cultural celebration
-
కళాకారుల జీవితాల్లో కాంతులు నింపిన జగనన్న ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని.. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖామాత్యులు ఆర్.కె. రోజా అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించగా మంత్రి రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, సంగీత నృత్య అకాడమీ చైర్ పర్సన్ పి.శిరీష, సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి, అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సీఈవో .మల్లిఖార్జునరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. తోటి కళాకారులందరికీ గుర్తింపుకార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ మంత్రిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు పథకాల ద్వారా కళాకారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేకూర్చిందన్నారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు తగిన న్యాయం జరగలేదన్నారు. కానీ అధికారం చేపట్టిన నాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాకారులకు అండగా నిలబడ్డారన్నారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని తెలిపారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కళాకారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానన్నారు. కళాకారుల వినతిపత్రాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందని స్పష్టం చేశారు. సాంస్కృతిక సంబరాల్లో కళాకారుల డేటా సేకరణ ద్వారా నిజమైన కళాకారులను గుర్తించామన్నారు. ఇప్పుడు ఆ కళాకారులకు గుర్తింపు కార్డులు కూడా అందజేస్తున్నామన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా కళాకారులు దరఖాస్తు చేసుకుని గుర్తింపు కార్డులు పొందవచ్చన్నారు. ప్రతిష్ఠాత్మక జీఐఎస్, జీ20 కార్యక్రమాల్లో మన కళాకారుల ప్రదర్శనలకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర చరిత్రలో 99 శాతం హామీలను నాలుగున్నరేళ్లలో అమలు చేయడమే గాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రాధాన్యం ఇచ్చింది సీఎం జగన్ ఒక్కరే అన్నారు. ఇలా సంక్షేమమే లక్ష్యంగా ముందుకువెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కళాకారులే బాధ్యతగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు. ఈ విషయంలో కళాకరులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఎమ్మార్వో, ఆర్డీవోల ద్వారా పారదర్శకంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. స్వతహాగా కళాకారుడైన తనకు క్రియేటివ్ హెడ్ గా పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్క్షతలు తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఆర్.కె.రోజా ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత మరింత వన్నె తెచ్చారన్నారు. కరోనా తర్వాత కళలు, క్రీడలు పునర్ వైభవాన్ని కోల్పోగా.. వాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పునరుత్తేజం వచ్చిందన్నారు. సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మనదేశాన్ని సాంప్రదాయ కళలు, సంస్కృతులే అత్యున్నత స్థాయిలో ఉంచాయన్నారు. కళలు, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తోందని.. అందుకే అన్ని అకాడమీలకు చైర్మన్లు, చైర్ పర్సన్ లను నియమించిందన్నారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. మనిషి పుట్టుక నుంచి చావు వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తుందన్నారు. కళ కల కోసం కాదని ప్రజల కోసమని తెలిపారు. గుర్తింపు కార్డులు అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల్లో కళాకారులకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ మాట్లాడుతూ.. నేడు రాష్ట్రవ్యాప్తంగా కళాకారుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, రాయితీలు అందించేందుకు మంత్రి రోజా అహర్నిశలు కృషి చేశారన్నారు. సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి మాట్లాడుతూ.. స్వతహాగా వైద్యురాలు అయిన తనకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి, ప్రేమ, తగ్గింపు స్వభావం వంటి సుగుణాలు కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ మాట్లాడుతూ.. చిత్ర కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు అందజేయాలని ఆకాంక్షించారు. కళాకారుల సంక్షేమం కోసం పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కళాకారులంతా అండగా నిలబడాలన్నారు. కార్యక్రమ అనంతరం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాలకు చెందిన 4వేల మంది కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
మూడు వసంతాలు పూర్తి చేసుకున్న 'శ్రీ సాంస్కృతిక కళాసారథి'
సింగపూర్ లో " శ్రీ సాంస్కృతిక కళాసారథి" తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2020 జూలైలో అంకురార్పణ చేసుకున్నఈ " శ్రీ సాంస్కృతిక కళాసారథి" గత మూడు సంవత్సరాల కాలంలో వివిధ రంగాలలో 50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరుపుకుంది. ముఖ్యఅతిథిగా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డా. రామ్ మాధవ్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అర్ధ శతాబ్ది సాంస్కృతికమూర్తి, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు భారతదేశం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన వాక్కులతో సందేశాలను అందించారు. భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సంస్థను, నిర్వాహకులను అభినందిస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర, పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ కూడా సంస్థ కార్యక్రమాలను కార్యదక్షతను అభినందిస్తూ సందేశాలు పంపించారు. ఈ సందర్భంగా సింగపూరు తెలుగు టీవీ వారి ఆధ్వర్యంలో చిన్నారులతో సింగపూరులో నిర్వహిస్తున్న తెలుగు నీతిపద్యాల ఫోటీ ధారావాహిక మొదటి భాగాన్ని జొన్నవిత్తుల గారు వారి అమృతహస్తాల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, తెలుగు భాషా, భారతీయ సంస్కృతులను నిలబెట్టాలని కంకణ ధారి అయ్యి ప్రపంచంలోని అందరు తెలుగు ప్రముఖులను కలుపుకుంటూ సింగపూరు వేదికగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వారి బృందం అందరికీ అభినందనలు తెలియచేసారు. వారు రచించిన 'ఆవకాయ శతకము', 'కోనసీమ శతకములలోని' పద్యాలలో కొన్ని ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. "మైకాష్టకం" అంటూ వారు హాస్యభరితంగా చెప్పిన మైకు గురించిన విషయాలు ఆహ్వానితులందరినీ నవ్వులతో ముంచెత్తింది. అలాగే "తెలుగోళ్ళం తెలుగోళ్ళం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళం" అంటూ వారు స్వయంగా రచించి పాడిన పాటకు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ముఖ్య అతిధి డా. రామ్ మాధవ్ ప్రసంగంలో ఒక మంచి దృఢ సంకల్పంతో సంస్థను స్థాపించి, సమాజానికి, భాషకు, సంస్కృతికి సేవచేయాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ మరో వందేళ్ళు పాటు ఇలా తెలుగులు విరజిల్లుతూ వృద్ధిచెందాలని ఆశీస్సులు అందించారు. భారతీయత తెలుగుదనము మేళవించిన ఒక మంచి సమాజాన్ని తెలుగు రాష్ట్రాలలో నిలబెట్టాలని అలా నిలబెట్టేలా కృషిచేస్తున్న ఈ శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు అదే లక్ష్యంతో పనిచెయ్యడం చాలా సంతోషదాయకం అని అన్నారు. సమాజం తన కాళ్ళ మీద తాను నిలబడాలని, తనను తాను నడిపించుకోవడమే భారత ఆత్మనిర్భరత అని అదే సాహిత్యం, కళా రూపాల యొక్క లక్ష్యం కావాలని వివరించారు. కళలు, సాహిత్యం భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది అని వ్యాఖ్యానించారు. "భగవంతుని అనుగ్రహంతో, పెద్దల దీవెనలతో, అందరి ప్రోత్సాహ సహకారాలతో, మూడు సంవత్సరాల మా ఈ ప్రయాణంలో మీ అందరి మన్ననలను పొందడం మా సంస్థ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మా ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలిపిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము" అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు కార్యక్రమం ఆద్యంతం ఎంతో చక్కగా జరిగింది అని, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. 400 మంది ప్రత్యక్షముగా మరియు 1200 మందికి పైగా ఆన్లైన్ వీక్షించడం జరిగిందని నిర్వాహుకులు తెలిపారు. రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించగా, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే కళాకారులచే కూచిపూడి కథక్ జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య సంకీర్తనాలాపన, తెలుగు పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, వంశీ కృష్ణ శిష్ట్లా సాంకేతిక నిర్వహణా బాధ్యతలు అందించగా, కుమార్, మోహన్, మౌక్తిక, సునీత, రాధికా, రాజి, రేణుక మరియు ప్రసన్న తదితరులు వాలంటీర్ గా సహకారము అందించారు. జీఐఐఎస్, టింకర్ టాట్స్ మొంటోసిరి, కవ్ అండ్ ఫార్మర్ ఈగ జ్యూస్, శబ్ద కాన్సెప్ట్స్, ఎస్ఎన్ఎం డెవెలెపేర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ (భీమవరం), టెర్రాన్ స్పేస్ (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ), ప్రొపెనెక్స్ రాజశేఖర్ ఆర్ధిక సహకారం అందించారు. (చదవండి: ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌కు 'అరుదైన గౌరవం') -
చీరకట్టులో అదుర్స్
కర్ణాటక, చిక్కబళ్లాపురం : పట్టణంలోని అగలగుర్కి బీ జీఎస్ పీయూ కళాశాలలో బుధవారం ఏర్పా టు చేసిన సాంస్కృతిక దినోత్సవ వేడుకల్లో యువతులు సందడి చేశారు. అచ్చమైన చీరకట్టుతో భారతీయ నృత్యరీతులకు అద్దం పడు తూ నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అహో అనిపించాయి. కార్యక్రమాన్ని ప్రారం భించిన ఆదిచుంచనగిరి ట్రస్టు నిర్వాహకులు నిర్మలానందనాథస్వామీజీ మాట్లాడుతూ పాశ్చా త్య సంస్కృతికి స్వస్తి చెప్పి భారతీయ ఆచార వ్యవహారాలను పాటించాలన్నారు. -
ఇట్లు..మీరు.. మేము
సాక్షి, సిటీబ్యూరో: ‘క్రిస్టియన్లు, ముస్లింల కంటే ముందు మేం ఆఫ్రికన్‌లం. ఆ భూమితో, ఆ ప్రకృతితో వేల ఏళ్లుగా మమేకమై జీవిస్తున్నవాళ్లం. వైవిధ్యభరితమైన సాంస్కృతిక జీవితం మా సొంతం. యూరోపియన్ ఆధిపత్య సంస్కృతి కంటే గొప్ప జీవన సంస్కృతిని కలిగి ఉన్నాం. మహోన్నతమైన చారిత్రక, వారసత్వ సంపదను మాకు అందజేసిన మా పూర్వీకులకు కృతజ్ఞులం. అందుకే ఇప్పుడు మేం మూలాల వైపు పయనిస్తున్నాం. ఆఫ్రికన్ అస్తిత్వాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణ సైతం అలాంటి వైవిధ్యంతో కూడిన అస్తిత్వాన్ని కలిగిన ప్రాంతం. ఆఫ్రికన్ దేశాలకు, తెలంగాణకు మధ్య ఎన్నో సాంస్కృతిక సారూప్యతలు ఉన్నాయి...’ అన్నారు ప్రముఖ నటుడు, రచయిత, సియార (పశ్చిమాఫ్రికా)లోని లియోన్‌కు చెందిన స్టోరీ టెల్లర్ యూసిఫు జల్హో. మూడు దశాబ్దాలకు పైగా ఆఫ్రికన్ కథలతో ప్రపంచమంతటా పర్యటిస్తున్న ఆయన జీవితంపై ‘ది కౌ ఫూట్ ప్రిన్స్’ పేరిట ఒక డాక్యుమొంటరీ చిత్రాన్ని కూడా రూపొందించారు. ఇటీవల లండన్‌లో ఆ సినిమా అనేక ప్రదర్శనలను అందుకొంది. త్వరలో అమెరికా ఫిల్మ్ఫెస్టివల్లోనూ దానిని ప్రదర్శించనున్నారు. ‘స్టోరీ ఆర్ట్స్ ఇండియా’ వ్యవస్థాపకులు దీపా కిరణ్ ఆహ్వానంపై ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. పలు స్కూళ్లు, కళాశాలల్లో ఇద్దరూ కలిసి ప్రదర్శనలిస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పే టీచర్లకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న యూసిఫు జల్హో ‘ సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు.ఆ విశేషాలతో ఈ ప్రత్యేక కథనం... ఇది ఒక స్టోరీ టూర్.... నిజమే కథలు పర్యటిస్తున్నాయి. భారతీయ సాంస్కృతిక జీవితంలోని ఔన్నత్యాన్ని, తాత్వికతను, నైతిక విలువలను ప్రతిబింబించే అద్భుతమైన సంగీత,నృత్య రూపక కథలతో పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటున్న దీపాకిరణ్ మన దేశంతో పాటు అనేక దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆయా దేశాలకు చెందిన స్టోరీ టెల్లర్స్‌ను హైదరాబాద్‌కు పరిచయం చేస్తున్నారు. గతంలో థాయ్‌లాండ్, అర్జెంటీనా, కెన్యా, తదితర దేశాలకు చెందిన స్టోరీ టెల్లర్స్‌తో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పశ్చిమాఫ్రికా స్టోరీ టెల్లర్ యూసిఫు కథలు సైతంహైదరాబాద్ పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. ‘రెండు రోజుల క్రితంనచికేత తపోవన్‌లో ఒక ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన బంజారాహిల్స్‌లోని నృత్య ఆర్ట్ ఫోరమ్‌లో ఆఫ్రికన్, ఇండియన్ కథల సమాహారంతో మరో ప్రత్యేక ప్రదర్శన జరుగనుంది. ‘ వివిధ దేశాల మధ్య కథలు పర్యటిస్తున్నాయి. ఇది విభిన్న సంస్కృతుల ప్రవాహం వంటిది. ఆఫ్రికా, తెలంగాణ జీవన విధానంలో అనేక సారూప్యతలు ఉన్నాయి. యూసిఫు కథల్లో ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.’ అని చెప్పారు దీపాకిరణ్. మూడు దశాబ్దాలకు పైగా.... ‘తన వీపు పైన మూపురం ఎందుకు ఉంది.’ అని ఒక పిల్ల ఒంటె తల్లిని అడుగుతుంది. ఎడారిలో నీళ్లను నిల్వ చేసుకొనేందుకు అని చెబుతుంది తల్లి. పెద్ద పెద్ద పాదాలు ఎందుకు ఉన్నాయంటే నిప్పులు చెరిగే ఎండలో, ఇసుకలో నడుస్తున్నప్పుడు నొప్పి తెలియకుండా ఉంటుందని తల్లి చెబుతుంది. ‘ఇప్పుడు మనం ఎందుకు జూలో అన్నాం’ అని అడుగుతుంది పిల్ల ఒంటే. దానికి తల్లి దగ్గర సమాధానం ఉండదు. ఇది ఆఫ్రికన్ స్టోరీ. ప్రకృతితో సహజీవనం చేసే క్రమంలో మనిషి విధ్వంసానికి పాల్పడుతూ తనను తాను బంధించుకుంటున్నాడని ఈ కథనం చెబుతుంది. ఎందుకు అనే మౌలికమైన ప్రశ్నను రేకెత్తించే కథలు, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకొనే కథలు, పూర్వీకులను స్మరించుకొనేవి, జంతువులు, వన్యప్రాణుల పట్ల ప్రేమను, ఆరాధనను ప్రబోధించే కథలు తమ సాహిత్యంలో ఎక్కువగా ఉంటాయని చెప్పారు యూసిఫు. తెలంగాణ జీవితంలోనూ ఇలాంటి కథలే ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. సింహం–చిట్టెలుక, సూరజ్మామ, పేదరాసి పెద్దమ్మ, ఏడు చేపల కథల, పంచతంత్ర కథలు వంటివి గొప్ప నీతిని నేర్పుతాయని చెప్పారు. ‘సంగీతం, నృత్యం కథలకు ప్రాణం. హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ వంటి అనేక కథారూపాల్లో లయబద్ధమైన కథనం, నృత్యం,సంగీతం ఎంతో ఆకట్టుకుంటాయి. మా ఆఫ్రికన్ కథల్లోనూ సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. డుండు, జింబె (డ్రమ్ము), కెంకెని, సంబ వంటి వాద్య పరికరాలు లేకుండా కథా గమనం ఉండదు. ఈ సంగీత పరికరాలన్నీ ఒక కుటుంబం వంటివి. డుండు తల్లి అయితే కెంకెనీ కొడుకు, సంబ కూతురు, జింబె స్వతంత్రంగా ఉండే టీనేజ్ అమ్మాయి వంటిది. కెంకెనీ, సంబ వాద్యాలు డుండును అనుసరిస్తే, జింబె మాత్రం విడిగా ఉంటుంది.’ అంటారాయన. ఎన్నో సారూప్యతలు... ‘హైదరాబాద్ బిర్యానీలాగే ఆఫ్రికన్ జలాఫ్రైస్ చాలా ఫేమస్. ఇక్కడి లాగే రైస్ మాకు ప్రధాన ఆహారం. ఇప్పుడు చాలామంది పూర్వకాలంలోని ఆహార పదార్థాలను ఆస్వాదిస్తున్నారు, రాగులు, కొర్రలు, జొన్నలు వంటి చిరుధాన్యాలు మా ఆహారంలో భాగమయ్యాయి. ఇండియాలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష, సంస్కృతి, ఆహార్యం ఉన్నట్లుగానే ఆఫ్రికన్ దేశాల్లోనూ అనేక భాషలు, సంస్కృతులు, జీవన విధానాలు కనిపిస్తాయి. ఇప్పుడు మా సొంత సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు మూలాలవైపు పయనిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనం వంటిది’ అని ఆయన ముగించారు. -
ప్రపంచవ్యాప్తంగా ‘బతుకమ్మ’ వైభవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవం, జీవన విధానాలను బతుకమ్మ పండుగ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నామని సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై శనివారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 9 నుంచి 17 వరకు బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా బ్రహ్మకుమారీలు, విదేశీ వ్యవహారాల శాఖ సహకారం తీసుకుంటామని చెప్పారు. 25 దేశాలకు సంబంధించిన 75 మంది బ్రహ్మకుమారీ మహిళలు మన రాష్ట్రంలో బతుకమ్మ ఆడతారన్నారు. విదేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల్లో బతుకమ్మలు, సాహిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారన్నారు. ఢిల్లీ, ముంబై, సూరత్ వంటి నగరాలతోపాటు యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్, పోలాండ్ తదితర దేశాల్లో భారత మహి ళలు పాల్గొనేలా చూస్తామన్నారు. వేయిమంది దివ్యాంగ, బధిర, అంధ మహిళలు బతుకమ్మ ఆడేవిధంగా ప్రత్యేకంగా హైటెక్స్‌లో ఏర్పాట్లు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో మొదటిసారిగా 12 ఏళ్లలోపు బాలికల కోసం బొడ్డెమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు. ఆకాశంలో 50 మందితో పారామోటరింగ్ ద్వారా బతుకమ్మ హరివిల్లులు కనిపించేలా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రవీంద్రభారతిలో 9 నుంచి 16 వరకు రవీంద్రభారతిలో 9 నుండి 16 వరకు బతుకమ్మ పై ఫిలిమోత్సవం నిర్వహించి డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తామని తెలిపారు. ఆర్ట్ క్యాంపును ఒక నెల పాటు నిర్వహిస్తామని, ఈ ఆర్ట్ గ్యాలరీలో 55 దేశాల ఫోటోగ్రాఫర్ల ద్వారా ఫోటో ప్రదర్శన జరుగుతుందన్నారు. మహిళాసాధికారతపై అవగాహన బతుకమ్మ సందర్భంగా బాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించి ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు అందించడంతోపాటు మహిళాసాధికారతపై అవగాహన కల్పిస్తామని వెంకటేశం పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ రోజున లేజర్ షో, ఫైర్ వర్క్, కల్చర్ కార్నివాల్ ఉంటుందని, ఐటీ, పరిశ్రమల సహాయంతో పూలశకటాలు నగరంలో ప్రదర్శించటానికి కృషి చేస్తున్నామని వివరించారు. శతాబ్ది, రాజధాని రైళ్లలో ప్రయాణించే మహిళలకు బుక్లెట్లు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనలున్నందున బతుకమ్మ పండగ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులు ఉండరని ప్రజలు, అధికారులు స్వచ్ఛందంగా బతుకమ్మ పండుగలో పాల్గొంటారని తెలిపారు. ఉత్సవాలకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని, జిల్లా లో రూ.15 లక్షలు, విదేశాల్లో 2 కోట్లతో నిర్వహిస్తామన్నారు. బ్రహ్మకుమారీల ద్వారా గ్లోబల్ కల్చరల్ ఫెస్టివల్, బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంతోష్ దీది తెలిపారు. అనంతరం పండుగకు సంబంధించిన సీడీ, పోస్టర్‌ను కార్యదర్శి వెంకటేశం, బ్రహ్మకుమారీస్ ప్రతినిధి సంతోష్ దీది, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. -
టాప్ లేచిపోయింది