Daiichi Sankyo
-
చెరో 1,170 కోట్లు కట్టండి!
న్యూఢిల్లీ: దైచీ కేసులో ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు (సింగ్ సోదరులు) కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోని తమ నియంత్రిత షేర్లను మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు విక్రయించడం కోర్టు ధిక్కార అంశంగానే పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తప్పును సరిదిద్దుకునే క్రమంలో సింగ్ సోదరులు ఇరువురు రూ.1,170.95 కోట్ల చొప్పున మొత్తం రూ.2,341.90 కోట్లను సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. డిపాజిట్ తర్వాతే కోర్టు ధిక్కారానికి సంబంధించిన శిక్ష విషయంలో ‘కొంత వెసులుబాటు’ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. ‘‘కేసుకు సంబంధించి ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సింగ్ సోదరులు తెలిసీ, ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. కనుక వీరు ఇరువురూ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగానే ఈ కోర్టు భావిస్తోంది’’ అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మొత్తంమీద తాజా రూలింగ్ ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు పూర్వాపరాలు... ► సింగ్ సోదరులు 2008లో ర్యాన్‌బాక్సీని జపాన్ సంస్థ దైచీ శాంక్యోకి విక్రయించారు. తర్వాత ఈ కంపెనీని దైచీ నుంచి భారత్‌కే చెందిన సన్‌ఫార్మా 3.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ► అయితే ర్యాన్ బాక్సీ అమ్మకం వ్యవహారానికి సంబంధించి సింగ్ సోదరులపై దైచీ సింగపూర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో పలు రెగ్యులేటరీ సమస్యలను ర్యాన్‌బాక్సీ ఎదుర్కొంటోందని, అయితే విక్రయ ఒప్పందాల సమయంలో ఈ అంశాలను సింగ్ సోదరులు వెల్లడించలేదన్నది దైచీ ఆరోపణల్లో ప్రధానమైనది. ఈ కేసులో 2016లో రూ. 2,562 కోట్ల పరిహారాన్ని (అవార్డు) ట్రిబ్యునల్ నుంచి పొందింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సింగ్ సోదరులు భారత్, సింగ్‌పూర్ కోర్టుల్లో సవాలు చేసినా ఫలితం దక్కలేదు. ఢిల్లీ హైకోర్టులో సింగ్ సోదరులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంతర్జాతీయ ఆర్బిట్రల్ అవార్డును హైకోర్టు సమర్థించింది. ► దీనితో ఆయా అంశాలపై సింగ్ సోదరులు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఇక్కడ కూడా వారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 16న వారి అప్పీల్‌ను సుప్రీం తోసిపుచ్చింది. ఫోర్టిస్‌లో తమకు ఉన్న వాటాలను విక్రయించరాదని సుప్రీంకోర్టు సింగ్ సోదరులను ఆదేశించింది. ► అయితే ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ, ఫోర్టిస్‌లో వాటాలను సింగ్ సోదరు లు మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు అమ్మేశారు. ► ఈ విషయాన్ని దైచీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీనితో గత ఏడాది డిసెంబర్ 14న ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ ఒప్పం దంపై సుప్రీంకోర్టు ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ► మార్చిలో దైచీ సుప్రీంకోర్టులో సింగ్ సోదరులపై కోర్టు ధిక్కరణ కేసును కూడా దాఖలు చేసింది. ► ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు ‘ధిక్కరణ’ విచారణను చేపట్టింది. ఫోర్టిస్‌కు సంబంధించి ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఓపెన్ ఆఫర్‌పై ఇచ్చిన స్టేను తొలగించడానికి నిరాకరించింది. ఈ ఓపెన్ ఆఫర్‌పై విచరణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
సింగ్ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్ సింగ్, శివీందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు మరోసారి భారీ షాక్ ఇచ్చింది. జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంకో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను సమర్ధించింది. ఈ విషయంలో ఇప్పటికే సోదరులిద్దరికీ చివాట్లు పెట్టిన అత్యున్నత ధర్మాసనం తాజాగా సీరియస్‌గా స్పందించింది. సింగ్ సోదరులు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ ఒక్కొక్కరూ రూ. 1175 కోట్ల రూపాయలు జమ చేయాలని ఆదేశించింది. అలాగే ఫోర్టిస్ ఐహెచ్‌హెచ్ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమోటో ధిక్కారాన్ని ప్రారంభించింది. తదుపరి విచారణలో ఓపెన్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా 2008లో రాన్‌బాక్సీని దైచీ కొనుగోలు చేసింది. అయితే కంపెనీపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపడుతోందన్న నిజాన్ని దాచిపెట్టి రాన్‌బాక్సీ షేర్లను సింగ్ సోదరులు విక్రయించారంటూ దైచీ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ అనంతరం సింగ్ సోదరులు దైచీ సంస్థకు రూ .3500 కోట్ల చెల్లించాలని 2016లో ఆదేశించింది. అయితే ఆమొత్తాన్ని చెల్లించక పోవడంతో దైచీ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం సింగ్ సోదరులు దైచీకి డబ్బులు చెల్లించాల్సిందేనని 2019 మార్చి 14న స్పష్టం చేసింది. అనంతరం సింగ్ బ్రదర్స్ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం..కోర్టు దిక్కరణకు పాల్పడినట్లయితే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తూ, 2019, ఏప్రిల్‌లో తీర్పును రిజర్వులో ఉంచింది. ఇది ఇలా వుంటే వేలకోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలతో గత నెలలో సింగ్ బ్రదర్స్‌ను ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
దైచీ ఆర్బిట్రేషన్‌లో కొత్త మలుపు!
న్యూఢిల్లీ: జపాన్ ఫార్మా దిగ్గజం– దైచీ శాంక్యో గెలిచిన రూ.3,500 కోట్ల ఆర్బ్రిట్రేషన్ కేసు అమలు దిశలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్ ఒకప్పటి ప్రమోటర్లు– మల్వీందర్ సింగ్, శివేందర్ సింగ్‌లకు చెందిన రెండు హోల్డింగ్ కంపెనీలు– ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్, ఆస్కార్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన ఆస్తుల్ని జప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జయంత్ నాథ్ వారెంట్లు జారీ చేశారు. తనఖాలో లేని ఆస్తుల జాబితాను 10 రోజుల్లో అందజేయాలని– సోదరులు మల్విందర్ సింగ్, శివేందర్ సింగ్‌లతో పాటు మరో 10 మందికి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కేసు తదపరి విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకూ వేతనాలు, చెల్లించాల్సిన బకాయిలకు మినహా మిగిలిన కార్యకలాపాలు దేనికీ ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్ తన బ్యాంక్ ఖాతాలోని సొమ్మును వినియోగించరాదని సైతం ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. సింగ్ సోదరులు, ఈ కేసుకు సంబంధం ఉన్నవారు తమ స్థిర, చర ఆస్తులను అమ్మడం కానీ, బదలాయించడం కానీ చేయరాదని ఇంతక్రితమే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. -
సింగ్ బ్రదర్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఔషధ సంస్థ దైచీ శాంక్యో , సింగ్ బ్రదర్స్ వివాదంలో సింగ్ బ్రదర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో 3500 కోట్ల రూపాయల దావాను దైచీ శాంక్యో గెలిచింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు సింగపూర్ ఆర్బిట్రేషన్ తీర్పును సమర్ధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. జపనీస్ దిగ్గజం దైచీ శాంక్యో దాఖలు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేసులో రాన్‌బాక్సీ మాజీ అధిపతులు సింగ్ బ్రదర్స్‌నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ తీర్పును అమలు చేయాలంటూ మే, 2016 లో ఢిల్లీ హైకోర్టును దైచీ ఆశ్రయించింది. అయితే, ఈ అవార్డును అమలు చేయడానికి భారత మధ్యవర్తిత్వ చట్టం ప్రకారం సబ్‌స్టాంటివ్ అభ్యంతరాలున్నాయంటూ సింగ్ బ్రదర్స్ దీన్ని సవాల్ చేశారు. దీనిపై కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ఔషధ సంస్థ దైచీ శాంక్యో నుంచి వాస్తవాలు దాచి, తప్పుడు నివేదికలు అందించిన కేసులో అప్పటి ర్యాన్‌బ్యాక్సీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ భారీ నష్టపరిహార కేసును ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో దైచీ శాంక్యో 2013లో సింగపూర్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించగా రూ .2,562 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2016లో కోర్టు ఆదేశించింది. వడ్డీతో సహా మొత్తం ఇది రూ .3,500 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. -
టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను తొలగించిన సన్‌ఫార్మా
ముంబై: ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా.. 18మంది టాప్ ర్యాంక్ ఉద్యోగులపై వేటు వేసింది. సీఈవో, ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులను రాజీనామా చేయాల్సిందిగా కోరింది. సీఈవోగా ఉన్న ఇంద్రజిత్ బెనర్జీ, యూగుల్ సిగ్రితో పాటు, మరో 18 మందిని కంపెనీని వీడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అందుకుగాను వీరికి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నత హోదాలో ఉన్న ఉద్యోగుల తొలగింపుపై సన్ ఫార్మా వివరణ ఇచ్చుకుంది. 'వారిని కొనసాగించేందుకు, వారి ప్రతిభా పాటవాలను పూర్తిగా వినియోగించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాం, కానీ విఫలమయ్యాం. చాలా పారదర్శకంగా, సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేశామని' సన్‌ఫార్మా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్ని నెలలుగా నష్టాల్లో ఉన్న కంపెనీ గట్టెక్కించేందుకే సన్‌ఫార్మా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రెండు పెద్ద కంపెనీల విలీనం తర్వాత మొదటి సారి కంపెనీ కష్టాలను ఎదుర్కొంటోందని వారు పేర్కొంటున్నారు. కాగా గతంలో ర్యాన్బ్యాక్సీతో జత కట్టి కష్టాల్లో పడ్డ జపాన్‌కు చెందిన దైచీ శాంక్యో కంపెనినీ 2014 ఏప్రిల్‌లో సన్ ఫార్మా టేకోవర్ చేసింది. అలాగే 2016 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టనున్నాయనే అంచనాల నేపథ్యంలో, కష్టాల నుంచి గట్టెక్కడం కోసం కంపెనీ మల్లగుల్లాలు పడుతోంది.