ఏప్రిల్‌లో ఆర్‌బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: భారత రిజర్వ్ బ్యాంక్ తన ఏప్రిల్ 7 నాటి ద్రవ్య పరపతి విధానంలో కీలక రేట్లను తగ్గించకపోవచ్చని డీబీఎస్(డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్) అంచనా వేస్తోంది. అయితే జూన్‌లో మాత్రం 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని పేర్కొంది. ఈ నెలలో ఎవరూ ఊహించని విధంగా ఆర్‌బీఐ పావు శాతం మేర రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని, దీంతో రూపాయి క్రమంగా బలహీనపడుతుందని డీబీఎస్ పేర్కొంది. అకాల వర్షాల కారణంగా శీతాకాల పంటలపై ప్రభావం పడిందని, దీంతో ఆహార పదార్ధాల ధరలు పెరిగే అవకాశాలున్నాయని, ఇక చమురు ధరలు కనిష్ట స్థాయికి చేరాయని వివరించింది. కాగా ద్రవ్యోల్బణం తగ్గుతుండటంతో వృద్ధి జోరు పెంచడానికి వడీరేట్లను తగ్గించాలని పరిశ్రమలు కోరుతున్నాయి. పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా ఆర్‌బీఐ ఇప్పటివరకూ కీలక రేట్లను ఈ ఏడాది రెండు సార్లు పావు శాతం చొప్పున తగ్గించింది.