గాలివాన విధ్వంసం...
హిందూపురం మునిసిపాలిటీ/అర్బన్, న్యూస్‌లైన్ : పట్టణంలో శనివారం అర్ధరాత్రి గాలివాన విధ్వంసం సృష్టించింది. రాత్రి 11 నుంచి సుమారు గంటన్నర పాటు ఏకధాటిగా వీచిన గాలి, కురిసిన వర్షంతో పట్టణం అతలాకుతలమైంది. పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్లు పడి పలు స్తంభాలు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉదయం 6 గంటలకు హిందూపురం నుంచి బెంగళూరు వెళ్లే ప్యాసింజర్ రైలు 8 గంటల వరకు ఆగిపోయింది.
ఈ సమయంలో హిందూపురం మీదుగా బెంగళూరు, హైదరాబాదు వెళ్లే పలు రైళ్లను నిలిపి వేశారు. ప్యాసింజర్ రైలుకు సిగ్నల్ ఇవ్వక పోవడాన్ని అధికారులు ప్రకటించక పోవడంతో ప్రయాణికులు గొడవకు దిగారు. టికెట్ కొన్న అనేక మంది రైల్వే స్టేషన్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. స్థానిక బాలాజీ రోడ్లో పెద్దపెద్ద వృక్షాలు నెలకొరిగాయి. పెనుకొండ రోడ్‌లోని ఆర్కే ల్యాబ్ సమీపంలో చింతచెట్టు కొమ్మ విరిగి పడ్డంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధన్ రోడ్లో శ్రీనివాసరెడ్డి ఇంటిపై చేనేత పనుల నిమిత్తం ఏర్పాటు చేసుకున్న షెడ్ రేకులు గాలికి కొట్టుకు పోయింది. మొదటి రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన అతి పెద్ద హోర్డింగ్స్ బోర్డు కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌పై పడింది. ఈ ఘటనకు కొద్ది సేపటికి ముందు డీజల్ కోసం వచ్చిన వాహనాలు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న సద్భావన చిహ్నం దిమ్మెకు నాలుదిక్కులా ఏర్పాటు చేసిన పెద్ద హోర్డింగ్ గాలికి నేలకొరగడంతో పాటు దిమ్మె పాక్షికంగా దెబ్బతిన్నది. ముద్దిరెడ్డిపల్లిలో ఓ చెట్లు పూరిళ్లపై పడ్డాయి. పశువుల షెడ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
ఆదివారం ఉదయం నుంచి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టిన సిబ్బంది సాయంత్రం 4 గంటలకు సరఫరా చేశారు. పట్టణంలో ఇటీవల రోడ్డుకు ఇరువైపులా కేబుల్ పనుల కోసం తవ్విన గుంతలతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.