మళ్లీ విస్త‘రణం’
నేడు మంత్రి వర్గ విస్తరణ
డీకే, రోషన్‌కు చోటు..
రమేశ్ కుమార్‌కూ ఛాన్స్!
లోక్ సభ ఎన్నికల తర్వాత మిగిలినవీ భర్తీ
అప్పుడే మొదలైన అసమ్మతి
సీనియర్లలో అసంత ృప్తి
బహిరంగంగానే విమర్శలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని బుధవారం స్వల్పంగా విస్తరించనున్నారు. మాజీ మంత్రులు డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లకు చోటు కల్పించనున్నారు. మిగిలిన మూడు ఖాళీలను లోక్‌సభ ఎన్నికలకు ముందు భర్తీ చేయాలని అధిష్టానం సీఎంకు సూచించినట్లు సమాచారం. ఆరు నెలల కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ‘కళంకితులు’ అనే నెపంతో ముఖ్యమంత్రి వీరికి చోటు కల్పించ లేదు. శివ కుమార్‌పై అక్రమ మైనింగ్ ఆరోపణలుండగా, రోషన్ బేగ్ కోట్ల రూపాయలు స్టాంపు పేపర్ల కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఆరోపణల వల్లే ఆయన ఎస్ఎం. కృష్ణ మంత్రి వర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిద్దరికీ పదవులు దక్కకుండా చేయడానికి వారి ప్రత్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి సైతం వీరి పట్ల విముఖతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఎట్టకేలకు అధిష్టానం మనసును మార్చడంలో వీరిద్దరూ సఫలీకృతులయ్యారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వీరిద్దరు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
గవర్నర్‌తో సీఎం భేటీ
మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజ్ భవన్లో గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్‌ను మధ్యాహ్నం కలుసుకున్నారు. విస్తరణ గురించి ఆయనకు సమాచారం ఇచ్చారు. అంతకు ముందు విలేకరులు సీఎంను మంత్రి వర్గ విస్తరణ గురించి అడిగినప్పుడు స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ‘దీనిపై రేపు చెబుతా, ఇప్పుడేం మాట్లాడను’ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.
రమేశ్ కుమార్‌కూ ఛాన్స్!
మంత్రి వర్గంలో కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్‌కు కూడా అవకాశం లభించే అవకాశాలున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుత స్పీకర్ కాగోడు తిమ్మప్పను మంత్రి వర్గంలోకి తీసుకుని, రమేశ్ కుమార్‌కు ఆ పదవిని కట్టబెట్టవచ్చని తెలుస్తోంది.
శివకుమార్‌కు పితృవియోగం
డీకే. శివ కుమార్ తండ్రి కెంపే గౌడ (85) మంగళవారం ఉదయం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. నెల రోజులుగా ఆయన వివిధ అవయవాల వైఫ్యల్యంతో బాధ పడుతున్నారు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలను నిర్వహించారు.
అప్పుడే అసమ్మతి
మంత్రి విస్తరణ జరిగే అవకాశాలున్నాయని తెలియడంతో కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది సీనియర్లు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి తనకు అవకాశం కల్పించాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు. బెంగళూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరు సార్లు తాను శాసన సభకు ఎనికయ్యానని, మంత్రి పదవినిస్తే ఎలాంటి సదుపాయాలు పొందకనే ప్రజా సేవ చేస్తానని తెలిపారు. తనకు సంఘ సంస్థలు, వ్యాపారాలు లేవంటూ, కేవలం రాజకీయాల్లో మాత్రమే ఉన్నానని చెప్పారు. రాణి బెన్నూరు శాసన సభ్యుడు కేబీ. కోళివాడ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభించని అనేక జిల్లాలను విస్మరించి, కేవలం ఇద్దరిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.