Dairy Farm Culture
-
దేశంలో వైట్ రివల్యూషన్.. రూ. 1.60 లక్షల కోట్లు
ముంబై: భారత్‌లో వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ మార్చితో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 12 శాతం పురోగమించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక పేర్కొంది. విలువలో ఇది రూ.1.6 లక్షల కోట్లని విశ్లేషించింది. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) డిమాండ్ రికవరీ కావడం, లిక్విడ్ పాల అమ్మకాలు స్థిరంగా ఉండడం, రిటైల్ ధరలో పెరుగుదల వంటి అంశాలు శ్వేత విప్లవ పురోగతికి కారణమని పేర్కొంది. నివేదిక ముఖ్యాంశాలను పరిశీలిస్తే... - కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పదేళ్ల కనిష్టం.. ఒక శాతం పడిపోయిన భారత వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ ఆదాయాలు 2021–22లో మహమ్మారి ముందస్తు స్థాయికి క్రమంగా పరిశ్రమ కోలుకుంటున్నాయి. - వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) విభాగం వ్యవస్థీకృత రంగ విక్రయాలలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది. దీనితోపాటు ఈ రంగంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఉన్న లిక్విడ్ పాల విభాగానికి స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది. ఈ విభాగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (మహమ్మారి ముందు ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా) 5–6 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. - నిర్వహణ లాభదాయకత 2020– 2021 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం ఉంది. వచ్చే రెండు రెండు ఆర్థిక సంవత్సరాలలో 5–5.5 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. డెయిరీలు ఈ ఏడాది కేటగిరీల వారీగా రిటైల్ ఉత్పత్తుల ధరలను 3–4 శాతం పెంచడం, అధిక ముడి పాల ధరలు దీనికి కారణం. రవాణా, ప్యాకేజింగ్ వ్యయాలు పెరిగినప్పటికీ నిర్వాహణా లాభాలకు విఘాతం ఏర్పడదు. - మెరుగైన రాబడులు, వృద్ధి, స్థిరమైన నిర్వహణ లాభాలు, పటిష్ట బ్యాలెన్స్ షీట్ల వంటి అంశాలు డెయిరీ పరిశ్రమలకు ’స్థిరమైన’ క్రెడిట్ ఔట్లుక్ హోదా కల్పించే అవకాశం ఉంది. - నెయ్యి, వెన్న, జున్ను, పెరుగు వంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) కోసం డిమాండ్ భారీగా పెరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) పండుగలు, వివాహాల సీజన్, దేశ వ్యాప్తంగా వాణిజ్య సంస్థలు తిరిగి ప్రారంభమవడం వంటి అంశాలు ఈ విభాగాల్లో బలమైన పునరుద్ధరణకు కారణం. - వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) అమ్మకాల్లో 17 నుంచి 18 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. కరోనా ఆంక్షల అనంతరం హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు (వ్యవస్థీకృత రంగాల విక్రయాలలో 20 శాతం వాటా) తిరిగి తెరుచుకోవడం, పండుగలు, వివాహ వేడుకలు, ఉపాధి కల్పన మెరుగుపడ్డం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. - కోవిడ్–19 రెండవ, మూడవ వేవ్‌ల ప్రభావం డెయిరీ పరిశ్రమపై ఎటువంటి భౌతిక ప్రభావం చూపలేదు. ఆంక్షలు స్థానిక స్థాయికి పరిమితం కావడం, ప్రత్యక్ష ఫుడ్–డెలివరీ సేవలు, తినుబండారాలు పని చేస్తూనే ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. - 57 రేటెడ్ డెయిరీల క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. వ్యవస్థీకృత సెగ్మెంట్ ద్వారా వస్తున్న రూ. లక్ష కోట్ల ఆదాయంలో ఈ 57 రేటెడ్ డెయిరీల వాటా దాదాపు 60 శాతం. చదవండి:భారీగా పామాయిల్ సాగు -
మహిళలకు మరింత ఆర్థిక అండ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో లబ్ధిదారులైన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే చేయూత, ఆసరా మహిళలకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం ఆ మహిళల చేత పాడి పశువుల పెంపక కేంద్రాలను (డెయిరీలు) ఏర్పాటు చేయించి పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో పాటు వారికి పాల వ్యాపారం ద్వారా మంచి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం 3.43 లక్షల గేదెలను, 2.20 లక్షల ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తొలి ఏడాది 40 వేల ఆవులను, 55 వేల గేదెలను కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. రెండో ఏడాది మరో 1.80 లక్షల ఆవులను, 2.88 లక్షల గేదెలను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా 2.97 లక్షల మేకలు, గొర్రెలను కూడా సంబంధిత మహిళలకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రచించారు. మహిళలకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయానికి తోడు బ్యాంకుల ద్వారా మరిన్ని నిధులను మంజూరు చేయించి వారి జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఇప్పటికే అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. మేలు జాతి పశువుల ఎంపికకు ఆదేశం లబ్ధిదారులు ఆవు, గేదె ఏది తీసుకున్నా మేలు జాతి రకాలు ఉండేలా చూడాలని, ఇందుకోసం నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రాకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు మహిళా పాడి రైతుల నుంచి ప్రభుత్వ డెయిరీ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే పాల సేకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.514.40 కోట్ల వ్యయంతో 7,529 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఈ యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టి వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేసేలా ఆదేశాలు వెలువడ్డాయి. 75 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా.. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 412.1 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నట్టు అంచనా. 9,889 గ్రామాల్లో పాల ఉత్పత్తి బాగా అవుతుండగా.. వాటిలో 7,529 గ్రామాల్లో పాల ఉత్పత్తి మరింత అధికంగా ఉంది. ఈ గ్రామాల్లో పాల సేకరణకు వీలుగా రైతు భరోసా కేంద్రాల వద్ద అదనంగా గదులు నిర్మిస్తారు. తద్వారా రోజూ 75 లక్షల లీటర్ల పాలను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 7,529 గ్రామాల్లో వెయ్యి నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. -
దూడలపై శ్రద్ధే అభివృద్ధికి సోపానం
పాడి పరిశ్రమ రైతుకు లాభదాయకంగా ఉండాలంటే శాస్త్రీయ పద్ధతిలో దూడల పోషణపై శ్రద్ధ చూపక తప్పదు. నేటి పెయ్య దూడే రేపటి పాడి పశువు అనేది అందరికీ తెలిసిందే. ఎక్కువ వ్యయ ప్రయాసలతో పాడి పశువులు కొనుగోలు చేసే బదులు, మేలు జాతి పెయ్య దూడలకు సరైన పోషణ అందించినట్లయితే చౌకగా మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చు. దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రారంభం కావాలి. ముఖ్యంగా ఆరు మాసాల చూడి నుంచి ఈనే వరకు అదనంగా దాణా ఇవ్వాలి. దీనివల్ల పుట్టిన దూడ కూడా బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చూడి పశువులకు చూడితో ఉన్నప్పుడు నట్టల నివారణ మందులు తాగించినట్లయితే దూడకు నట్టల వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు. దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు : 1 దూడ పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాల నుంచి, నోటిలో నుంచి జిగురు పొరలను తుడిచి శుభ్రం చేయాలి. 2 ఈనగానే తల్లి దూడ శరీరాన్ని నాకి శుభ్రం చేస్తుంది. అలా కాని పక్షంలో, శుభ్రమైన గోనె పట్టాతో లేదా వరి గడ్డితో శరీరంపై రుద్ది శుభ్రం చేయాలి. దూడకు జున్నుపాలు సమృద్ధిగా తాగించాలి: జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిను ‘ఎ’ ఎక్కువ పాళ్లలో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ఆంటిబాడీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. జున్నుపాలు సమృద్ధిగా తాగిన దూడకు 6 నెలల వరకు వ్యాధినిరోధకశక్తి లభిస్తుంది. దూడ ఆరోగ్యంగా త్వరగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. మరో ముఖ్య విషయమేమిటంటే.. దూడకు జున్నుపాలు ఈనిన పావుగంట లేదా అరగంట లోపలే అందివ్వాలి. ఈ సమయంలోనే జున్నుపాలలోని రోగనిరోధకశక్తిని కలిగించే ఆంటీబాడీస్ దూడ శరీరానికి పూర్తిగా అందుతాయి. ఆలస్యమైతే ఈ ఆంటీబాడీస్ వినియోగం పూర్తిగా తగ్గుతుంది. దూడకు ఆహారం: పాలు: దూడకు తన శరీర బరువులో పదోవంతు పాలు అవసరం. దూడ శరీరం 20 కిలోలుంటే, దానికి రోజుకు 2 లీటర్ల పాలు కావాలి. అదేవిధంగా దాని శరీర బరువును బట్టి మూడు నెలల వయస్సు వరకు సరాసరి రోజుకు 2 నుంచి 3 లీటర్ల పాలు తాగించాల్సిన అవసరం లేకుండా గడ్డి, దాణాతో పోషించవచ్చు. ఈ మూడు నెలల్లో సుమారు 240 లీటర్ల పాలు దూడకు అవసరం ఉంటుంది. ప్రత్యేక దాణా: దూడలకు త్వరగా జీర్ణమై, పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలు గల దాణాను, పాలతోపాటు రెండోనెల నుంచి తినటం అలవాటు చేయాలి. దూడల దాణాలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ పీచుపదార్థాలు ఉండాలి. దూడల దాణాను ఈ కింది దాణా దినుసులను ఆయా పాళ్లలో కలిపి రైతులు తయారు చేసుకోవచ్చు: (1) జొన్నలు, మొక్కజొన్నలు వంటి ధాన్యాలు 40 పాళ్లు (2) వేరుశనగ పిండి 30 పాళ్లు. (3) తవుడు 10 పాళ్లు (4) చేపల పొడి 7 పాళ్లు (5) బెల్లపు మడ్డి 10 పాళ్లు (6) ఖనిజ లవణాల మిశ్రమం 3 పాళ్లు. -
అంతర్థానమవుతున్న దేశవాళీ ఆవు
మన దేశీ ఆవుల అభివృద్ధి, పెంపకంతో అభివృద్ధి చెందిన దేశాలు పాడి, మాంసం పరిశ్రమల్లో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. రోగ నిరోధక శక్తిలో, పాల నాణ్యతలో దేశీ ఆవులకు సాటిరాని విదేశీ సంకర జాతులను మన పాలకులు ప్రోత్సహించడం విచారకరం. ప్రపంచంలోని మేలు జాతి ఆవులకు పుట్టినిల్లు భారత దేశమే. శతాబ్దాల మన గ్రామీణ జీవితంలో విడదీయరాని భాగం గా ఉన్న దేశవాళీ ఆవు మరో పదేళ్లలో అంతరించిపోనున్నదని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. వాణిజ్య వ్యవసాయ విస్తర ణతో ఆహార ధాన్యాలు తదితర పంట లను, పశువుల పెంపకాన్ని కలిసి నిర్వ హించే సంప్రదాయక వ్యవసాయం అంత రించింది. ఫలితంగా వ్యవసాయంతో పెనవేసుకున్న అను బంధ వృత్తిగా పశుపోషణ కూడా క్షీణించింది. ఆధునిక డైరీ ఫామ్ కల్చర్ విస్తరణ దేశవాళీ ఆవులు తదితర పశు జాతు లకు మరణ శాసనంగా మారుతోంది. మన తొలి పంచవర్ష ప్రణాళికలు దేశవాళీ ఆవుల పెంపకం మీదే ప్రధానంగా దృ ష్టిని కేంద్రీకరించాయి. ఏ విశిష్టతలూ లేని సాధారణ పశువు లను మాత్రమే సంకర జాతి పశు సంతతి కోసం ఉపయో గించేవారు. కానీ ఇప్పుడు ఆరోగ్యంగా, పుష్టిగా ఉండే దేశ వాళీ ఆవులనే సంకర జాతి ఆవుల సంతతి కోసం విస్తృ తంగా ఉపయోగిస్తున్నారు. వ్యాధి నిరోధకత, దీర్ఘ ఆయుర్దా యం, తక్కువ నిర్వహణ వ్యయం, పని సామర్థ్యం, అధిక పాల దిగుబడి, వేడిని తట్టుకునే శక్తి వంటి లక్షణాల్లో దేశవాళీ ఆవులు సాటి లేనివి. ఇవన్నీ విస్మరించి మన విధానకర్తలు సంకరజాతి ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా మంచి పాలు ఏ-2 రకం (మీగడ, మాంసకృత్తులను కలిగినవి). దేశవాళీ ఆవుల పాలు ఆ రకానివే. విదేశీ ఆవుల పాలు ఏ-1 రకం (మానవు లలో జీవన విధాన పరమైన వ్యాధులకు కార ణమయ్యేవి). దేశవాళీ ఆవుల పాలలో మధుమేహం, రక్తనాళాలు బిరుసె క్కడం వంటి ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణనిచ్చే ఒమే గా-3 (ఇఎఫ్ఎ) సమృద్ధిగా ఉంటుంది. ఎండలో తిరిగే దేశ వాళీ ఆవుల పాలలో మన జీవ కణాలను పరిరక్షించే బెటా - కరొటిన్ పోషక పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఏ విటమిన్ లభిస్తుంది. ఎండ ముఖమెరుగని యూరప్ డైరీ ఆవుల పాలలో డి విటమిన్ లోపం వల్ల కాల్షియం వంటి ఖనిజాలు ఒంటికి పట్టవు. కాబట్టే అభివృద్ధి చెందిన దేశాలు మన దేశవాళీ ఆవుల పెంపకంతో పాలు, మాంసం ఉత్పత్తిలో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన గిర్ ఆవు రోజుకు 56.17 లీటర్ల పాలనిస్తూ రికార్డులు బద్దలు గొట్టింది. కానీ ఆ ఆవుల ఎగుమతిలో అగ్రస్థానం బ్రెజిల్‌ది. మన సహివాల్ జాతి పాకిస్తాన్, కెన్యా తదితర దేశాల్లో శ్రేష్టమైన పాడి పశువుగా ప్రసిద్ధి చెందింది. గిర్, కంక్రెజ్, ఒంగోలు, గుజరాత్ అనే నాలుగు జాతుల సంతతితో అమెరికా సృష్టించిన బ్రాహ్మణ్ ఆవులు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయి. మన దేశవాళీ ఆవుల సంతతినే అధిక దిగుబడి జాతులుగా విదేశాల నుండి దిగుమతి చేసుకునే దుస్థితికి చేరాం. సంకరజాతి ఆవులు అధికంగా పాలను ఇస్తున్నందువ ల్లనే, దేశవాళీ ఆవులు అంతరిస్తున్నాయనడం అవాస్తవం. భారీ ఎత్తున నిర్వహించే డైరీ ఫామ్‌లలోని సంకర జాతి ఆవులలో కొన్ని మాత్రమే అంచనాల మేరకు పాల దిగుబ డిని ఇవ్వగలుగుతున్నాయి. మన దేశంలోని మొత్తం సంకర జాతులలో 99 శాతం ఆవుల్లో పాల దిగుబడి అతి తక్కువగా ఉంటోంది. వీటిలో అధిక భాగం రోజుకు 6.5 లీటర్ల కంటే ఎక్కువ పాలను ఇవ్వడం లేదు. సంకరజాతి ఆవుల్ని అధి కంగా పెంచే చిన్న రైతులు వీటి ఉత్పతి, నిర్వహణ ఖర్చు లను భరించలేకపోతున్నారు. దీంతో ఇవి వ్యాధుల బారిన పడి, గర్భం నిలవకపోవడం, ఈనడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు గురవుతున్నాయి. దీంతో వీటి పెంపకం దార్లు దివాలా తీస్తున్నారు. రోజుకు 10 లీటర్ల పాలనిచ్చే సం కర జాతి ఆవులు గిట్టుబాటు గాక కేరళ రైతులు వాటిని కబే ళాలకు పంపుతున్నారు. మన విధాన నిర్ణేతలు ఇజ్రాయిల్ వంటి దేశాల ‘విజయగాథలను’ నకలు చేయాలని ప్రయత్ని స్తారే తప్ప సంకర జాతి పశువులు రోగాల బారిన పడ కుండా జాగ్రత్తలను మాత్రం తీసుకోలేరు. దక్షిణ భారతంలో పాడి ఆవులకు సోకుతున్న ఫుట్, మౌత్ వ్యాధులు(గాళ్లు) మన సంకర జాతి పశువుల దుర్భలత్వాన్ని ఎత్తిచూపాయి. పశువుల హఠాత్ మరణాలతో సన్నకారు రైతులు సర్వస్వం కోల్పోయారు. పలు దేశవాళీ ఆవులు కూడా ఈ వ్యాధులకు గురైనా, సహజ రోగ నిరోధక శక్తితో అవి వాటిని తట్టుకుని నిలిచాయి. ఎన్ని మేలు గుణాలున్నా మన దేశవాళీ ఆవులపై పాలకులకు చిన్న చూపుపోవడం లేదు. కాబట్టే దేశవాళీ ఆవు అంతర్థాన మయ్యే పరిస్థితి దాపురించింది. (వ్యాసకర్త నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త)