వంట గ్యాస్‌పై రూ.3 పెంపు
డీలర్ల కమీషన్ పెంపు వల్ల పెరిగిన ధర
న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ. 3 చొప్పున పెరిగింది. 14.2 కేజీల సిలిండర్‌పై డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్‌ను రూ. 40.71 నుంచి రూ. 43.71కు కేంద్రం గత వారం పెంచడంతో ఆ మేరకు సిలిండర్ ధరను పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23 నుంచే ధర పెంపు అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. అయితే అధికారికంగా ప్రకటించకుండానే కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా వంట గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం గమనార్హం.
తాజా పెంపుతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర రూ. 414 నుంచి రూ. 417కి పెరగగా ముంబైలో రూ. 448.50 నుంచి రూ. 452కి పెరిగింది. మరోవైపు డీలర్ల కమీషన్ పెంపు వల్ల సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల కోటాను దాటి వినియోగదారులు కొనుగోలు చేసేవి) 14.2 కేజీల సిలిండర్ ధర సైతం పెరిగింది. ప్రస్తుతం రూ. 880గా ఉన్న సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 883.50కి చేరింది. కమీషన్ పెంపు వల్ల దేశవ్యాప్తంగా 13,896 మంది ఎల్పీ జీ డిస్ట్రిబ్యూటర్లకు లబ్ధి చేకూరనుంది. డీలర్ల కమీషన్‌ను చివరిసారిగా 2013 డిసెంబర్‌లో సిలిండర్‌కు రూ. 3.46 చొప్పున పెంచడంతో వారి కమీషన్ రూ. 40.71కి చేరింది.