25 రైతు కుటుంబాలకు పాడి ఆవులు
పెరంబూర్: నృత్యదర్శకుడు, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ ఎందరో అనాథ బాలలను ఆదుకుంటూ వారికి విద్య, వైద్య సాయం చేస్తున్న విషయం తెలిసిందే. తన ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లారెన్స్ తాజాగా కరువు కాటకాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకోవడానికి నడుం బిగించారు.
అందులో భాగంగా తొలి దశగా ఈరోడ్డులో 25 రైతు కుటుంబాలకు తలా రెండు పాడి ఆవులు చొప్పున ఉచితంగా అందించడంతో ఆర్థిక సాయాన్ని అందించారు.ఈరోడ్డు రైతుల సంఘం అధ్యక్షుడు కాశీయప్పన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న లారెన్స్ పాడి ఆవులను అందించారు.
ఆయన మాట్లాడుతూ తనకు ప్రత్యక్ష దైవం తన తల్లేనన్నారు.ఆ తరువాత తన అభిమానులు, రైతులను దైవంగా భావిస్తానన్నారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల పరిస్థితి తనను కలచివేసిందన్నారు. మరణించిన రైతు కుటుంబానికి రూ.3 లక్షలు అందించానని తెలిపారు.ఈ డబ్బు తనకు అభిమానులు ఇచ్చిందేనన్నారు.దాన్ని రైతు కుటుంబాలకు సాయం చేయాలని భావించానన్నారు.
నాకు రాజకీయాలు తెలియవు
తనకు రాజకీయాలు తెలియవని, అందువల్ల తెలియని విషయానికి వెళ్లనని అన్నారు.అయితే తనకు ధర్మం చేయడం తెలుసన్నారు.రైతులు వ్యవసాయం కోసం భార్యాల పుస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీర్చలేక సతమతమవుతున్నారన్నారు.వారిని ఆదుకునే విధంగా మొదటి దశగా ఇద్దరు భ్యాంకు రుణాలను తీర్చానని వారి తాళి పుస్తులను విడిపించానని తెలిపారు.తాను నటించిన మొట్టశివ కెట్టశివ చిత్ర పారితోషికం కోటి రూపాయలను యువకులకు సాయపడేలా ఆనంద వికటన్ ట్రస్ట్ ద్వారా అందించానని, తదుపరి విడుదల కానున్న శివలింగ చిత్రానికి వచ్చిన పారితోషికాన్ని తానే నేరుగా రైతులకు సాయం చేస్తానని తెలిపారు.తాను నాయకుడవ్వాలని కోరుకోవడం లేదని, అలా అయితే గర్వం తలకెక్కుతుందని, అందువల్ల కార్యకర్తగానే ఉండి స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తానని అన్నారు.
తమిళులకు సూపర్‌స్టార్ ఒక్కరే
తనను స్టంట్ మాస్టర్ సూపర్స్బురాజయన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ సినీరంగానికి తీసుకొచ్చారని తెలిపారు. తమిళులు నివశించే అన్ని ప్రాంతాల్లోనూ సూపర్‌స్టార్ ఒక్కరే అని, అది రజనీకాంత్ మాత్రమేనని లారెన్స్ పేర్కొన్నారు.