cylinder price
-
‘సబ్సిడీ’ గడబిడ!
సాక్షి, సిటీబ్యూరో: గృహోపయోగ వంట గ్యాస్ సబ్సిడీ సొమ్ము వ్యవహారం గడబిడగా తయారైంది. సిలిండర్ ధరలో సబ్సిడీ సొమ్ము నగదు బదిలీ కింద బ్యాంక్ ఖాతాలో జమ చేయడంలో ఒక నిర్ధిష్టమైన లెక్కంటూ లేకుండా పోయింది. ప్రతి నెల ధరల సవరణ మరింత అయోమయానికి గురిచేస్తోంది. వినియోగదారుడు మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తున్నా..సబ్సిడీ సొమ్ము నగదుగా వెనక్కి జమ అవుతుందన్న నమ్మకం లేదు. కొందరు వినియోగదారులకు బ్యాంకు ఖాతాలో మొక్కుబడిగా నగదు జమ అవుతున్నా... మరికొందరికి అసలు నగదు జమ కావడం లేదు. బ్యాంక్ ఖాతాలో జమయ్యే నగదు సిలిండర్ ధరలోని సబ్సిడీ సొమ్ముతో పొంతన లేకుండా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పేదలకు నగదు బదిలీ కింద వంట గ్యాస్ సిలిండర్ ధర ఆర్థికంగా భారంగా తయారైంది. మార్కెట్ ధరపైనే సిలిండర్ గృహోపయోగ సబ్సిడీ వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతున్న కారణంగా మార్కెట్ ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చమురు సంస్థలు సబ్సిడీ సిలిండర్ ధర మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ కింద వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోంది. ఇదీ కేవలం నగదు బదిలీ కింద అనుసంధానమైన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తోంది. చమురు సంస్థల నిబంధనల ప్రకారం సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఆ తర్వాత సరఫరా అయ్యే సిలిండర్లపై సబ్సిడీ వర్తించదు. సబ్సిడీ సొమ్ము కూడా నగదుగా బ్యాంక్ ఖాతాలో జమ కాదు. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం చుక్కలు చూపిస్తోంది. వాస్తవంగా పథకం అమలు అరంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతూ వచ్చింది.కానీ, ఇప్పుడు తిరిగి పాత పరిస్థితి పునరావృతం అవుతోంది. ధరల సవరణలతో సబ్సిడీ సొమ్ము జమ మరింత అయోమయంగా తయారైంది. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. కనెక్షన్లు ఇలా.. హైదరాబాద్ మహా నగర పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో సుమారు 28.21 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజు డిమాండ్‌ను బట్టి ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సిలిండర్ల స్టాక్ సరఫరా అవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అన్లైన్ బుకింగ్‌ను బట్టి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తుంటారు. ప్రధానంగా ఐఓసీకి సంబంధించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు, హెచ్‌పీసీఎల్‌కు సంబధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. గత 6 నెలల నుంచి క్రమంగా పెరుగుతున్న సిలిండర్ ధర.. తాజాగా రూ.58.50 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.936.50కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగుతుండటంతో వంట గ్యాస్ ధరపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజా పెంపుతో గత 6మాసాల్లోనే రూ.233.50 మేర గ్యాస్ ధర పెరిగినట్లయింది. అయితే సబ్సిడీ సిలిండర్ ధరలో మాత్రం హైదరాబాద్‌లో మార్పు లేదు. పెరిగిన ధరకు తగట్టుగా సిలిండర్‌పై సబ్సిడీ జమ కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ సిలిండర్ వినియోగదారులపై నయా పైసా కూడా అదనపు భారం లేకుండా పోయింది. అయితే సబ్సిడీ సిలిండర్‌కు నగదు బదిలీ పథకం వర్తింపు కారణంగా మొత్తం ధర ఒకేసారి చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయడం నిరుపేదలకు భారంగా తయారైంది. ప్రస్తుతం పెరిగిన నగదు తిరిగి బ్యాంకు ఖాతాలోకి వస్తుండటంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. -
వంట గ్యాస్‌పై రూ.3 పెంపు
డీలర్ల కమీషన్ పెంపు వల్ల పెరిగిన ధర న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ. 3 చొప్పున పెరిగింది. 14.2 కేజీల సిలిండర్‌పై డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్‌ను రూ. 40.71 నుంచి రూ. 43.71కు కేంద్రం గత వారం పెంచడంతో ఆ మేరకు సిలిండర్ ధరను పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23 నుంచే ధర పెంపు అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. అయితే అధికారికంగా ప్రకటించకుండానే కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా వంట గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర రూ. 414 నుంచి రూ. 417కి పెరగగా ముంబైలో రూ. 448.50 నుంచి రూ. 452కి పెరిగింది. మరోవైపు డీలర్ల కమీషన్ పెంపు వల్ల సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల కోటాను దాటి వినియోగదారులు కొనుగోలు చేసేవి) 14.2 కేజీల సిలిండర్ ధర సైతం పెరిగింది. ప్రస్తుతం రూ. 880గా ఉన్న సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 883.50కి చేరింది. కమీషన్ పెంపు వల్ల దేశవ్యాప్తంగా 13,896 మంది ఎల్పీ జీ డిస్ట్రిబ్యూటర్లకు లబ్ధి చేకూరనుంది. డీలర్ల కమీషన్‌ను చివరిసారిగా 2013 డిసెంబర్లో సిలిండర్‌కు రూ. 3.46 చొప్పున పెంచడంతో వారి కమీషన్ రూ. 40.71కి చేరింది. -
గ్యాస్ ధర, సిలిండర్లు యథాతథం
చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాట్నా: గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధరలను పెంచే యోచనేదీ లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ప్రజలకు రాయితీపై సరఫరా చేసే వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను యథాతథంగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుత రేట్లకే ఎల్పీజీని సరఫరా చేస్తామని చెప్పారు. వినియోగదారులపై అదనపు భారం మోపబోమని హామీ ఇచ్చారు. వంట గ్యాస్‌పై రాయితీ, సిలిండర్ల సంఖ్యను తమ ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుందని శుక్రవారం ఆయన పాట్నాలో విలేకరులకు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఇది పెద్ద సమస్యని, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. దేశంలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. -
‘బండ’కో దండం!
సిలిండర్ ధర పెంపుపై జనాగ్రహం పెల్లుబికింది. గ్యాస్‌బండ గుదిబండగా మారిందని మహిళలు ఆక్రోశం వెళ్లగక్కారు. ఆధార్‌తో లింకుపెట్టి నడ్డివిరిచారని కన్నెర్రచేశారు. పెంచిన ధరలే కాంగ్రెస్‌ను దహించేస్తాయని దుమ్మెత్తిపోశారు. గ్యాస్ధరను వెంటనే తగ్గించకపోతే ప్రభుత్వానికి తగినబుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సీఐటీయూ, సీపీఎం, సీఐటీయూ, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి గీత మాట్లాడుతూ..గ్యాస్‌ధర పెంపుతో సామాన్యులపై పెనుభారం పడిందన్నారు. నగదు బదిలీ పథకాన్ని రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. సిలిండర్ ధరను ఏకంగా రూ.217, కమర్షియల్ గ్యాస్‌పై రూ.385 పెంచి వినియోగదారులపై ఉక్కుపాదం మోపిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనురాధ, లక్ష్మి, మీనాక్షి, బేగం, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. షాద్‌నగర్, న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీఐటీయూ జిల్లా ఇండస్ట్రీయల్ కమిటీ ప్రధానకార్యదర్శి వర్ధం విజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ ముఖ్యకూడలిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ ధరను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై పెనుభారం మోపిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రాజు, నాగమణి, సాయిబాబా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో.. మిడ్జిల్ , న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జడ్చర్ల- కల్వకుర్తి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ నాయకు డు నిరంజన్‌గౌడ్ మాట్లాడుతూ..పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రభుత్వానికి బుద్ధితప్పదని హెచ్చరించారు. నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కాట్రపల్లి లక్ష్మయ్య, హఫీజ్, మాజీ సర్పంచ్‌లు సీతారాం పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో.. కొత్తూరు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆధార్ గుర్తింపు కార్డులు, నగదు బదిలీ పథకాలు పనికిమాలినవని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహా అన్నారు. వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపూర్ శివారులోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో అనేకసార్లు ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. వంటగ్యాస్‌పై సబ్సిడీని ఎత్తివేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నగదుబదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో.. షాద్‌నగర్, న్యూస్‌లైన్: గ్యాస్‌ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం పట్టణంలోని ముఖ్యకూడలిలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బిలి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్‌ధరలను పెంచి మరోమారు ప్రజలను మోసం చేశాయని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్, నిత్యవసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచిందని ధ్వజమెత్తారు. వంటగ్యాస్‌కు ఆధార్‌ను లింకుపెట్టి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్‌పై వచ్చే సబ్సిడీని బ్యాంకు ద్వారా వినియోగదారులకు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఏ ఒక్కరికీ అందించిన దాఖాలాలు లేవన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు పనిచేయాల్సిన ప్రభుత్వం ధరలను పెంచేందుకే పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శేఖర్ పంతులు, యారం శేఖర్‌రెడ్డి, ఖాదర్ఘోరి, ఇబ్రహీం, శర్ఫోద్దీన్, వెంకటయ్య, అనురాధ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ధరలపెంపు అసమర్థ పాలనకు నిదర్శనం మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ రవిప్రకాశ్ దుయ్యబట్టారు. గ్యాస్‌ధర పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు మహిళలు కట్టెలపొయ్యిపై వంటలు చేసి ఆగ్రహాం వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ధరను పెంచితే ఆ భారాన్ని ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. పెరిగిన ధరలు సామాన్యులను కష్టాలకు గురిచేస్తున్నాయన్నారు. ధరలను తగ్గించకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నేతలు సనా, తిరుపతి నాయక్, జోగులు, సతీష్‌గౌడ్, నాగరాజు, సురేష్, శ్రీకాంత్‌రెడ్డి, ఇందిర, ప్రసాద్, అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ మంటలు
‘మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు’ అన్న చందంగా మారింది గ్యాస్ వినియోగదారుల పరిస్థితి. అసలే సిలిండర్ ధర పెరిగి అవస్థలు పడుతుంటే ఇది చాలదన్నట్లు చమురు కంపెనీలు సిలిండర్ ధర మరోసారి పెంచేశాయి. ఆధార్ అనుసంధానం చేసుకున్న వినియోగదారుడికి ఈ పెరిగే మొత్తం సబ్సిడీగా బ్యాంకు ఖాతాలో జమ కానుండగా, అనుసంధానం చేసుకోనివారిపై మాత్రం భారం పడనుంది. ఆధార్ విషయంలో సుప్రీం తీర్పును సైతం గ్యాస్ కంపెనీలు లెక్కచేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. సాక్షి, కడప: జనవరి ఫస్టు కానుకగా ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధర పెంచి సామాన్యుల నడ్డివిరిచాయి. దీనికితోడు రకరకాల నిబంధనలతో వినియోగదారులకు కష్టాలు తప్పేలాలేవు. ఎడాపెడా ధర పెంచడంతోపాటు ఆధార్ అనుసంధానం తప్పని సరి అని ఆయిల్ కంపెనీలు చెబుతుండటంతో వినియోగదారులు హడలి పోతున్నారు. ఆధార్ అను సంధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినా, ఆయిల్ కంపెనీలు పట్టువీడటంలేదు. జనవరి 31తేదీ లోపల అనుసంధానం చేసుకోకపోతే రూ.1347 చెల్లించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో నెలలోపు ఆధార్‌తో ఆయిల్ కంపెనీలు, బ్యాంకుల అనుసంధానం పూర్తవుతుందా అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1112నుంచి రూ.1347కు అంటే ఏకంగా రూ.215లకు పెంచడంపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. సబ్సిడీ మొత్తాన్ని సైతం రూ.643 నుంచి 843కు పెంచారు. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను సైతం రూ.1660నుంచి రూ.2013 కు పెంచడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తొమ్మిది సిలిండర్లకు మించి వాడే వినియోగదారుల పరిస్థితి మరీ దారుణంగా తయారు కానుంది. ఆధార్ అనుసంధానం అంతంత మాత్రమే జిల్లాలో గ్యాస్‌కు ఆధార్ కార్డు అనుసంధానం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆధార్ నమోదు కేవలం 66శాతం మాత్రమే ఉంది. దీంతో పాటు బ్యాంకుతో అనుసంధానం మరీ అధ్వానంగా అంటే 43 శాతం లోపల ఉండటం గమనార్హం. తొలుత సెప్టెంబరు వరకు గడువు ఇచ్చిన ఆయిల్ కంపెనీలు, ఆ గడువు కాస్తా డిసెంబరు 31వతేదీకి పొడిగించారు. సుప్రీం, హైకోర్టులు సైతం గ్యాస్‌కు ఆధార్ అనుసంధానంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో చాలా మంది వినియోగదారులు గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. జనవరి 31వతేదీ లోపు తప్పని సరిగా ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిందేనని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తుండటంతో జిల్లాలో ఈ ప్రక్రియ నెలలోపు పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.