ఎయిర్ టెల్ మరో భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4 జీ సేవల ఆవిష్కరణతో ప్రముఖ టెలికాం కంపెనీల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ టెల్, ఐడియాతోపాటూ, వోడాఫోన్ డేటా చార్జీలను తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే అనేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకనే ప్రయత్నం చేస్తున్న భారతి ఎయిర్ టెల్ తాజాగా మరో భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4 జీ సేవల ధరను భారీగా తగ్గించేసింది. ఈ స్పెషల్ స్కీం కింద ధరలను 80 శాతం తగ్గించింది. కేవలం రూ.51 కే జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికి ఢిల్లీలో ఉన్న ఈ ఆఫర్ ఈనెల (ఆగస్లు) 31 కల్లా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందనీ, భారతీ ఎయిర్టెల్ డైరెక్టర్ ఆపరేషన్స్ (భారతదేశం మరియు దక్షిణ ఆసియా), అజయ్ పూరి చెప్పారు
అయితే దీనికోసం వినియోగారులు ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వరకు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 12 నెలల వరకు వర్తించనుంది. ఈ కాలంలో ఎన్నిసార్లయినా రూ.51కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు రూ.748 రీచార్జ్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.99 కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో రూ.259కి ఒక జీబీ 4జీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే.