‘మనవాడు ఎంత ఎదిగాడో!’
రాజవొమ్మంగి : రాజవొమ్మంగికి చెందిన సిద్ధార్థవర్మ టాలీవుడ్ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. స్థానిక పాఠశాలలో పదో తరగతి వరకూ చదువుకున్న అతడు ఇక్కడి వారందరికీ విద్యార్థిగానే పరిచయం. వచ్చే నెల ఒకటో తేదీన విడుదల కానున్న ‘దాగుడుమూత దండాకోర్’ సినిమాలో ప్రముఖ హీరో, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌తో కలిసి.. సిద్ధార్థ నటించాడన్న వార్తలతో ‘మనవాడు ఎంత ఎదిగాడో!’ అంటూ స్థానికులు సంబరపడుతున్నారు. రాజవొమ్మంగిలో చిన్న వ్యాపారం చేసుకొంటూ జీవించే అడ్డూరి కుమార్‌రాజా, సత్య దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థవర్మ. ప్రస్తుతం భీమవరం డీఎన్ఆర్ కళాశాలలో ఎంసీఏ ఫైనలియర్ చదువుతున్నారు.
స్వగ్రామం రాజవొమ్మంగికి సోమవారం వచ్చిన అతడు సినిమా కెరీర్ గురించి ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘సినిమా నటుల ఎంపికకు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి 2012 ఆగస్ట్ 17న విజయనగరం వెళ్లాను. నిర్మాత ప్రతాప్ కోలగడ్ల అప్పటినుంచీ నన్ను ప్రోత్సహిస్తున్నారు’ అని చెప్పారు. మొదటి సినిమా ‘3జీ లవ్’ తనకు మంచి పేరు తెచ్చిందని, రెండో సినిమా ‘నేను నా ఫ్రండ్స్’ అనుభవాన్ని పెంచిందని తెలిపారు. ప్రస్తుతం విడుదల కానున్న ‘దాగుడుమూత దండాకోర్’ సినిమాలో రాజేంద్రప్రసాద్‌కు మనుమడిగా నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సినిమాలో నిత్యాశెట్టి తన సరసన మరదలుగా నటిస్తోందని చెప్పారు. సిద్ధార్థ త్వరలో మరో రెండు సినిమాల్లో నటించబోతున్నారు.