బాధితులకు ‘డబుల్’ ఇళ్లు
► మంత్రి జోగు రామన్న
► అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ
జైనథ్(ఆదిలాబాద్): మండలంలోని మాండగాడ గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న హామీనిచ్చారు. సోమవారం ఆయన రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, ఆస్తి నష్టంపై ఆరా తీశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు బట్టలు, వంటపాత్రలు, స్టవ్‌లు, 50 కిలోల బియ్యం, పప్పు, నిత్యావసర వస్తువులు అందజేశారు.
మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ ప్రమాదం గురించి తనతో చర్చించారని, ప్రభుత్వం అన్ని రకాలు ఆదుకుంటుందని భరోసా కల్పించారని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా షెడ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసి ఈ వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో సూర్యనారాయణను ఆదేశించారు. నాయకులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి, తల్లెల చంద్రయ్య, పెందూర్ దేవన్న, సర్సన్ లింగారెడ్డి, బండారి సతీష్, రోకండ్ల సురేష్‌రావ్, ఆత్రం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతల పరామర్శ
అగ్ని ప్రమాద బాధితులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, నాయకులు సోమవారం పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, రూ.వంటపాత్రలు, పప్పు, నిత్యావసర వ స్తువులు అందజేశారు. ప్రభుత్వం పరిహారంగా రూ.8 వేలు మాత్రమే అందించడం సరికాదని అన్నారు. పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని సతీష్రావ్, నాయకులు జగదీష్‌రెడ్డి, పోతరెడ్డి, సంతోష్‌రావు, వినోద్, పొచ్చన్న పాల్గొన్నారు.