కరెంట్ తీగలు అమర్చి..నీలుగాయి హతం
జన్నారం : కరెంటు తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చిన ఏడుగురు గిరిజనులను ఫారెస్టు అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మాంసం కోసి కుప్పలు వేస్తుండగా అధికారులు ఒక్కసారిగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటన జన్నారం అటవీ డివిజన్లోని అలీనగర్ బీట్ పరిధిలో జరిగింది. జన్నారం రేంజ్ అధికారి నిజామొద్దీన్ తెలిపిన వివరాలివీ..అలీనగర్ గ్రామంలో జొన్నచేలకు వన్యప్రాణుల బెడద ఉందని గిరిజనులు విద్యుత్ తీగలు అమర్చారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆ తీగలకు తగిలి ఓ నీలుగాయి మృతిచెందింది. దీంతో 20 మంది గిరిజనులు నీలుగాయిని ఊళ్లోకి తెచ్చి కోశారు.
మాంసాన్ని కుప్పలు వేస్తుండగా సమాచారం అందుకున్న డివిజన్ మొబైల్ పార్టీ సిబ్బంది డీఆర్వో లక్ష్మీకాంతరెడ్డి సిబ్బందితో అక్కడికి వెళ్లడంతో కొంతమంది పారిపోయారు. అధికారులు మాంసం, సామగ్రితోపాటు నీలుగాయి హతమార్చడానికి కారణమైన అలీనగర్‌కు చెందిన పెంద్రం లక్ష్మణ్, సుభాష్, మడావి నర్సింగరావు, కృష్ణ, సిడాం నగేశ్, కుర్సింగ భీంరావు, విజయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో 13 మంది పరారయ్యారు. వారిని డివిజన్ కార్యాలయానికి తరలించారు. ఇందులో ముగ్గురు 14 సంవత్సరాలలోపు పిల్లలు ఉండటం గమనార్హం. అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరుస్తామని రేంజ్ అధికారి తెలిపారు. ఈ దాడిలో మామిడిపెల్లి సెక్షన్ అధికారి శ్రీరాం, బీట్ అధికారులు భూమన్న, శంకర్, ఐలయ్య, ఏబీవో మక్బూల్ పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన లేకే..
అడవుల్లో నివసించే గిరిజనులకు చట్టాలపై అవగాహన లేక వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తినడానికి తిండి లేని గిరిజనులు వన్యప్రాణులను వేటాడి అనవసరంగా కటకటాల పాలవుతున్నారు. శుక్రవారం జరిగిన సంఘటన చూస్తే గ్రామంలో చాలా మంది మాంసం పంచుకునేందుకు వచ్చారే తప్పా, వన్యప్రాణులను చంపితే చర్యలుంటాయని వారికి తెలియదు. గ్రామంలోని మైనర్ బాలురు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే వారిలో అవగాహన లోపమేనని స్పష్టమవుతోంది.