టూరు వ ూర్గంలో కూడా నూతన రైలు సర్వీసును మార్చిలోపు ప్రారంభిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం హై-క ప్రాంతాభివృద్ధికి ఆర్టికల్-371(జే) అమలు చేయడంతో 6 జిల్లాలలో ఈ ఆర్టికల్ అమలులోకి రావడంతో ఆయా జిల్లాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. కన్నడ ప్రసిద్ధ సినీ నటుడు, రాష్ట్ర వసతి శాఖా మంత్రి అంబరీష్ మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్య గత వైభవం మరలా గుర్తు చేసేలా హంపి ఉత్సవాలు జరపడం అభినందనీయమన్నారు.
అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన వివిధ కళాకారుల కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్‌నాయక్, రాష్ట్ర సమాచార మౌలిక సదుపాయాల మంత్రి రోషన్‌బేగ్, ఎమ్మెల్యేలు తుకారాం, నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ, కాంగ్రెస్ నేతలు అల్లం వీరభద్రప్ప, అబ్దుల్ వహాబ్, జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు శోభా బెండిగేరి, ఉపాధ్యక్షురాలు మమత సురేష్, జిల్లాధికారి ఏఏ.బిస్వాస్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఉత్సవాలు
హంపిలో గత మూడు రోజులుగా నిర్వహించిన ఉత్సవాలు ఆదివారంతో ముగిసాయి. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని తలపించేలా హంపి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపారు. ముగింపు ఉత్సవాల సందర్భంగా హంపిలో గ్రామీణ కళలకు అద్దం పట్టే విధంగా వివిధ రకాల జానపద కళాప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, గ్రూప్ డాన్స్‌లు శ్రీకృష్ణదేవరాయ వేదిక వద్ద హోరెత్తించాయి. అదే విధంగా ఈ ఉత్సవాల్లో గ్రామీణ క్రీడలు, సాహస క్రీడలు, కుస్తీపోటీలు, కబడ్డీ తదితర పోటీలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఉత్సవాలను తిలకించేందుకు దేశ, విదేశాలకు చెందిన సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల మొదటి రోజు ప్రజలు పలుచగా కనబడినా మిగిలిన రెండు రోజులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో హంపి వీధులు కిటకిటలాడాయి. సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్ర మంత్రులు ఉత్సవాలకు హాజరై ఇలాంటి ఉత్సవలు ఏటా నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. అదే విధంగా పర్యాటకులు హంపి అందాలను చూస్తూ తన్మయత్వం పొందారు. ఇదిలా ఉంటే సందర్శకులకు భోజనం, నీరు తదితర సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి.
హంపిలోని పురాతన కట్టడాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలతో కొత్త శోభ సంతరించుకుంది. మూడు రోజులుగాఎటు చూసినా జనసందోహమే కనిపించింది. శ్రీకృష్ణదేవరాయ వేదికతోపాటు ఎంపీ ప్రకాష్ వేదిక, హక్కబుక్కరాయ వేదిక, విద్యారణ్య వేదికల వద్ద వుూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక, జానపద, సినీ, నృత్య, హాస్య ఇలా చెప్పుకుంటూ పోతే మన సంస్కృతి వారసత్వాలకు అద్దం పట్టేలా శ్రీకృష్ణదేవరాయల పాలన గత వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా కార్యక్రమాలు నిర్వహించారు.
ముఖ్యంగా ఈసారి హంపి బైస్కై (హెలికాప్టర్లో హంపి అందాలు వీక్షించడం) కార్యక్రమంలో ఒక్కొక్కరి నుంచి రూ.2 వేలు టికెట్టు వసూలు చేస్తూ హంపి చుట్టూ హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టించారు. దాదాపు 800 మందికిపైగా హెలికాప్టర్ ఎక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. హంపి ఉత్సవాల సందర్భంగా దేశ విదేశాల నుంచి వివిధ రకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పర్యాటకులు కదలకుండా కూర్చొనే విధంగా డ్యాన్స్‌లు, పాటలు, మ్యూజిక్ కార్యక్రమాలతో ఉత్సవాలకు ముగింపు పలికారు.