భారతదేశానికి చెందిన పురాతనమైన, అంతరించిపోతున్న నాట్యరీతులకు పునర్‌వైభవం కల్పించేందుకు టెక్నాలజీ, సోషల్ మీడియాల ద్వారా కృషిచేస్తున్న సంస్థ.. అమృత కల్చరల్ ట్రస్ట్. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ శనివారం నగరంలోని ప్రముఖ కళావేదిక తారామతి బారాదరిలో గల కేళిక ఇండోర్ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నాట్యతోరణం-2023 పేరిట ఒక నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కూచిపూడి, భరతనాట్యం, మోహిని అట్టం, ఒడిస్సి, కథక్‌లతో పాటు.. ప్రముఖ నాట్యగురువు కళాకృష్ణ బృందం పేరిణి శివతాండవం కూడా ప్రదర్శిస్తారు.
ఈ అన్నిరకాల నాట్యరీతులను వాటిలో లబ్ధ ప్రతిష్ఠులైన గురువుల మార్గదర్శకత్వంలో వారి బృందాలు ప్రదర్శిస్తాయి. ఇందులో ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ హాజరవుతారు. మహిళా సంరక్షణ విభాగం డీఐజీ సుమతి, డాక్టర్ అనురాధ జొన్నలగడ్డ, కళారత్న డాక్టర్ వనజా ఉదయ్, చావలి బాల త్రిపుర సుందరి తదితరులు కూడా పాల్గొంటారు. హైదరాబాద్ క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో రెండు లేదా మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమం ద్వారా సంప్రదాయ నాట్య రూపాల విశిష్టతను చాటిచెప్పే అవకాశం కలగజేస్తామని అమృత కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భార్గవి పగడాల అన్నారు.
అమృత కల్చరల్ ట్రస్ట్ మూడో వార్షికోత్సవ కార్యక్రమమైన నాట్య తోరణం- 2023 ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న నిపుణులైన డ్యాన్సర్ల కళాప్రదర్శన వీక్షించే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. నృత్యాన్ని వృత్తిగా అవలంబించేవారికి తమ ట్రస్టు స్కాలర్‌షిప్‌లను అందజేస్తోందని భార్గవి తెలిపారు. సంప్రదాయ నృత్య అంశాలను భద్రపరచడం, ప్రోత్సహించడం కోసం అమృత కల్చరల్ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ రంగంలో ఉత్సాహవంతులైన యువతను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తున్నట్లు భార్గవి చెప్పారు.
(చదవండి: వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!)
Comments
Please login to add a commentAdd a comment