cultural programe
-
అక్టోబర్ 28న తారామతి బారాదరిలో నాట్యతోరణం !
భారతదేశానికి చెందిన పురాతనమైన, అంతరించిపోతున్న నాట్యరీతులకు పునర్వైభవం కల్పించేందుకు టెక్నాలజీ, సోషల్ మీడియాల ద్వారా కృషిచేస్తున్న సంస్థ.. అమృత కల్చరల్ ట్రస్ట్. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ శనివారం నగరంలోని ప్రముఖ కళావేదిక తారామతి బారాదరిలో గల కేళిక ఇండోర్ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నాట్యతోరణం-2023 పేరిట ఒక నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కూచిపూడి, భరతనాట్యం, మోహిని అట్టం, ఒడిస్సి, కథక్‌లతో పాటు.. ప్రముఖ నాట్యగురువు కళాకృష్ణ బృందం పేరిణి శివతాండవం కూడా ప్రదర్శిస్తారు. ఈ అన్నిరకాల నాట్యరీతులను వాటిలో లబ్ధ ప్రతిష్ఠులైన గురువుల మార్గదర్శకత్వంలో వారి బృందాలు ప్రదర్శిస్తాయి. ఇందులో ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ హాజరవుతారు. మహిళా సంరక్షణ విభాగం డీఐజీ సుమతి, డాక్టర్ అనురాధ జొన్నలగడ్డ, కళారత్న డాక్టర్ వనజా ఉదయ్, చావలి బాల త్రిపుర సుందరి తదితరులు కూడా పాల్గొంటారు. హైదరాబాద్ క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో రెండు లేదా మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమం ద్వారా సంప్రదాయ నాట్య రూపాల విశిష్టతను చాటిచెప్పే అవకాశం కలగజేస్తామని అమృత కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భార్గవి పగడాల అన్నారు. అమృత కల్చరల్ ట్రస్ట్ మూడో వార్షికోత్సవ కార్యక్రమమైన నాట్య తోరణం- 2023 ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న నిపుణులైన డ్యాన్సర్ల కళాప్రదర్శన వీక్షించే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. నృత్యాన్ని వృత్తిగా అవలంబించేవారికి తమ ట్రస్టు స్కాలర్షిప్లను అందజేస్తోందని భార్గవి తెలిపారు. సంప్రదాయ నృత్య అంశాలను భద్రపరచడం, ప్రోత్సహించడం కోసం అమృత కల్చరల్ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ రంగంలో ఉత్సాహవంతులైన యువతను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తున్నట్లు భార్గవి చెప్పారు. (చదవండి: వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!) -
Mumbai: 23 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు కరోనా
ముంబై: కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్న ప్రజల అజాగ్రత్త వలన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా, ముంబైలోని కేఈఎం మెడికల్ కాలేజ్‌లో కరోన కేసులు బయటపడ్డాయి. కాగా, 23 మంది ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు కరోనా సోకినట్లు కళాశాల డీన్ డాక్టర హేమంత్ దేశ్‌ముఖ్ తెలిపారు. 29 మంది విద్యార్థులలో 23 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అయితే, వారందరికి లక్షణాలు పెద్దగా లేవని వైద్యులు తెలిపారు. మెడికల్ కాలేజ్‌లో ఇటీవల నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమం వలన వైరస్ వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం.. 29 మంది విద్యార్థులలో 27 మంది విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించుకున్నారని డీన్ తెలిపారు. వారిలో ఇద్దరు విద్యార్థులు మాత్రం ముంబై లోని సెవన్ హిల్స్ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతంవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీనిపై మేయర్ కిషోరి ఫడ్నేకర్ స్పందించారు. ప్రస్తుతం.. ఎంబీబీఎస్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. చదవండి: Navjot Singh Sidhu: సిద్ధూ ఆప్‌లో చేరబోతున్నాడా? -
వృద్ధాప్యం భారం కాకూడదు: రోశయ్య
నాగోలు: పెద్దలను, తల్లిదండ్రులను ప్రేమించని వారు సమాజాన్ని ప్రేమించలేరని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. వృద్ధాప్యం ఎవరికీ భారం కావొద్దని పేర్కొన్నారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రా, తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీనగర్ నాగోలులో 264 జంటలకు సామూహిక షష్టిపూర్తి మహోత్సవం, వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోశయ్య మాట్లాడుతూ 60 సంవత్సరాల షష్టిపూర్తి చేసుకున్న వారు వంద సంవత్సరాలు హాయిగా జీవించాలని ఆకాంక్షించారు. ఇంత పెద్ద ఎత్తున సామూహిక షష్టిపూర్తి మహోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిలు మాట్లాడుతూ వైశ్యులు సేవారంగంలో ఎప్పుడూ ముందుంటారని, గ్రామాలలో ఏ ఒక్కరికీ ఇబ్బందులు వచ్చినా మొదటగా వెళ్లేది వైశ్యుల దగ్గరికేనని అన్నారు. ప్రభుత్వం తరపున వైశ్యులకు సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధులు సమాజ దిక్సూచిలాంటి వారని, వారి దగ్గరి నుంచి సలహాలు తీసుకుని ముందుకు సాగాలన్నారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ వైశ్యులను అంతా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. 264 మంది జంటలు షష్టిపూర్తి మహోత్సవంలో పాల్గొనగా, 21 మంది అనాథ జంటలకు కూడా ఈ ఉత్సవంలో అవకాశం కల్పించారు. అనంతరం తులాభారం నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. 264 మందికి ఒకేసారి షష్టిపూర్తి నిర్వహించడంతో ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్‌లో స్థానం లభించిందని ఆ సంస్థ ఇండియా కో ఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు గంజి రాజమౌళిగుప్తా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఎంపీ మల్లారెడ్డి, నిజామాబాద్, గోషామహల్ ఎమ్మెల్యేలు గణేష్‌గుప్తా, రాజాసింగ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.