నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు
రేట్లకోత ఉండదనే అంచనాలకు బలం
మళ్లీ 27వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా నియమితులు కానున్న ఉర్జిత్ పటేల్... ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే, రేట్ల కోతకు సుముఖంగా ఉండరన్న అంచనాలతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు అవకాశాలు పెరగడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీన పడ్డాయి. దీంతో మన దేశీ స్టాక్ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మళ్లీ 28వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 91 పాయింట్లు క్షీణించి 27,986 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు పడిపోయి 8,629 పాయింట్ల వద్ద ముగిశాయి.
బ్యాంక్, వాహన, ఐటీ, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని, ట్రేడింగ్ స్తబ్ధుగా కొనసాగిందని నిపుణులు పేర్కొన్నారు. డాలర్‌తో రూపాయి మారకం 19 పైసలు క్షీణించి 3 వారాల కనిష్ట స్థాయికి పడిపోవడం, ఈ ఏడాదిలోనే రేట్ల పెంపు ఉండొచ్చని ఫెడరల్ రిజర్వ్ ప్రకచించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఆర్బీఐకు కొత్త గవర్నర్ పేరును ప్రభుత్వం వెల్లడించడంతో మార్కెట్ నష్టపోయిందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.