హుదూద్ బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన జిల్లాలను కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని ఆయన సోమవారమిక్కడ కోరారు. మంగళవారం విశాఖ వస్తున్న ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా రూ.2వేల కోట్లు ప్రకటించాలన్నారు.
తుఫాను ప్రళయంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాట్లాడామని, ఆమె కూడా ప్రధానితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కోరతారన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని రఘువీరా తెలిపారు. ప్రభుత్వ సిబ్బందికి పార్టీ శ్రేణులు పూర్తిగా సహకరిస్తాయని ఆయన అన్నారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలంతా క్షేత్రస్థాయి పర్యటనకు వెళుతున్నట్లు రఘువీరా తెలిపారు.