మూడు వసంతాలు పూర్తి చేసుకున్న 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' | Occasion Successful Completion 3 Years Singapore Sri Cultural kalasarathi | Sakshi
Sakshi News home page

మూడు వసంతాలు పూర్తి చేసుకున్న 'శ్రీ సాంస్కృతిక కళాసారథి'

Published Mon, Aug 7 2023 5:17 PM | Last Updated on Mon, Aug 7 2023 5:20 PM

Occasion Successful Completion 3 Years Singapore Sri Cultural kalasarathi - Sakshi

సింగపూర్ లో " శ్రీ సాంస్కృతిక కళాసారథి" తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  2020 జూలైలో అంకురార్పణ చేసుకున్నఈ " శ్రీ సాంస్కృతిక కళాసారథి" గత మూడు సంవత్సరాల కాలంలో వివిధ రంగాలలో 50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరుపుకుంది. ముఖ్యఅతిథిగా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డా. రామ్ మాధవ్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి  జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అర్ధ శతాబ్ది సాంస్కృతికమూర్తి, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు భారతదేశం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన వాక్కులతో సందేశాలను అందించారు.

భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సంస్థను, నిర్వాహకులను అభినందిస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర, పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ కూడా సంస్థ  కార్యక్రమాలను కార్యదక్షతను అభినందిస్తూ సందేశాలు పంపించారు. ఈ సందర్భంగా సింగపూరు తెలుగు టీవీ వారి ఆధ్వర్యంలో చిన్నారులతో సింగపూరులో నిర్వహిస్తున్న తెలుగు నీతిపద్యాల ఫోటీ ధారావాహిక మొదటి భాగాన్ని  జొన్నవిత్తుల గారు వారి అమృతహస్తాల మీదుగా విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, తెలుగు భాషా, భారతీయ సంస్కృతులను నిలబెట్టాలని కంకణ ధారి అయ్యి ప్రపంచంలోని అందరు తెలుగు ప్రముఖులను కలుపుకుంటూ సింగపూరు వేదికగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వారి బృందం అందరికీ అభినందనలు తెలియచేసారు. వారు రచించిన 'ఆవకాయ శతకము', 'కోనసీమ శతకములలోని' పద్యాలలో కొన్ని ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. "మైకాష్టకం" అంటూ వారు హాస్యభరితంగా చెప్పిన మైకు గురించిన విషయాలు ఆహ్వానితులందరినీ నవ్వులతో ముంచెత్తింది. అలాగే "తెలుగోళ్ళం తెలుగోళ్ళం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళం" అంటూ వారు స్వయంగా రచించి పాడిన పాటకు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

ముఖ్య అతిధి డా. రామ్ మాధవ్ ప్రసంగంలో ఒక మంచి దృఢ సంకల్పంతో సంస్థను స్థాపించి, సమాజానికి, భాషకు, సంస్కృతికి సేవచేయాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ మరో వందేళ్ళు పాటు ఇలా తెలుగులు విరజిల్లుతూ వృద్ధిచెందాలని ఆశీస్సులు అందించారు. భారతీయత తెలుగుదనము మేళవించిన ఒక మంచి సమాజాన్ని తెలుగు రాష్ట్రాలలో నిలబెట్టాలని అలా నిలబెట్టేలా కృషిచేస్తున్న ఈ శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు అదే లక్ష్యంతో పనిచెయ్యడం చాలా సంతోషదాయకం అని అన్నారు. సమాజం తన కాళ్ళ మీద తాను నిలబడాలని, తనను తాను నడిపించుకోవడమే భారత ఆత్మనిర్భరత అని అదే సాహిత్యం, కళా రూపాల యొక్క లక్ష్యం కావాలని వివరించారు. కళలు, సాహిత్యం భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది అని వ్యాఖ్యానించారు. "భగవంతుని అనుగ్రహంతో, పెద్దల దీవెనలతో, అందరి ప్రోత్సాహ సహకారాలతో, మూడు సంవత్సరాల మా ఈ ప్రయాణంలో మీ అందరి మన్ననలను పొందడం మా సంస్థ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము.

మా ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలిపిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము" అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు కార్యక్రమం ఆద్యంతం ఎంతో చక్కగా జరిగింది అని, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. 400 మంది ప్రత్యక్షముగా మరియు 1200 మందికి పైగా ఆన్లైన్ వీక్షించడం జరిగిందని నిర్వాహుకులు తెలిపారు. రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించగా, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే కళాకారులచే కూచిపూడి కథక్ జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య సంకీర్తనాలాపన, తెలుగు పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.

గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, వంశీ కృష్ణ శిష్ట్లా సాంకేతిక నిర్వహణా బాధ్యతలు అందించగా, కుమార్, మోహన్, మౌక్తిక, సునీత, రాధికా, రాజి, రేణుక మరియు ప్రసన్న తదితరులు వాలంటీర్ గా సహకారము అందించారు. జీఐఐఎస్‌, టింకర్ టాట్స్ మొంటోసిరి, కవ్‌ అండ్‌ ఫార్మర్‌ ఈగ జ్యూస్, శబ్ద కాన్సెప్ట్స్, ఎస్‌ఎన్‌ఎం డెవెలెపేర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ (భీమవరం), టెర్రాన్ స్పేస్ (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ), ప్రొపెనెక్స్‌ రాజశేఖర్ ఆర్ధిక సహకారం అందించారు.

(చదవండి: ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌కు 'అరుదైన గౌరవం')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement