అశ్లీల కట్టడికి అమెరికా సంస్థ సాయం
సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో బాలల అశ్లీల వెబ్సైట్లను అరికట్టడానికి అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకుంటున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంఈసీ)... పిల్లల అశ్లీలానికి సంబంధించిన వీడియోల అప్లోడింగ్ సమాచారాన్ని 99 దేశాలకు అందిస్తోందని పేర్కొంది.
తప్పిపోయిన, లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని ఓ ప్రత్యేక చానెల్ ద్వారా ఆ సంస్థ వివిధ దేశాల భద్రతా సంస్థలకు సమకూరుస్తోందని వెల్లడించింది. పిల్లల అశ్లీల వీడియోల కట్టడికి సంబంధించి స్టేటస్ రిపోర్టును కేంద్రం సుప్రీంకోర్టులో సమర్పిస్తూ ఈ విషయాలను పేర్కొంది. సమాచారాన్ని ఉచితంగా పొందేందుకు వీలుగా ఆ సంస్థ భారత్‌లో కూడా ఓ ప్రత్యేక చానెల్‌ను ఏర్పాటుచేస్తుందని వెల్లడించింది.