అప్పుడే.. కోతలు
వరంగల్, న్యూస్‌లైన్: కరెంట్ కష్టాలు మళ్లీ మెదలయ్యాయి... ముందుగా గ్రామాల నుంచే కోతలు ప్రారంభమయ్యూరుు. ఖరీఫ్ సీజన్ తర్వాత అన్ని ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేశారు. ప్రస్తుతం రబీ సీజన్ మొదలుకావడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో కోతలు అమలు చేయాలని ఈఆర్సీకి ప్రభుత్వం సూచించింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం శనివారం నుంచి గ్రామాల్లో అధికారికంగా కోతలు విధించేందుకు అధికారులు సన్నద్ధమయ్యూరు. అరుుతే పల్లెల్లో శుక్రవారం నుంచే కోతలు అమల్లోకి రాగా... మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో అనధికారికంగా ఇప్పటికే సరఫరా నిలిపివేస్తున్నారు.
తగ్గిన విద్యుత్ ఉత్పత్తి
ప్రస్తుతం జిల్లాలో 9 మెగా యూనిట్ల విద్యుత్ అవసరం. నాలుగు రోజుల క్రితం వరకు 9 ఎంయూల చొప్పున విద్యుత్ సరఫరా చేశారు. గురువారం నుంచి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. శుక్రవారం 8.01 ఎంయూలకు చేరింది. శనివారం నుంచి మరింత తగ్గనున్నట్లు అంచనా వేసిన ప్రభుత్వం కోతలు అమలు చేయూలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గ్రామాల్లో పగటి పూట మొత్తం బంద్
గ్రామాల్లో కచ్చితంగా 12 గంటల కోత విధించాలని ఈఆర్సీ నుంచి ఏఈ, డీఈ, ఏడీఈలకు శుక్రవారం ఆదేశాలు అందారుు. ఈ మేరకు గ్రామాల్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. అయితే పగటిపూట వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ ఉన్నప్పుడు మూడు గంటలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పగటిపూట మూడు గంటల విద్యుత్ సరఫరా చేస్తే... రాత్రిపూట మూడు గంటలు విడతలవారీగా కోత విధించడం తప్పదంటున్నారు. ఒకవేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరంగా సరఫరా నిలిపివేస్తే... వ్యవసాయ విద్యుత్‌కు మూడు గంటల కోత పడ్డట్టే.
మండల కేంద్రాల్లో అనధికారికం
మండల కేంద్రాల్లో విద్యుత్ కోతలు లేవని అధికారులు చెబుతున్నా... రెండు గంటలపాటు కరెంట సరఫరా నిలిపివేస్తున్నారు. శుక్రవారం జనగామ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో ఉదయం 8.10 నుంచి 10.10 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. గురువారం ఉదయం 8.10 గంటలకు కరెంట్ పోతే... మళ్లీ 11.10 గంటలకు వచ్చింది. ఇలా రెండు నుంచి మూడు గంటల కోత విధిస్తున్నారు. అయితే మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ ప్రాంతాల్లో కోతలు లేవని... అత్యవసర పరిస్థితుల్లో ఎల్ఆర్ తీసుకుంటున్నామని అధికారులు చెబుతుండడం కొసమెరుపు.
మెల్లమెల్లగా అంతటికీ...
ప్రస్తుతం గ్రామాలకు 12 గంటల కోతలను అమల్లో పెడుతున్నారు. కానీ... వారం రోజుల తర్వాత మండలాలు, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో సైతం అధికారికంగా విద్యుత్ కోతలు పెట్టే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. వరంగల్ మహానగరంతోపాటు మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఇప్పటివరకు కోతలు లేవు. కానీ.. వచ్చే కొద్ది రోజుల్లో కనీసం రెండు గంటలైనా విద్యుత్ సరఫరా నిలిపివేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రబీ సీజన్లో రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని తేలడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కాగా, అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా కోతల వేళలు ప్రకటించ లేదు.