సిలిండర్ ధర పెంపుపై జనాగ్రహం పెల్లుబికింది. గ్యాస్‌బండ గుదిబండగా మారిందని మహిళలు ఆక్రోశం వెళ్లగక్కారు. ఆధార్‌తో లింకుపెట్టి నడ్డివిరిచారని కన్నెర్రచేశారు. పెంచిన ధరలే కాంగ్రెస్‌ను దహించేస్తాయని దుమ్మెత్తిపోశారు. గ్యాస్‌ధరను వెంటనే తగ్గించకపోతే ప్రభుత్వానికి తగినబుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సీఐటీయూ, సీపీఎం, సీఐటీయూ, టీడీపీ, బీజేపీ, వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి గీత మాట్లాడుతూ..గ్యాస్‌ధర పెంపుతో సామాన్యులపై పెనుభారం పడిందన్నారు. నగదు బదిలీ పథకాన్ని రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. సిలిండర్ ధరను ఏకంగా రూ.217, కమర్షియల్ గ్యాస్‌పై రూ.385 పెంచి వినియోగదారులపై ఉక్కుపాదం మోపిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనురాధ, లక్ష్మి, మీనాక్షి, బేగం, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో..
షాద్‌నగర్, న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీఐటీయూ జిల్లా ఇండస్ట్రీయల్ కమిటీ ప్రధానకార్యదర్శి వర్ధం విజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ ముఖ్యకూడలిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ ధరను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై పెనుభారం మోపిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రాజు, నాగమణి, సాయిబాబా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో..
మిడ్జిల్ , న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జడ్చర్ల- కల్వకుర్తి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ నాయకు డు నిరంజన్‌గౌడ్ మాట్లాడుతూ..పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రభుత్వానికి బుద్ధితప్పదని హెచ్చరించారు. నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కాట్రపల్లి లక్ష్మయ్య, హఫీజ్, మాజీ సర్పంచ్‌లు సీతారాం పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో..
కొత్తూరు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆధార్ గుర్తింపు కార్డులు, నగదు బదిలీ పథకాలు పనికిమాలినవని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహా అన్నారు. వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపూర్ శివారులోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో అనేకసార్లు ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. వంటగ్యాస్‌పై సబ్సిడీని ఎత్తివేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నగదుబదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో..
షాద్‌నగర్, న్యూస్‌లైన్: గ్యాస్‌ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం పట్టణంలోని ముఖ్యకూడలిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బిలి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్‌ధరలను పెంచి మరోమారు ప్రజలను మోసం చేశాయని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్, నిత్యవసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచిందని ధ్వజమెత్తారు.
వంటగ్యాస్‌కు ఆధార్‌ను లింకుపెట్టి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్‌పై వచ్చే సబ్సిడీని బ్యాంకు ద్వారా వినియోగదారులకు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఏ ఒక్కరికీ అందించిన దాఖాలాలు లేవన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు పనిచేయాల్సిన ప్రభుత్వం ధరలను పెంచేందుకే పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శేఖర్ పంతులు, యారం శేఖర్‌రెడ్డి, ఖాదర్‌ఘోరి, ఇబ్రహీం, శర్ఫోద్దీన్, వెంకటయ్య, అనురాధ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
ధరలపెంపు అసమర్థ పాలనకు నిదర్శనం
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ రవిప్రకాశ్ దుయ్యబట్టారు.
గ్యాస్‌ధర పెంపునకు నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు మహిళలు కట్టెలపొయ్యిపై వంటలు చేసి ఆగ్రహాం వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ధరను పెంచితే ఆ భారాన్ని ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. పెరిగిన ధరలు సామాన్యులను కష్టాలకు గురిచేస్తున్నాయన్నారు. ధరలను తగ్గించకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నేతలు సనా, తిరుపతి నాయక్, జోగులు, సతీష్‌గౌడ్, నాగరాజు, సురేష్, శ్రీకాంత్‌రెడ్డి, ఇందిర, ప్రసాద్, అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
‘బండ’కో దండం!
Published Sat, Jan 4 2014 3:11 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement
Advertisement