Cyber Crime Station
-
సైబర్ టెర్రర్
సాక్షి, సిటీబ్యూరో : రాజధానిలో సైబర్ నేరస్తు లు పంజా విసురుతున్నారు.రోజు రోజుకూ సరికొత్త పోకడలతో ముందుకెళుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. స్వీట్ వాయిస్‌తో ప్రజలను బోల్తా కొట్టించి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్‌కార్డులు ఖాళీ చేయిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. తీరా తాము మోసపోయిన తరువాత బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం సరిపడా సిబ్బంది లేకపోవడమే. గత యేడాదితో పోల్చి తే ఈ సంవత్సరం సైబర్ నేరాలు నగరంలో పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. సైబర్ స్టేషన్‌కు జవసత్వాలెప్పుడు? సైబర్ నేరాల దర్యాప్తునకు ఏర్పాటైన సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు జవసత్వాలు నింపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకు అదనపు సిబ్బంది అవసరమని తేల్చారు. ప్రస్తుతం ఉన్న 48 మందికి అదనంగా 19 మందిని కేటాయించాల్సిందిగా కోరుతూ సీపీకి ప్రతిపాదనలు పంపారు. భవిష్యత్తులో అవసరాలను మదించి ఈ సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే నేరాలు పెరుగుతున్నా సిబ్బంది సంఖ్యమాత్రం అలాగే ఉండిపోయింది. 8 ఏళ్ల క్రితం నాటి కేటాయింపులే... నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాలను దర్యాప్తు చేయడం కోసం తొలినాళ్లల్లో సీసీఎస్ ఆధీనంలో సైబర్ సెల్‌ను ఏర్పాటు చేశారు. 2010లో ప్రభుత్వం సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రాథమికంగా 40 మంది సిబ్బందిని కేటాయించారు. వీరితోనే రెండు సైబర్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించేలా... సహకరించేందుకు ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్–కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉంటారు. గడిచిన ఎనిమిదేళ్లల్లో పెరిగిన సిబ్బంది సంఖ్య కేవలం 8 మాత్రమే. సైబర్ నేరాలు నానాటికీ కొత్తపుంతలు తొక్కుతూ దర్యాప్తు అధికారులను సైతం ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఓ పక్క క్రెడిట్/డెబిట్ కార్డ్ మోసగాళ్లతో పాటు నైజీరియన్ ముఠాలు, డేటా థెఫ్ట్ తదితరాలు పెరుగుతున్నాయి. వీటికి తోడు హ్యాకింగ్‌తో పాటు ఎస్ఎమ్మెస్, ఈ–మెయిల్ మోసాల సంఖ్య పెరిగింది. ఆ సంఖ్యలో సిబ్బంది పెరగకపోవడంతో కేసుల దర్యాప్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 95 శాతం బయటి వారే... సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదవుతున్న కేసుల్లో నైజీరియన్ల పాటు ఆర్థిక సంబంధ నేరాలే ఎక్కువగా ఉంటున్నాయి. నమోదయ్యే కేసులకు దాదాపు పది రెట్లు పిటీషన్లు వస్తున్నాయి. గత ఏడాది 325 కేసులు నమోదు కాగా... ఆరు వేల పిటీషన్లు వచ్చాయి. ఈ ఏడాది మార్చి వరకు 108 కేసులు నమోదు కాగా, 3 వేల పిటిషన్లు వచ్చాయి. ఒక్కో పిటిషన్‌ను విచారించిన తర్వాత మాత్రమే కేసుగా నమోదు చేసేలా నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల్ని విచారించడం సైతం ప్రస్తుత సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఈ కేసుల్లో నిందితుల్లో అత్యధికులు బయటి రాష్ట్రాలకు చెందిన వారేనని అధికారులు తెలిపారు. వారిని గాలిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో ఇక్కడ కేసుల దర్యాప్తు ఆగిపోతోంది. ఫలితంగా కేవలం 35 శాతం కేసులనే కొలిక్కి తీసుకురాగలుగుతున్నారు. 19 మంది అత్యవసరం... సైబర్ నేరాల దర్యాప్తు నుంచి సాక్ష్యాధారాల సేకరణ, విశ్లేషణ, భద్రపరచడం వరకు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ టూల్స్ తదితరాల ఆవశ్యకత ఎంతో ఉంది. దీనికోసం గతేడాది అత్యాధునిక సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అప్పటికే అరకొరగా ఉన్న సిబ్బం దిలో కొందరిని దీనికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు అత్యవసరంగా 19 మందిని కేటాయించాల్సిందిగా కోరుతూ ప్రతిపాదనలు పం పారు. ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలతో పాటు 10 మంది కానిస్టేబుళ్లను కోరారు. ఈ నెలా ఖరు నాటికి అదనపు సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. -
బలోపేతం
471 పోస్టులు మంజూరు జాయింట్ కమిషనర్ పోస్టుకూ గ్రీన్‌సిగ్నల్ మరో రెండు ట్రాఫిక్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ స్టేషన్ రాక పోలీసులపై వత్తిడి తగ్గించేందుకే విజయవాడ : విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 2095 మందికి అనదంగా మరో 471 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. విజయవాడ రాజధానిగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి సమయం ఇక్కడే ఉంటున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు వీవీఐపీలు తరచుగా నగరానికి వస్తున్నారు. ప్రధానమైన ప్రభుత్వ శాఖలన్నీ తమ కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. నిఘా కోసం, బందోబస్తు కోసం.. ఉన్న కొద్దిపాటి సిబ్బందిని కేటాయించడం ఉన్నతాధికారులకు తలకు మించిన భారంగా మారింది. వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. నగరంలో అనేక ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. వైట్ కాలర్, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బందిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో జోన్ల పునర్వ్యవస్థీకరణ కొత్తగా వచ్చిన పోస్టుల ప్రకారం ప్రస్తుతం ఉన్న నాలుగు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లకు అదనంగా మరో రెండు స్టేషన్లు రానున్నాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్లను పునర్వ్యవస్థీకరిస్తారు. స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్‌లను బలోపేతం చేస్తారు. కొత్త పోస్టులు ఇవే ఒక అడిషనల్ కమిషనర్, ఒక జాయింట్ కమిషనర్ , ఇద్దరు డెప్యూటీ కమిషనర్లు, ఒక ఎస్పీ లేదా డెప్యూటీ కమిషనర్, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు (ఏసీపీలు), 15 మంది సీఐలు, 27 మంది ఎస్ఐలు, 12 మంది ఏఎస్ఐలు, 91 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 288 మంది పోలీసు కానిస్టేబుళ్లు ఇప్పుడు ఉన్న సిబ్బందికి అదనంగా రానున్నారు. వీరేకాకుండా ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ స్టెనో, ముగ్గురు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్లు, ఆరుగురు ఆఫీసు సబార్డినేట్లు (అటెండర్లు) రానున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బంది కొంత ఊపిరి పీల్చుకునేందుకు వీలుంటుందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి సిటీ సెక్యూరిటీ వింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ 583 మంది సిబ్బందితో ఏర్పాటు విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో 583 మంది సిబ్బందితో సిటీ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డెప్యూటీ కమిషనర్ కేడర్ అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. ఈ వింగ్‌లో ఒక డీసీపీ, ఒక ఏడీసీపీ, నలుగురు సీఐలు, 41 మంది ఎస్సైలు, 11 మంది ఏఎస్సైలు, 40 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 345 మంది కానిస్టేబుళ్లు, 79 మంది పోలీస్ డ్రైవర్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. కార్యాలయంలో విధుల కోసం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఒకరు, సూపరిటెండెంట్లు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, ఇంటెలిజెన్స్ విభాగం మేనేజర్ ఒకరు, అసిస్టెంట్ మేనేజర్లు ముగ్గురు, ఐడీ అసిస్టెంట్లు ముగ్గురు, డీటీపీ ఆపరేటర్లు ఇద్దరు, ఆఫీస్ సబార్డినేట్లు ఇద్దరు, అవుట్ సోర్సింగ్ స్వీపర్లు 10 మందిని నియమించుకోవటానికి అనుమతి ఇచ్చారు.