100 కిలోల బంగారం.. కొట్టేశాడా?
సాధారణంగా విదేశాల నుంచి బంగారం అక్రమంగా తీసుకొచ్చినప్పుడు దాన్ని పట్టుకునే కస్టమ్స్ అధికారులు ఆ బంగారం అంతటినీ భద్రంగా ఉంచుతారు. కానీ, అక్కడక్కడ అవినీతిపరులు మాత్రం అందులో కూడా తమ చేతివాటం చూపిస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. అక్కడ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో పట్టుకున్న దాంట్లో దాదాపు వంద కిలోల బంగారం కనిపించకుండా పోయింది. ఒకటీ అరా కాకుండా ఏకంగా వంద కిలోల బంగారం కనిపించకపోవడంతో ఉన్నతాధికారుల్లో కలవరం మొదలైంది. దాంతో ఏం జరిగిందా అని ఆరా తీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన సీబీఐ.. ఇది ఇంటిదొంగల పనే తప్ప బయటి వాళ్లది కాదని ప్రాథమికంగా తేల్చింది. బంగారం మిస్సయిన కేసులో ఒక సీనియర్ కస్టమ్స్ అధికారిని అరెస్టు చేసింది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం కనిపించకుండా పోవడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు జనవరిలో కూడా దాదాపు రూ. 2 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారం కనిపించకపోవడంతో అప్పుడు కూడా దానిపై సీబీఐ కేసు నమోదు చేసింది.