అంతర్థానమవుతున్న దేశవాళీ ఆవు
మన దేశీ ఆవుల అభివృద్ధి, పెంపకంతో అభివృద్ధి చెందిన దేశాలు పాడి, మాంసం పరిశ్రమల్లో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. రోగ నిరోధక శక్తిలో, పాల నాణ్యతలో దేశీ ఆవులకు సాటిరాని విదేశీ సంకర జాతులను మన పాలకులు ప్రోత్సహించడం విచారకరం.
ప్రపంచంలోని మేలు జాతి ఆవులకు పుట్టినిల్లు భారత దేశమే. శతాబ్దాల మన గ్రామీణ జీవితంలో విడదీయరాని భాగం గా ఉన్న దేశవాళీ ఆవు మరో పదేళ్లలో అంతరించిపోనున్నదని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. వాణిజ్య వ్యవసాయ విస్తర ణతో ఆహార ధాన్యాలు తదితర పంట లను, పశువుల పెంపకాన్ని కలిసి నిర్వ హించే సంప్రదాయక వ్యవసాయం అంత రించింది. ఫలితంగా వ్యవసాయంతో పెనవేసుకున్న అను బంధ వృత్తిగా పశుపోషణ కూడా క్షీణించింది. ఆధునిక డైరీ ఫామ్ కల్చర్ విస్తరణ దేశవాళీ ఆవులు తదితర పశు జాతు లకు మరణ శాసనంగా మారుతోంది. మన తొలి పంచవర్ష ప్రణాళికలు దేశవాళీ ఆవుల పెంపకం మీదే ప్రధానంగా దృ ష్టిని కేంద్రీకరించాయి. ఏ విశిష్టతలూ లేని సాధారణ పశువు లను మాత్రమే సంకర జాతి పశు సంతతి కోసం ఉపయో గించేవారు. కానీ ఇప్పుడు ఆరోగ్యంగా, పుష్టిగా ఉండే దేశ వాళీ ఆవులనే సంకర జాతి ఆవుల సంతతి కోసం విస్తృ తంగా ఉపయోగిస్తున్నారు. వ్యాధి నిరోధకత, దీర్ఘ ఆయుర్దా యం, తక్కువ నిర్వహణ వ్యయం, పని సామర్థ్యం, అధిక పాల దిగుబడి, వేడిని తట్టుకునే శక్తి వంటి లక్షణాల్లో దేశవాళీ ఆవులు సాటి లేనివి. ఇవన్నీ విస్మరించి మన విధానకర్తలు సంకరజాతి ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా మంచి పాలు ఏ-2 రకం (మీగడ, మాంసకృత్తులను కలిగినవి). దేశవాళీ ఆవుల పాలు ఆ రకానివే. విదేశీ ఆవుల పాలు ఏ-1 రకం (మానవు లలో జీవన విధాన పరమైన వ్యాధులకు కార ణమయ్యేవి). దేశవాళీ ఆవుల పాలలో మధుమేహం, రక్తనాళాలు బిరుసె క్కడం వంటి ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణనిచ్చే ఒమే గా-3 (ఇఎఫ్‌ఎ) సమృద్ధిగా ఉంటుంది. ఎండలో తిరిగే దేశ వాళీ ఆవుల పాలలో మన జీవ కణాలను పరిరక్షించే బెటా - కరొటిన్ పోషక పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఏ విటమిన్ లభిస్తుంది. ఎండ ముఖమెరుగని యూరప్ డైరీ ఆవుల పాలలో డి విటమిన్ లోపం వల్ల కాల్షియం వంటి ఖనిజాలు ఒంటికి పట్టవు. కాబట్టే అభివృద్ధి చెందిన దేశాలు మన దేశవాళీ ఆవుల పెంపకంతో పాలు, మాంసం ఉత్పత్తిలో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన గిర్ ఆవు రోజుకు 56.17 లీటర్ల పాలనిస్తూ రికార్డులు బద్దలు గొట్టింది. కానీ ఆ ఆవుల ఎగుమతిలో అగ్రస్థానం బ్రెజిల్‌ది. మన సహివాల్ జాతి పాకిస్తాన్, కెన్యా తదితర దేశాల్లో శ్రేష్టమైన పాడి పశువుగా ప్రసిద్ధి చెందింది. గిర్, కంక్రెజ్, ఒంగోలు, గుజరాత్ అనే నాలుగు జాతుల సంతతితో అమెరికా సృష్టించిన బ్రాహ్మణ్ ఆవులు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయి. మన దేశవాళీ ఆవుల సంతతినే అధిక దిగుబడి జాతులుగా విదేశాల నుండి దిగుమతి చేసుకునే దుస్థితికి చేరాం.
సంకరజాతి ఆవులు అధికంగా పాలను ఇస్తున్నందువ ల్లనే, దేశవాళీ ఆవులు అంతరిస్తున్నాయనడం అవాస్తవం. భారీ ఎత్తున నిర్వహించే డైరీ ఫామ్‌లలోని సంకర జాతి ఆవులలో కొన్ని మాత్రమే అంచనాల మేరకు పాల దిగుబ డిని ఇవ్వగలుగుతున్నాయి. మన దేశంలోని మొత్తం సంకర జాతులలో 99 శాతం ఆవుల్లో పాల దిగుబడి అతి తక్కువగా ఉంటోంది. వీటిలో అధిక భాగం రోజుకు 6.5 లీటర్ల కంటే ఎక్కువ పాలను ఇవ్వడం లేదు. సంకరజాతి ఆవుల్ని అధి కంగా పెంచే చిన్న రైతులు వీటి ఉత్పతి, నిర్వహణ ఖర్చు లను భరించలేకపోతున్నారు. దీంతో ఇవి వ్యాధుల బారిన పడి, గర్భం నిలవకపోవడం, ఈనడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు గురవుతున్నాయి. దీంతో వీటి పెంపకం దార్లు దివాలా తీస్తున్నారు. రోజుకు 10 లీటర్ల పాలనిచ్చే సం కర జాతి ఆవులు గిట్టుబాటు గాక కేరళ రైతులు వాటిని కబే ళాలకు పంపుతున్నారు. మన విధాన నిర్ణేతలు ఇజ్రాయిల్ వంటి దేశాల ‘విజయగాథలను’ నకలు చేయాలని ప్రయత్ని స్తారే తప్ప సంకర జాతి పశువులు రోగాల బారిన పడ కుండా జాగ్రత్తలను మాత్రం తీసుకోలేరు. దక్షిణ భారతంలో పాడి ఆవులకు సోకుతున్న ఫుట్, మౌత్ వ్యాధులు(గాళ్లు) మన సంకర జాతి పశువుల దుర్భలత్వాన్ని ఎత్తిచూపాయి. పశువుల హఠాత్ మరణాలతో సన్నకారు రైతులు సర్వస్వం కోల్పోయారు. పలు దేశవాళీ ఆవులు కూడా ఈ వ్యాధులకు గురైనా, సహజ రోగ నిరోధక శక్తితో అవి వాటిని తట్టుకుని నిలిచాయి. ఎన్ని మేలు గుణాలున్నా మన దేశవాళీ ఆవులపై పాలకులకు చిన్న చూపుపోవడం లేదు. కాబట్టే దేశవాళీ ఆవు అంతర్థాన మయ్యే పరిస్థితి దాపురించింది.
(వ్యాసకర్త నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త)