రసవత్తరంగా రాష్ట్రస్థాయి పాల పోటీలు
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : పాల పోటీలు రెండో రోజు ఆసక్తికరంగా సాగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముర్రా జాతి గేదెలు, ఒంగోలు, సంకర జాతి ఆవులు మధ్య విభాగాల్లో పోటీలు శనివారం జరిగాయి. ముర్రా జాతి విభాగంలో 14 గేదెలు, ఒంగోలు జాతి విభాగంలో 12 ఆవులు, సంకర జాతి విభాగంలో నాలుగు ఆవులు పోటీలకు అర్హతగా సాధించి, తుదిపోరులో తలపడుతున్నాయి.
పోటీల్లో పాల్గొంటున్న పశువుల నుంచి శనివారం ఉదయం, సాయంత్రం పశు సంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణలో పాలు తీశారు. ఆదివారం ఉదయం మూడో విడత పాల సేకరణ జరిగిన తర్వాత సగటు పాల ఉత్పత్తిని నిర్ధారించి విజేతను ప్రకటించనున్నారు. ముర్రాజాతి గేదెల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట (నెంబరు.9), బాపులపాడు మండలం వీరవల్లి(నెంబరు.2)కి చెందిన పశువుల మధ్య పోటీ నెలకొంది. శనివారం నాటి పోటీల్లో రెండు గేదెలు సుమారు 22 లీటర్ల పాలను ఇచ్చాయి.
దీంతో ఆదివారం వీటి మధ్య పోటీ ఉంటుంది. సంకర జాతి విభాగంలో నాలుగో నంబరుతో బరిలోకి దిగిన ఆవు పోటీలో ముందుకు దూసుకువెళ్లుతోంది. ఆదివారం జరిగే బహుమతి ప్రదానోత్సవానికి ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో కొండలరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పశు సంవర్ధక శాఖ జేడీ దామోదర నాయుడు, ఏడీ దివాకర్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్ధ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.