బాబుతో టీటీడీపీ ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. సోమవారం సచివాలయం ఎల్ బ్లాకు ఎనిమిదో అంతస్తులోని చంద్రబాబు కార్యాలయంలో 45 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. టీటీడీపీ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలపై ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, మాధవరం కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే అంశాలపై చంద్రబాబు అసలు ప్రస్తావించనే లేద ని, ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకంగా ఎలా వ్యవహరించాలనే విషయంపైనే చర్చించామని ఆర్.కృష్ణయ్య మీడియాకు వెల్లడించారు. బీసీల సమస్యలపై పోరాటమే తనకు ప్రాధాన్యత అం శమని, చంద్రబాబుకు ఇదే విషయాన్ని చెప్పానన్నారు.
రాష్ట్రం విడిపోతే కరెంటు సమస్య వస్తుందని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆనాడే చెప్పారని, అయితే, తాను సీఎం కాగానే కరెంటు సమస్య పరిష్కరిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడేం చేయలేకపోతున్నారని విమర్శించారు. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి సీఎం, మంత్రుల్ని కలిస్తే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాదని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారానికి టీడీపీ ఎమ్మెల్యేలంతా బస్సుయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు.