సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో లబ్ధిదారులైన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే చేయూత, ఆసరా మహిళలకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం ఆ మహిళల చేత పాడి పశువుల పెంపక కేంద్రాలను (డెయిరీలు) ఏర్పాటు చేయించి పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో పాటు వారికి పాల వ్యాపారం ద్వారా మంచి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం 3.43 లక్షల గేదెలను, 2.20 లక్షల ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తొలి ఏడాది 40 వేల ఆవులను, 55 వేల గేదెలను కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. రెండో ఏడాది మరో 1.80 లక్షల ఆవులను, 2.88 లక్షల గేదెలను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా 2.97 లక్షల మేకలు, గొర్రెలను కూడా సంబంధిత మహిళలకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రచించారు. మహిళలకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయానికి తోడు బ్యాంకుల ద్వారా మరిన్ని నిధులను మంజూరు చేయించి వారి జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఇప్పటికే అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది.
మేలు జాతి పశువుల ఎంపికకు ఆదేశం
లబ్ధిదారులు ఆవు, గేదె ఏది తీసుకున్నా మేలు జాతి రకాలు ఉండేలా చూడాలని, ఇందుకోసం నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రాకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు మహిళా పాడి రైతుల నుంచి ప్రభుత్వ డెయిరీ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే పాల సేకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.514.40 కోట్ల వ్యయంతో 7,529 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఈ యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టి వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేసేలా ఆదేశాలు వెలువడ్డాయి.
75 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా..
రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 412.1 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నట్టు అంచనా. 9,889 గ్రామాల్లో పాల ఉత్పత్తి బాగా అవుతుండగా.. వాటిలో 7,529 గ్రామాల్లో పాల ఉత్పత్తి మరింత అధికంగా ఉంది. ఈ గ్రామాల్లో పాల సేకరణకు వీలుగా రైతు భరోసా కేంద్రాల వద్ద అదనంగా గదులు నిర్మిస్తారు. తద్వారా రోజూ 75 లక్షల లీటర్ల పాలను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 7,529 గ్రామాల్లో వెయ్యి నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment