మమత, అమిత్ షా పరస్పర విమర్శలు
కోల్కతా: బెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య గురువారం మాటల యుద్ధం నడిచింది. కట్మనీ, రాజకీయ హింస, అవినీతితో బెంగాల్ ఉక్కిరిబిక్కిరవుతోందని అమిత్ విమర్శించగా, దేశంలో మతకల్లోలాలు, బీజేపీ రాష్ట్రాల్లో మహిళలపై దాడులనుంచి దృష్టి మరలించేందుకు బెంగాల్ గురించి మోదీ, షాలు అబద్ధాలు చెబుతున్నారని మమత ప్రతివిమర్శలు చేశారు. గతేడాది బెంగాల్ ఎన్నికల వేళ ఇరువురి మధ్య ఇదే తరహా మాటల యుద్ధం నడిచింది. దీంతో పాటు సీఏఏపై కూడా ఇరువురూ మరోమారు విమర్శలు చేసుకున్నారు.
దేశంలో చొరబాటుదారులకు ఓటింగ్ హక్కులు కల్పించాలని మమత భావిస్తున్నారని షా ఆరోపించారు. అయితే సీఏఏతో ప్రజలను బీజేపీ అవమానిస్తోందని మమత విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని షా దుయ్యబట్టారు. ఈ ఘోరాలను అరికడతారని సంవత్సరకాలంగా ఎదురు చూశామని, కానీ మమత తీరు మారలేదని విమర్శించారు. అయితే ఉత్తరప్రదేవ్, మధ్య ప్రదేశ్లో శాంతిభద్రతల ఉల్లంఘనపై అమిత్ దృష్టి పెడితే మంచిదని మమత ఎద్దేవా చేశారు. తమ రాష్ట్రానికి పంపినట్లు జాతీయ మానవహక్కుల బృందాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు పంపాలన్నారు.