ప్రపంచవ్యాప్తంగా ‘బతుకమ్మ’ వైభవం | Cultural Secretary Venkatesam about Batukhamma festival | Sakshi
Sakshi News home page

ప్రపంచవ్యాప్తంగా ‘బతుకమ్మ’ వైభవం

Published Sun, Sep 30 2018 1:59 AM | Last Updated on Sun, Sep 30 2018 1:59 AM

Cultural Secretary Venkatesam about Batukhamma festival - Sakshi

శుక్రవారం సచివాలయంలో బతుకమ్మ పోస్టర్‌ను విడుదల చేస్తున్న బి.వెంకటేశం తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంస్కృతిక వైభవం, జీవన విధానాలను బతుకమ్మ పండుగ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నామని సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై శనివారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్‌ 9 నుంచి 17 వరకు బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా బ్రహ్మకుమారీలు, విదేశీ వ్యవహారాల శాఖ సహకారం తీసుకుంటామని చెప్పారు. 25 దేశాలకు సంబంధించిన 75 మంది బ్రహ్మకుమారీ మహిళలు మన రాష్ట్రంలో బతుకమ్మ ఆడతారన్నారు.

విదేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల్లో బతుకమ్మలు, సాహిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారన్నారు. ఢిల్లీ, ముంబై, సూరత్‌ వంటి నగరాలతోపాటు యూకే, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్, పోలాండ్‌ తదితర దేశాల్లో భారత మహి ళలు పాల్గొనేలా చూస్తామన్నారు. వేయిమంది దివ్యాంగ, బధిర, అంధ మహిళలు బతుకమ్మ ఆడేవిధంగా ప్రత్యేకంగా హైటెక్స్‌లో ఏర్పాట్లు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో మొదటిసారిగా 12 ఏళ్లలోపు బాలికల కోసం బొడ్డెమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు. ఆకాశంలో 50 మందితో పారామోటరింగ్‌ ద్వారా బతుకమ్మ హరివిల్లులు కనిపించేలా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 

రవీంద్రభారతిలో 9 నుంచి 16 వరకు 
రవీంద్రభారతిలో 9 నుండి 16 వరకు బతుకమ్మ పై ఫిలిమోత్సవం నిర్వహించి డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తామని తెలిపారు. ఆర్ట్‌ క్యాంపును ఒక నెల పాటు నిర్వహిస్తామని, ఈ ఆర్ట్‌ గ్యాలరీలో 55 దేశాల ఫోటోగ్రాఫర్ల ద్వారా ఫోటో ప్రదర్శన జరుగుతుందన్నారు.

మహిళాసాధికారతపై అవగాహన
బతుకమ్మ సందర్భంగా బాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించి ఐరన్, ఫోలిక్‌ ఆసిడ్‌ మాత్రలు అందించడంతోపాటు మహిళాసాధికారతపై అవగాహన కల్పిస్తామని వెంకటేశం పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ రోజున లేజర్‌ షో, ఫైర్‌ వర్క్, కల్చర్‌ కార్నివాల్‌ ఉంటుందని, ఐటీ, పరిశ్రమల సహాయంతో పూలశకటాలు నగరంలో ప్రదర్శించటానికి కృషి చేస్తున్నామని వివరించారు. శతాబ్ది, రాజధాని రైళ్లలో ప్రయాణించే మహిళలకు బుక్‌లెట్లు పంపిణీ చేస్తామన్నారు.

ఎన్నికల నిబంధనలున్నందున బతుకమ్మ పండగ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులు ఉండరని ప్రజలు, అధికారులు స్వచ్ఛందంగా బతుకమ్మ పండుగలో పాల్గొంటారని తెలిపారు. ఉత్సవాలకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని, జిల్లా లో రూ.15 లక్షలు, విదేశాల్లో 2 కోట్లతో నిర్వహిస్తామన్నారు. బ్రహ్మకుమారీల ద్వారా గ్లోబల్‌ కల్చరల్‌ ఫెస్టివల్, బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంతోష్‌ దీది తెలిపారు. అనంతరం పండుగకు సంబంధించిన సీడీ, పోస్టర్‌ను కార్యదర్శి వెంకటేశం, బ్రహ్మకుమారీస్‌ ప్రతినిధి సంతోష్‌ దీది, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement